పేగు తెంచుకుని పుట్టిన కొడుకును విక్రయించిన తల్లితోపాటు మధ్యవర్తులు, కొనుగోలు చేసిన మహిళను హబీబ్‌నగర్ పోలీసులు అరెస్టు చేశారు. హైదరాబాద్ ఎంఎస్ మక్తాకు చెందిన అబ్దుల్ ముజాహిద్(29), షేక్ జోహాఖాన్(22) దంపతులు ఇటీవల హబీబ్‌నగర్ పరిధిలోని సుభాన్‌పురాకు మకాం మార్చారు. వీరికి రెండు నెలల కుమారుడున్నాడు. మద్యం తాగే అలవాటున్న ఆమెకు, భర్తకు మధ్య రోజూ గొడవలయ్యేవి. ఈనెల 3న ముజాహిద్ బంధువుల ఇంటికి వెళ్లాడు. 8న ఇంటికి రాగా కొడుకు కనిపించలేదు. నిలదీయగా సుభాన్‌పురాకు చెందిన షేక్ మహమ్మద్(30), తబస్సుం (25)లకు రూ.45వేలకు అమ్మేసినట్లు భార్య చెప్పింది. తన కొడుకును వెంటనే ఇవ్వాలని ముజాహిద్ కోరినా వారు ఇవ్వకపోవడంతో మంగళవారం పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
చంచల్‌గూడకు చెందిన ఆయేషా జబీన్(28)కి సంతానం లేరు. షేక్ మహమ్మద్, తబస్సుంల ద్వారా బాబు(2 నెలలు) విషయం తెలుసుకొన్న ఆగాపురా, సుభాన్‌పురాకు చెందిన ఆయేషాజబీన్ తల్లి షమీమ్ బేగం, పెద్దమ్మ సిరాజ్‌బేగంలు రూ.45 వేలకు కొనుగోలు చేయించారు. పోలీసులు ఆయేషా ఇంటిపై దాడి చేసి బాబును తీసుకుని తండ్రికి అప్పగించారు. ఆయేషా జబీన్, జోహాఖాన్, షేక్ మహమ్మద్, తబస్సుం, షమీమ్ బేగం, సిరాజ్ బేగంలను అరెస్టు చేశారు. కేసును ఛేదించిన పోలీసులను ఏసీపీ అభినందించారు.
బిడ్డని అమ్మిన తల్లికి రిమాండ్…
RELATED ARTICLES