Homeహైదరాబాద్latest Newsలాటరీ పేరిటకోటి టోకరా

లాటరీ పేరిటకోటి టోకరా

– డబ్బులతో ఉడాయించిన నిర్వాహకులు
– ఆందోళనలో ఏజెంట్లు, బాధితులు
– కరీంనగర్​ టూ టౌన్​లో ఫిర్యాదు


ఇదేనిజం, కరీంనగర్ క్రైమ్: ఆర్థిక నేరాల విషయంలో ప్రభుత్వం ఎంత అవగాహనా కల్పించినా ఫలితం ఉండడం లేదు. నిత్యం ఏదో ఒకచోట బాధితులు మోసపోతూనే ఉన్నారు. తాజాగా లాటరీ పేరిట వసూలు చేసిన దాదాపు కోటి రూపాయలతో ముగ్గురు నిర్వాహకులు ఉడాయించిన ఘటన కరీంనగర్ లో మంగళవారం వెలుగు చూసింది. కరీంనగర్ రెండో పట్టణ పోలీస్ స్టేషన్ కు కూతవేటు దూరంలోనే నిర్వాహకులు ఈ దందా నడపడం గమనార్హం. బాధితుల వివరాల ప్రకారం.. కరీంనగర్ కు చెందిన ఎస్డీ సైఫొద్దీన్, ఎస్డీ ఫారూఖ్, ఎండీ అహ్మద్ అనే ముగ్గురు కలిసి రెండేళ్లుగా ‘ఎస్ కే ఫ్రెండ్స్ అండ్ కో’ పేరిట కాశ్మీరుగడ్డలో లక్కీ లాటరీని నిర్వహిస్తున్నారు. కరీంనగర్, పెద్దపల్లి, వేములవాడ, సుల్తానాబాద్, మంచిర్యాల తదితర ప్రాంతాల నుంచి 13 మంది వరకు ఏజెంట్లను నియమించుకున్నారు. ఇలా ఏజెంట్ల ద్వారా దాదాపు 560 మంది సభ్యుల నుంచి నెలకు వెయ్యి చొప్పున సుమారు 89 లక్షల 60 వేల రూపాయల వరకు వసూలు చేశారు. లాటరీ ద్వారా ప్రతినెలా కరీంనగర్ లోని ఓ గెస్ట్ హౌస్ లో డ్రా తీసి గెలిచిన 12 మంది కస్టమర్లకు 12 బహుమతులు ఇచ్చేవారు. ఇలా 14 నెలల వరకు డ్రా తీసి విజేతలకు బహుమతులు అందజేశారు. 15 వ నెల డ్రా తీసినా కూడా అప్పటి నుంచి గెలిచిన వారికి బహుమతులు ఇవ్వడం లేదు. కొత్తగా డ్రా నిర్వహించడం లేదు. అప్పటి నుంచి ఏజెంట్లు, సభ్యులు నిర్వాహకులకు ఫోన్ చేసినా స్పందించడం లేదు. వీరు కరీంనగర్ లోనే కాకుండా మంచిర్యాలలో కూడా లక్కీ లాటరీ పేరిట ఏజెంట్లను, సభ్యులను మోసం చేశారనే ఆరోపణలున్నాయి. నిర్వాహకులపై బాధితులు మంగళవారం టూ టౌన్​ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్టు సీఐ తెలిపారు.

Recent

- Advertisment -spot_img