Minister :
సొంత పార్టీ నుంచే మంత్రికి ఘోర అవమానం.. సభలో మాట్లాడుతుండగా చెప్పులు విసిరిన పైలట్ మద్దతుదారులు
రాజస్తాన్ మాజీ ఉప ముఖ్యమంత్రి, కాంగ్రెస్ పార్టీ కీలక నేత సచిన్ పైలట్‌కు ప్రజల్లో ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.
2018లో జరిగిన రాజస్తాన్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ప్రజలు పట్టం కట్టడంలో ప్రధాన పాత్ర పైలటేనని, ఆయనపై విశ్వాసంతోనే ఎక్కువ ఓట్లు వచ్చాయని కూడా అంటుంటారు. ఆయనకు అభిమానులు ఎక్కువ. వారి అభిలాష సచిన్ పైలట్ ముఖ్యమంత్రి కావడం. కానీ పైలట్ ముఖ్యమంత్రి కాలేదన్న ఆవేశం వారిలో ఎక్కువగా ఉంది. ఒక్కోసారి ఇది బయటికి వచ్చి కొన్ని తప్పుడు చర్యలకు దారి తీస్తోంది.
తాజా, ఈ ప్రభావం వల్ల రాజస్తాన్ క్రీడా మంత్రి అశోక్ చంద్రకు చేదు అనుభవం ఎదురైంది. ఓ సభలో ఆయన ప్రసంగిస్తుండగా సచిన్ పైలట్ మద్దతుదారులు చెప్పులు విసిరారు. గుంపులో ఉన్న కొంతమంది ఒక్కసారిగా పైలట్‌కు అనుకూలంగా నినాదాలు చేయడం ప్రారంభించారు. ఆ వెంటనే వెనకాల నుంచి గుర్తు తెలియని వ్యక్తులు కొందరు అశోక్ చంద్రపై చెప్పులు విసిరారు. దీనిపై ఆయన తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. తనపై చెప్పులు విసిరితే సచిన్ పైలట్ ముఖ్యమంత్రి అవుతారనుకుంటే, ఇప్పుడే ఆయనను ముఖ్యమంత్రి చేయొచ్చని అన్నారు.