Homeఫ్లాష్ ఫ్లాష్రష్యా– ఉక్రెయిన్​ విషయంలో భారత్​ వైఖరి సరైనదే

రష్యా– ఉక్రెయిన్​ విషయంలో భారత్​ వైఖరి సరైనదే

– కేంద్రం తీరును సమర్థించిన మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్
– ఢిల్లీలో జీ–20 సదస్సుల నిర్వహణ, చంద్రయాన్​–3 పై హర్షం
– సరిహద్దుల రక్షణకు మోదీ సర్కారు చర్యలు

ఇదే నిజం, నేషనల్ బ్యూరో: రష్యా-ఉక్రెయిన్‌ మధ్య జరుగుతోన్న యుద్ధం విషయంలో భారత్‌ వైఖరి సరైందేనని మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ అన్నారు. సార్వభౌమత్వం, దేశ ఆర్థిక ప్రయోజనాలకు ప్రాధాన్యత ఇచ్చి మంచి పనిచేసిందని మెచ్చుకున్నారు. అదే సమయంలో శాంతిస్థాపన ఆవశ్యకతను ప్రస్తావించిందని గుర్తు చేశారు. ఓ ఇంగ్లిష్ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన ఈ విధంగా స్పందించారు. భారత్‌ జీ– 20 సదస్సుకు అధ్యక్షత వహిస్తుండటంపైనా మన్మోహన్ తన అభిప్రాయం వ్యక్తం చేశారు.

‘నా జీవితకాలంలో భారత్‌కు జీ– 20 అధ్యక్షత బాధ్యతలు రావడం సంతోషంగా ఉంది. జీ– 20 నేతలకు భారత్ ఆతిథ్యం ఇవ్వడాన్ని నేను చూస్తున్నాను. భారత పాలనా నిర్మాణంలో విదేశాంగ విధానం కీలకం. అయితే ఇది ప్రస్తుతం పార్టీల స్వప్రయోజనాలకు ముఖ్యమైన అంశంగా మారింది’ అని అన్నారు. తన హయాంలో పార్టీ రాజకీయాల కంటే విదేశాంగ విధానానికే అధిక ప్రాధాన్యం ఉండేదన్నారు. దౌత్యాన్ని పార్టీ రాజకీయాలకు ఉపయోగించే విషయంలో సంయమనం పాటించడం ముఖ్యమని అన్ని పార్టీలకు సూచించారు.

అదేవిధంగా రష్యా-ఉక్రెయిన్‌ మధ్య నెలకొన్న ఘర్షణలపై భారత్‌ ప్రదర్శించిన వైఖరిపై మన్మోహన్ సింగ్ మాట్లాడుతూ..‘రెండు లేదా అంతకంటే ఎక్కువ దేశాల మధ్య ఘర్షణ నెలకొన్నప్పుడు ఏదోఒకదానికి మద్దతుగా నిలవడం ఇతర దేశాలకు కష్టమైన విషయం. ఈ విషయంలో దేశ సార్వభౌమత్వం, ఆర్థిక ప్రయోజనాలకు ప్రాధాన్యత ఇస్తూ భారత్ తీసుకున్న వైఖరి సరైందని భావిస్తున్నా. అలాగే సైనిక ఘర్షణను పరిష్కరించే వేదికగా జీ–20ని ఎన్నడూ పరిగణించలేదు. అయితే భద్రతాపరమైన విభేదాలను పక్కనపెట్టి వాతావరణ మార్పులు, అసమానతలు, అంతర్జాతీయ వాణిజ్యంలో విశ్వాసాన్ని నెలకొల్పే అంశాలపై ఈ వేదిక దృష్టి పెట్టడం ముఖ్యం’ అని అన్నారు.
భారత సరిహద్దుల పరిరక్షణకు మోదీ సర్కారు అన్ని చర్యలు తీసుకుంటుందని మన్మోహన్ సింగ్ ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ విషయంలో తాను ఎలాంటి సలహా ఇవ్వదల్చుకోలేదన్నారు. చంద్రయాన్‌ పేరిట 2008లో మొదలైన ప్రయోగాలు సరికొత్త శిఖరాలకు చేరుకోవడం చాలా గర్వంగా ఉందన్నారు.

Recent

- Advertisment -spot_img