Homeహైదరాబాద్latest Newsజహీరాబాద్‌పై ఎవరి ధీమా వారిదే..!

జహీరాబాద్‌పై ఎవరి ధీమా వారిదే..!

  • ఎగ్జిట్‌పోల్‌ ఫలితాలపై ఉత్కంఠ
  • కాంగ్రేస్, బీజేపీల మద్యే పోటీ
  • మహిళా ఓటర్లే కీలకం
  • రేపే తెలనున్న ఫలితాలు
    ఇదే నిజం, జోగిపేటః
    జహీరాబాద్‌ లోకసభ ఫలితాలు ఉత్కంఠ రేపుతున్నాయి. ఈ స్థానంపై కాంగ్రేస్, బీజేపీ పార్టీలు మేమంటే మేమే గెలుపొందుతామన్న ధీమాతో ఉన్నాయి. ఎగ్జిట్‌పోల్‌ సర్వేలు మాత్రం బీజేపీకి అవకాశం ఉందని కొన్ని సర్వేలు, మరికొన్ని కాంగ్రేస్‌ గెలిచే అవకాశాలు ఉన్నట్లు ప్రకటించడంతో రెండు పార్టీల కార్యకర్తలు, నాయకులు ఆందోళన చెందుతున్నారు. ఫలితాలు ఎప్పుడెప్పుడు వస్తాయోనంటూ ఆత్రుతతో ఉన్నారు. బీఆర్‌ఎస్‌ పార్టీ మాత్రం ఈ ఎన్నికల్లో గట్టిపోటీ నివ్వలేకపోయిందన్న విషయాన్ని విశ్లేషకులు భావిస్తున్నారు. లోకసభ నియోజకవర్గం పరిధిలో 16,41,410 లక్షల ఓటర్లు ఉన్నారు. ఈ ఎన్నికల్లో బీజేపీ తరపున బీబీ పాటిల్, కాంగ్రేస్‌ తరపున సురేష్‌ షెట్కార్, బీఆర్‌ఎస్‌ పార్టీ తరపున గాలి అనీల్‌కుమార్‌లతో పాటు స్వతంత్ర అభ్యర్థులు పోటీలో ఉన్నారు. నెల రోజుల పాటు ఎవరికి వారు పోటాపోటీగా ప్రచారాన్ని నిర్వహించారు. బీజేపీ మాత్రం నియోజకవర్గంలో కామారెడ్డి అసెంబ్లీ నియోజకవర్గంలో మాత్రమే చెప్పుకోదగ్గ స్థాయిలో కేడర్‌ ఉండగా మిగతా చోట్ల ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో 20వేల ఓట్లలోపు మాత్రమే ఓట్లు సంపాదించుకోగలిగారు.
    మహిళా ఓటర్లే కీలకం…
    జహీరాబాద్‌ లోకసభ నియోజకవర్గం పరిధిలో 16,41,410 ఓటర్లుండగా ఈ ఎన్నికల్లో 12,25,049 మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఇందులో మహిళలు 6,16,936 మంది మహిళలు, 6,08,097 మంది పురుషులు ఓటు హక్కును వినియోగించుకున్నారు. మెజార్టీ స్థాయిలో మహిళలే ఓటు హక్కు వినియోగించుకోవడంతో ఈ ఎన్నికల్లో మహిళలే కీలకం కానున్నారు. నియోజకవర్గం పరిధిలో అందోలు, నారాయణఖేడ్, జహీరాబాద్, ఎల్లారెడ్డి, కామారెడ్డి, జూక్కల్, బాన్సువాడ అసెంబ్లీ నియోజకవర్గాలున్నాయి. పోటీ కాంగ్రేస్, బీజేపీ పార్టీల మద్యనే పోటీ ఉందన్న ప్రచారం జరిగింది.
    పెరిగిన ఓటింగ్‌ ఎవరికి అనుకూలం?
    జహీరాబాద్‌ లోకసభ ఎన్నికల పరిధిలో ఈ సారి జరిగిన ఎన్నికల్లో పోలింగ్‌ శాతం పెరిగింది. పెరిగిన ఓటింగ్‌ ఎవరికి లాభం అన్న విషయమై బీజేపీ, కాంగ్రేస్‌ పార్టీలు బేరీజు వేసుకుంటున్నాయి. 2019 లో 69.67 శాతం, ఇటీవల జరిగిన ఎన్నికల్లో 74.63 శాతం నమోదయ్యింది. పెరిగిన ఓటింగ్‌ శాతంపై బీజేపీ తమకు అనుకూలంగానే ఫలితాలు ఉంటాయన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తుంది. పోల్‌ మేనేజ్‌మెంట్‌లో బీజేపీ ముందున్నట్లుగా ప్రచారం జరుగుతుంది. ఇతర ప్రాంతాల నుంచి ఓటర్లను కేంద్రాలకు తీసుకువచ్చేలా బీజేపీ మేనేజ్‌మెంట్‌ చేసినట్లుగా తెలిసింది.
    అందోలు, జహీరాబాద్, ఎల్లారెడ్డిలపై ఆశలు
    లోకసభ నియోజకవర్గం పరిధిలోని అందోలు, జహీరాబాద్, ఎల్లారెడ్డి, జుక్కల్‌ అసెంబ్లీ నియోజవకర్గాల పరిధిలో కాంగ్రేస్‌ పార్టీకి అనుకూలంగా ఓట్లు పోలయ్యాయని, కామారెడ్డి, నారాయణఖేడ్‌ నియోజకవర్గాల్లో బీజేపీకి అనుకూలంగా పోలయ్యాయని, బాన్సువాడలో బీఆర్‌ఎస్‌ పార్టీకి ఎక్కువ శాతం పోలయినట్లుగా విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే ప్రతి నియోజకవర్గంలోని పట్టణాల్లో బీజేపీ పార్టీకి అనుకూలంగా, కేంద్రంలో నరేంద్రమోడీ ప్రధానిగా ఉండాలని ఓటర్లు తమ ఓటును ఏ పార్టీకి ఓటు వేయాలో నిర్ణయించినట్లుగా తెలిసింది.
    బీజేపీకి మారిన బీఆర్‌ఎస్‌ ఓట్లు…?
    జహీరాబాద్‌ లోకసభ ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ పార్టీ గట్టిపోటీని ఇచ్చే పరిస్థితి కనిపించకపోవడంతో బీఆర్‌ఎస్‌ పార్టీ కార్యకర్తలు, నాయకులు తమ ఓట్లను బీజేపీ వైపుకు త్రిప్పినట్లుగా జోరుగా ప్రచారం జరుగుతుంది. గ్రామాల్లో ఏమాత్రం బలంగా లేని బీజేపీ ఈ సారి ప్రతి గ్రామంలోనూ కాంగ్రెస్, బీజేపీలు నువ్వా, నేనా అన్నట్లుగా ఓట్లు పోలయినట్లు తెలుస్తుంది. కాంగ్రెస్ గ్రామాల్లో సైతం బీజేపీకి అనుకూలంగా పోలయినట్లు తెలిసింది. అందోలు నియోజకవర్గంలోని జోగిపేట పట్టణంలో ఓటర్లకు ఓటుకు నోటును అందజేసినట్లుగా చెబుతున్నారు. అంతే కాకుండా నియోజకవర్గంలోని మాజీ సర్పంచ్‌లందరికి బీజేపీ ఓట్ల మార్పిడి పై చేతులు మారినట్లు తెలిసింది. ఈనెల 4న వెలువడే ఫలితాలు ఎలా ఉంటాయో వేచిచూడాల్సి ఉంది.

Recent

- Advertisment -spot_img