Homeఫ్లాష్ ఫ్లాష్హ‌స్తం అంచ‌నాలు తారుమారు.. బోల్తా కొట్టిన వ్యూహాలు

హ‌స్తం అంచ‌నాలు తారుమారు.. బోల్తా కొట్టిన వ్యూహాలు

హైద‌రాబాద్ః తెలంగాణ‌లో కాంగ్రెస్ పార్టీ జ‌న‌స‌త్వాలపై మ‌రోసారి చ‌ర్చ సాగుతోంది. దుబ్బాక ఉప ఎన్నిక‌ల్లో ఆ పార్టీ అభ్య‌ర్థి చెరుకు శ్రీనివాసరెడ్డి మూడో స్థానంలో నిలిచారు.

బీజేపీ, టీఆర్ ఎస్ పార్టీ అభ్య‌ర్థుల‌కు 60 వేల పైచిలుకు ఓట్లు రాగా.. కాంగ్రెస్ అభ్య‌ర్థి కేవ‌లం 21,819 ఓట్ల షేర్ సాధించి ఉసూరుమ‌న్నాడు.

తెలంగాణ‌లో అధికార పార్టీ ప్ర‌త్యామ్నాయ రాజ‌కీయ పార్టీగా బీజేపీ అవ‌త‌రించ‌డంతో ఇక రాష్ట్రంలో కాంగ్రెస్ ఆశ‌లు వ‌దులుకోవాల్సిన ప‌రిస్థితి.

స్టార్ క్యాంపెయిన్ విజ‌య‌శాంతి కూడా త్వ‌ర‌లోనే బీజేపీలో చేరేందుకు రంగం సిద్ధం అవుతోంది. ఆమె ఇటీవ‌లే బీజేపీ పార్టీ ప్రెసిడెంట్ జేపీ న‌డ్డాతో న్యూఢిల్లీలో చ‌ర్చ‌లు కూడా జ‌రిపింది.

2009లో దుబ్బాకలో విజయకేతనం ఎగురవేసిన కాంగ్రెస్ పార్టీ ప్రస్తుత ఉప ఎన్నికలో మూడో స్థానానికి పరిమితం కావ‌డం ఆ పార్టీ వ‌ర్గాల‌కు మింగుడు ప‌డ‌టం లేదు.

2014, 2018 సాధారణ ఎన్నికల్లో అప‌జ‌యం క‌లిగిన క‌నీసం రెండో స్థానంతో స‌రిపెట్టుకుంది. ఇంత త‌క్కువ ఓట్లను సాధించ‌డంతో కాంగ్రెస్ పార్టీ భ‌విత‌వ్యంపై సందేహాల‌ను రేకెత్తిస్తోంది.

తెలంగాణ హస్తం పార్టీలో నెలకొన్న అస్తవ్యస్త పరిస్థితులను దుబ్బాక ఉప ఎన్నిక మ‌రోసారి ఎత్తి చూపింద‌ని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

దుబ్బాక ఉప ఎన్నికలో కాంగ్రెస్ పార్టీ ఓటమికి కార‌ణాల‌ను అన్వేషించే పనిలో కాంగ్రెస్ పెద్ద‌లు ఉన్నారు.

కాంగ్రెస్ అభ్య‌ర్థి చెరుకు శ్రీనివాసరెడ్డి అధికార పార్టీలో చేరుతున్నారని జ‌రిగిన ప్ర‌చారం పోలింగ్‌పై ప్ర‌భావం చూపింద‌ని కాంగ్రెస్ నేత‌లు ఇప్ప‌టికే ఎల‌క్ష‌న్ క‌మీష‌న్‌కు ఫిర్యాదు చేశారు.

దుబ్బాక నియోజక వర్గంలోని బలమైన రెడ్డి సామాజిక వర్గంతో పాటు, కాంగ్రెస్‌ ఓటు బ్యాంకును, ప్రభుత్వ వ్యతిరేక ఓట్లను సాధించ‌డంలో శ్రీనివాసరెడ్డితోపాటు కాంగ్రెస్ నేత‌లు విఫ‌లం అయ్యారు.

మల్లన్నసాగర్‌ బాధితుల పక్షాన చేసిన పోరాటంలో శ్రీనివాసరెడ్డి కీలక పాత్ర పోషించినా ప్ర‌జ‌లు మాత్రం బీజేపీ అభ్య‌ర్థి ర‌ఘునంద‌న్‌రావు వైపు మొగ్గ‌డం కాంగ్రెస్ అంచ‌నాల‌ను త‌ల‌కిందులు చేసింది.

Recent

- Advertisment -spot_img