Homeక్రైంMahadev App Scam..నిందితుడి తండ్రి అనుమానాస్పద మృతి

Mahadev App Scam..నిందితుడి తండ్రి అనుమానాస్పద మృతి

– బావిలో మృతదేహాన్ని గుర్తించిన పోలీసులు

ఇదే నిజం, నేషనల్​ బ్యూరో: చత్తీస్‌గఢ్‌లో రాజకీయంగా సంచలనం సృష్టించిన మహదేవ్‌ బెట్టింగ్‌ యాప్‌ కుంభకోణంలో కీలక నిందితుడి తండ్రి అనుమానాస్పద స్థితిలో మరణించాడు. రాష్ట్రంలోని దుర్గ్‌ జిల్లాలోని అచ్చోటి గ్రామంలో ఈ ఘటన చోటు చేసుకొంది. మహదేవ్‌ యాప్‌ కుంభకోణంలో అసిమ్‌ దాస్‌ కీలక నిందితుడు. అతడి త్రండి సుశీల్‌దాస్‌ (62) ఆచూకీ గత రెండ్రోజులుగా తెలియడం లేదు. అతడి మృతదేహాన్ని మంగళవారం స్వగ్రామంలోని ఓ బావిలో గుర్తించారు. జిల్లా సీనియర్‌ ఎస్పీ రామ్‌గోపాల్‌ గర్గ్‌ ఈ ఘటనపై మాట్లాడుతూ.. సుశీల్‌ దాస్‌ ఆత్మహత్యకు పాల్పడి ఉంటాడని అనుమానిస్తున్నామని పేర్కొన్నారు. మృతికి గల కారణాలపై దర్యాప్తు చేపట్టినట్లు తెలిపారు. సుశీల్ ఓ ప్రైవేటు కంపెనీలో సెక్యూరిటీ గార్డ్‌గా పనిచేసేవాడు. అతడి కుమారుడు అసిమ్‌ దాస్‌(కొరియర్‌), కానిస్టేబుల్‌ భీమ్‌ సింగ్‌ను మహదేవ్‌ బెట్టింగ్‌ యాప్‌ కుంభకోణంలో నవంబర్‌ 3వ తేదీన ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ అరెస్టు చేసింది. ఈ బెట్టింగ్‌ యాప్‌ ప్రమోటర్లు చత్తీస్‌గఢ్‌ సీఎం భూపేశ్‌ బఘేల్‌కు రూ.508 కోట్ల మేర ఇచ్చినట్లు ఈడీ ఆరోపించింది. ఈ కేసులో అరెస్టయిన కొరియర్‌ తొలుత తన వాంగ్మూలంలో ఈ విషయాన్ని చెప్పినట్లు దర్యాప్తు సంస్థ పేర్కొంది. అయితే, తర్వాత కొరియర్‌ మాట మార్చాడు. ఎన్నికలకు ముందు ఈ కేసు రాష్ట్ర రాజకీయాల్లో పెను దుమారం లేపింది. ఈ యాప్‌ ప్రమోటర్లలో ఒకరైన సౌరభ్‌ చంద్రకర్‌ వివాహం ఈ ఏడాది ఫిబ్రవరిలో యూఏఈలో జరిగింది. ఇందుకోసం రూ.200 కోట్లు ఖర్చు చేసినట్లు తెలిసింది. బాలీవుడ్‌ సెలబ్రిటీలను దీనికి ఆహ్వానించినట్లు ఈడీ గుర్తించింది.

Recent

- Advertisment -spot_img