Homeఆంధ్రప్రదేశ్మిచాంగ్ ఎఫెక్ట్..​ఏపీ, తెలంగాణలో భారీ వర్షాలు

మిచాంగ్ ఎఫెక్ట్..​ఏపీ, తెలంగాణలో భారీ వర్షాలు

ఇదే నిజం, తెలంగాణ/ఏపీ బ్యూరో: మిచాంగ్ తుఫాన్ ఎఫెక్ట్​తో ఆంధ్రప్రదేశ్​లోని కృష్ణా, గుంటూరు, ప్రకాశం, బాపట్ల, నెల్లూరు, చిత్తూరు జిల్లాలు వణికిపోతున్నాయి. ఆయా జిల్లాలో అతి భారీ వర్షాలు పడుతుండటంతో జన జీవనం అస్తవ్యస్తమైంది. ఆ జిల్లాల్లోని పలు కాలనీల్లో లోతట్టు ప్రాంతాలు నీట మునగడంతో స్థానికులను పునారావాస కేంద్రానికి తరలిస్తున్నారు. వర్షం, బలమైన ఈదురు గాలుల ధాటికి చాలా చోట్ల చెట్లు కూలిపోయాయి. కొన్ని ఏరియాల్లో గంటకు 90 కి.మీ వేగంతో గాలులు వీయడంతో విద్యుత్ స్తంభాలు విరిగిపడి కరెంట్​ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. నెల్లూరు పట్టణంలో దాదాపు 80 శాతం ఏరియాల్లో కరెంట్ సప్లయ్ నిలిచిపోయింది. తిరుపతి జిల్లా చిట్టేడులో అత్యధికంగా 39 సెం.మీ., నెల్లూరు జిల్లా మనుబోలులో 36.8సెం.మీ., తిరుపతి జిల్లా అల్లంపాడులో 35సెం.మీ వర్షపాతం నమోదైంది. చిల్లకూరులో 33సెం.మీ, నాయుడుపేటలో 28.7 సెం.మీ, ఎడ్గలి 24సెం.మీ, బాపట్ల 21సెం.మీ, మచిలీపట్నం 14.9 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైనట్లు అధికారులు తెలిపారు. నెల్లూరు, ప్రకాశం, గుంటూరు, బాపట్ల, కృష్ణా జిల్లాల్లో చాలా చోట్ల 10సెం.మీ కంటే ఎక్కువ వర్షపాతం నమోదైంది. ఉత్తర కోస్తా జిల్లాల్లోనూ చాలా చోట్ల మోస్తరు నుంచి విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. మరో 24 గంటలపాటు కోస్తాంధ్ర, రాయలసీమ జిల్లాలకు వర్ష సూచనలు ఉన్నాయి.


సహాయక చర్యలు చేపట్టిన ఎన్డీఆర్ఎఫ్​


నెల్లూరు జిల్లా కావలి రైల్వే స్టేషన్‌ సెంటర్‌లో తుఫాన్ ప్రభావంతో వీచిన ఈదురుగాలులకు భారీ వృక్షాలు, విద్యుత్‌ స్తంభాలు కూలిపోయాయి. సమాచారం అందుకున్న ఎన్డీఆర్‌ఎఫ్‌ సిబ్బంది ఆ ప్రాంతానికి చేరుకొని చర్యలు చేపట్టారు. అన్నమయ్య జిల్లా చిట్వేలు మండలంలో వేలాది అరటిచెట్లు నేలకొరిగాయి. నేతివారిపల్లి, నగిరిపాడు పరిధిలో సుమారు 25వేల అరటిచెట్లు నేలకూలినట్లు రైతులు అంచనా వేస్తున్నారు. తుఫాన్ ప్రభావంతో బాపట్ల జిల్లా సూర్యలంక తీరంలో అలలు ఎగసిపడుతున్నాయి. సముద్రం 20 మీటర్లు ముందుకు వచ్చింది. అక్కడి తుపాను రక్షిత భవనంలో స్థానిక గిరిజనులకు పునరావాసం కల్పించారు. వర్షం, గాలుల తీవ్రతకు సూర్యలంక బీచ్ పోలీస్ అవుట్ పోస్ట్ కూలిపోయే స్థితిలో ఉంది. సోమవారం నుంచి కురుస్తున్న భారీ వర్షానికి బాపట్ల పట్టణంలో రోడ్లపై వరదనీరు మోకాలి లోతు వరకు చేరింది. రోడ్లపై చెట్లు, విద్యుత్‌ స్తంభాలు కూలడంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.


నీట మునిగిన పంట, పొంగిపొర్లుతున్న వాగులు


బాపట్ల మండలంలో పంటలకు తీవ్ర నష్టం వాటిల్లింది. అప్పికట్లలో వేలాది ఎకరాల్లో వరి పంట నీట మునిగింది. భారీ వర్షాలతో బాపట్ల పరిధిలోని నల్లమడ, పేరలి కాలువలు ఉద్ధృతతంగా ప్రవహిస్తున్నాయి. కర్లపాలెంలో పచ్చిమిర్చి, కొరిసపాడులో పొగాకు పంటలు నీటమునిగాయి. కృష్ణా జిల్లా దివిసీమలో పంటలకు తీవ్ర నష్టం వాటిల్లింది. వరితో పాటు ఇతర పంటలు నీట మునిగాయి. బస్తాల్లోని ధాన్యం తడిసిపోవడంతో రైతులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వైఎస్‌ఆర్‌ జిల్లా కలసపాడు మండలంలో సోమవారం రాత్రి నుంచి ఎడతెరిపిలేని వర్షం కురుస్తోంది. పలు గ్రామాల్లో పంటలు దెబ్బతిన్నాయి. మండలంలోని ఎగురామాపురం ప్రాంతంలో 80 ఎకరాల్లో వ‌రి, 500 ఎకరాలపైగా మొక్కజొన్న, 80 ఎకరాలకుపైగా మిర్చి, 2వేల‌ ఎకరాలకు పైగా పొగాకు, 30ఎక‌రాల్లో ప‌సుపు, 100 ఎక‌రాల‌కు పైగా మినుము, ఉల‌వ‌ పంట‌లు దెబ్బతిన్నట్లు రైతులు తెలిపారు. రూ.కోట్లలో పంటలకు న‌ష్టం వాటిల్లడంతో రైతులు తల్లడిల్లుతున్నారు.


తెలంగాణ వ్యాప్తంగా దంచికొడుతున్న వానలు


మిచాంగ్ తుఫాన్ ఎఫెక్ట్​తో తెలంగాణలోనూ పలుచోట్ల వానలు పడుతున్నాయి. హైదరాబాద్‌తో పాటు ఉమ్మడి ఖమ్మం, నల్గొండ, వరంగల్‌, మహబూబాబాద్, నాగర్ కర్నూల్, నల్గొండ, రంగారెడ్డి, వనపర్తి, హనుమకొండ, యాదాద్రి, మేడ్చల్​ జిల్లాల్లో వర్షం పడుతోంది. హైదరాబాద్‌లోని మియాపూర్, కూకట్‌పల్లి, మూసాపేట, ఎస్‌ఆర్‌నగర్‌, సనత్‌నగర్‌, అమీర్‌పేట, ఖైరతాబాద్‌, నాంపల్లి, దిల్‌సుఖ్‌నగర్‌, ఎల్బీనగర్‌, హయత్‌నగర్‌, అబ్దుల్లాపూర్‌మెట్‌ తదితర ప్రాంతాల్లో వర్షం కురుస్తోంది. దీంతో రోడ్లన్నీ జలమయమయ్యాయి. రోడ్డుపైకి వరదనీరు చేరడంతో వాహనదారులు ఇబ్బందులు పడ్డారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని భద్రాచలం, అశ్వారావుపేట, నేలకొండపల్లి, ఇల్లెందు, అన్నపురెడ్డిపల్లి, కల్లూరు, ఆళ్లపల్లి, సత్తుపల్లిలో వర్షం పడుతోంది. వర్షంతో ఇల్లెందు సమీపంలోని సింగరేణి ప్రాంతంలో ఉపరితల గనిలో బొగ్గు ఉత్పత్తి నిలిచిపోయింది.

Recent

- Advertisment -spot_img