Homeఅంతర్జాతీయంఐడీఎఫ్​ దాడుల్లో లెబనాన్ సైనికుడి మృతి

ఐడీఎఫ్​ దాడుల్లో లెబనాన్ సైనికుడి మృతి

– క్షమాపణలు తెలిపిన ఇజ్రాయెల్ సైన్యం

ఇదే నిజం, నేషనల్​ బ్యూరో: ఇజ్రాయెల్‌ – హమాస్‌ యుద్ధం నేపథ్యంలో ఓ ఘటనకు సంబంధించి లెబనాన్‌కు ఐడీఎఫ్‌ క్షమాపణలు చెప్పింది. హెజ్‌బొల్లా సాయుధ గ్రూపును లక్ష్యంగా చేసుకుని జరిపిన దాడిలో పొరపాటున లెబనాన్‌ సైనికుడు మృతి చెందాడు. తొలుత ఇజ్రాయెల్‌ సైన్యం అడెస్సే ప్రాంతంలో జరిపిన బాంబు దాడిలో తమ సైనికుడు మృతి చెందినట్లు లెబనాన్‌ ఆర్మీ ప్రకటించింది. దీనిపై ఇజ్రాయెల్‌ డిఫెన్స్‌ ఫోర్సెస్‌ (ఐడీఎఫ్‌) స్పందిస్తూ.. తాము హెజ్‌బొల్లా లాంచ్‌, అబ్జర్వేషన్‌ పోస్టును లక్ష్యంగా చేసుకొని దాడి చేశామని వివరణ ఇచ్చింది. కానీ, ఈ దాడిలో అనుకోకుండా పలువురు లెబనాన్‌ సైనికులు గాయపడినట్లు తమకు తెలిసిందని పేర్కొంది. వాస్తవానికి ఆ దాడిలో లెబనాన్‌ సైన్యం తమ లక్ష్యం కాదని వెల్లడించింది. ‘ఈ ఘటనకు ఐడీఎఫ్‌ క్షమాపణలు చెబుతోంది. దీనిపై దర్యాప్తు చేపట్టనుంది’అని ఇజ్రాయెల్‌ సైన్యం ప్రకటించింది. మరోవైపు ఐక్యరాజ్యసమితి శాంతి పరిరక్షక దళం దీనిపై స్పందిస్తూ.. ప్రస్తుత యుద్ధంలో లెబనాన్‌ సైనికదళాలు పాల్గొనడం లేదని పేర్కొంది.


గాజాలో పైచేయి సాధించాం: నెతన్యాహు


ప్రస్తుత యుద్ధం తర్వాత గాజాలో ఆయుధాలు లేకుండా చేయాల్సిన అవసరం ఉందని ఇజ్రాయెల్‌ ప్రధాని నెతన్యాహు ప్రకటించారు. మంగళవారం అర్ధరాత్రి ఆయన ప్రస్తంగిస్తూ.. ఐడీఎఫ్‌ మాత్రమే అది చేయగలదన్నారు. ఏ అంతర్జాతీయ దళానికి ఈ బాధ్యతలు అప్పగించబోమని తేల్చిచెప్పారు. గతంలో కూడా అంతర్జాతీయ దళాలు గాజాలో అంతగా ప్రభావం చూపించలేకపోయాయని గుర్తు చేశారు. అందుకే అటువంటి ఏర్పాట్లను తాము అంగీకరించమని వెల్లడించారు. ప్రస్తుతం గాజాలో చేపట్టిన ఆపరేషన్‌లో తమ సైన్యం పైచేయి సాధించిందని నెతన్యాహు పేర్కొన్నారు. హమాస్‌ సంస్థలోని సగానికిపైగా బెటాలియన్‌ కమాండర్లను ఇప్పటికే ఇజ్రాయెల్‌ దళాలు హతమార్చాయని ఆయన వెల్లడించారు. తమ దళాలు గాజాలోని ఖాన్‌యూనిస్‌, జబల్య పట్టణాలను చుట్టుముట్టాయని పేర్కొన్నారు.


హమాస్​ అత్యాచారాలను ఖండించాల్సిందే: జో బైడెన్


అక్టోబర్‌ 7న ఇజ్రాయెల్‌లోని మహిళలపై హమాస్‌ దళాలు జరిపిన అత్యాచారాలను అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ ఖండించారు. ‘ఈ దాడిలో బాధితులు భయంకరమైన వివరాలను వెల్లడించారు. హమాస్‌ ఉగ్రవాదులు జరిపిన లైంగిక హింసను నిస్సందేహంగా అందరూ బలంగా ఖండించాల్సిందే’అని బైడెన్‌ పేర్కొన్నారు. హమాస్‌ చర్యలపై డెమోక్రటిక్‌ పార్టీ ప్రతినిధి ప్రమీలా జైపాల్‌ సరైన విధంగా స్పందించలేదన్న విమర్శలు రావడంతో బైడెన్‌ స్వయంగా ప్రకటన చేయాల్సి వచ్చింది.

Recent

- Advertisment -spot_img