HomeతెలంగాణNational Herald Case : అస‌లు నేషనల్ హెరాల్డ్ అంటే ఏంటి, సోనియా, రాహుల్ గాంధీలపై...

National Herald Case : అస‌లు నేషనల్ హెరాల్డ్ అంటే ఏంటి, సోనియా, రాహుల్ గాంధీలపై ఆరోపణలేమిటి

National Herald Case : అస‌లు నేషనల్ హెరాల్డ్ అంటే ఏంటి, సోనియా, రాహుల్ గాంధీలపై ఆరోపణలేమిటి

National Herald Case : అవినీతి ఆరోపణలకు సంబంధించి కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనిగాంధీ గురువారం నాడు కేంద్ర ప్రభుత్వ సంస్థ ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ ఎదుట హాజరవుతున్నారు.

అదే సమయంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు.. దేశ వ్యాప్తంగా నిరసన చేపట్టారు.

నేషనల్ హెరాల్డ్ కేసులో మనీ లాండరింగ్ ఆరోపణలపై వివరణ ఇవ్వటానికి కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీని, ఆమె కుమారుడైన రాహుల్ గాంధీని తమ ముందు హాజరు కావలసిందిగా ఈడీ జూన్ ఆరంభంలో సమన్లు జారీ చేసింది.

అప్పుడు సోనియా గాంధీకి కోవిడ్ సోకటంతో ఈడీ ఎదుట హాజరవటానికి కొంత గడువు కావాలని ఆమె కోరారు. అప్పుడు రాహుల్ గాంధీని ఈడీ సుదీర్ఘంగా విచారించింది.

అప్పుడు కూడా కాంగ్రెస్ కార్యకర్తలు ఈడీ కార్యాలయం దగ్గర, దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో నిరసనలు చేపట్టారు.

తాజాగా సోనియా గాంధీ ఈడీ విచారణకు హాజరవుతున్నారు. ఈ నేపథ్యంలో నేషనల్ హెరాల్డ్ అవినీతి ఆరోపణల కేసు ఏమిటో చూద్దాం.

అధికార భారతీయ జనతా పార్టీ నాయకుడు, పార్లమెంటు సభ్యుడు సుబ్రమణ్యం స్వామి ఈ కేసు వేశారు.

కొంత కాలం కిందట మూతపడిన నేషనల్ హెరాల్డ్ అనే వార్తాపత్రికను ప్రచురించే సంస్థను కొనుగోలు చేయటానికి సోనియా, రాహుల్ గాంధీలు కాంగ్రస్ పార్టీ నిధులను దుర్వినియోగం చేశారని ఆయన ఆరోపణలు చేశారు.

నేషనల్ హెరాల్డ్ పత్రిక కొన్నేళ్ల కిందట మూతపడింది.

ఎలాంటి ఆర్థిక అవకతవకలకూ తాము పాల్పడలేదని సోనియా, రాహుల్‌లు వాదిస్తున్నారు.

నేషనల్ హెరాల్డ్ ఏమిటి?

నేషనల్ హెరాల్డ్ వార్తా పత్రికను 1938లో జవహర్‌లాల్ నెహ్రూ ప్రారంభించారు.

రాహుల్ గాంధీ ముత్తాత అయిన నెహ్రూ 1947లో భారతదేశపు తొలి ప్రధానమంత్రి అయ్యారు.

అసోసియేటెడ్ జర్నల్స్ లిమిటెడ్ (ఏజేఎల్) అనే సంస్థ నేషనల్ హెరాల్డ్ పత్రికను ప్రచురించేది.

1937లో స్థాపితమపైన ఆ సంస్థలో మరో 5,000 మంది స్వాతంత్ర్యోద్యమకారులు భాగస్వాములుగా (షేర్‌హోల్డర్లు) ఉండేవారు.

ఆ కంపెనీ మరో రెండు – ఉర్దూలో క్వామీ ఆవాజ్, హిందీలో నవజీవన్ – దినపత్రికలను కూడా ప్రచిరించేది.

ఆ కాలపు అత్యంత ప్రభావవంతమైన నాయకులు రూపుదిద్దిన నేషనల్ హెరాల్డ్ పత్రిక.. భారత స్వాతంత్ర్యోద్రమ పోరాటంతో మమేమకమై దేశపు అతి గొప్ప జాతీయవాద వార్తాపత్రికగా గౌరవం పొందింది.

నెహ్రూ తరచుగా బలమైన పదజాలంతో వ్యాసాలు రాసే ఆ పత్రిక నిశిత ఉద్రేకపూరిత సంపాదక శైలిని నాటి బ్రిటిష్ ప్రభుత్వం హేళన చేసేది.

అయితే 1942లో ఆ పత్రికను బ్రిటిష్ సర్కారు నిషేధించటంతో అది మూత పడింది. మళ్లీ మూడేళ్ల తర్వాత పత్రిక ప్రచురణ తిరిగి ప్రారంభమైంది.

1947లో భారతదేశం స్వాతంత్ర్యం పొందినపుడు ప్రధానమంత్రి పదవి చేపట్టిన నెహ్రూ.. నేషనల్ హెరాల్డ్ వార్తాపత్రిక బోర్డు చైర్మన్ పదవికి రాజీనామా చేశారు.

కానీ ఆ వార్తాపత్రిక సిద్ధాంతానికి రూపునివ్వటంలో కాంగ్రెస్ పార్టీ భారీ పాత్రను పోషించటం కొనసాగింది.

1963లో నేషనల్ హెరాల్డ్ రజతోత్సవాల సందర్భంగా నెహ్రూ ఇచ్చిన సందేశంలో.. ”స్వతంత్ర దృక్పథాన్ని కొనసాగిస్తూనే కాంగ్రెస్ విధానానికి అనుకూలంగా” ఉండే అంశం గురించి స్వయంగా మాట్లాడారు.

నేషనల్ హెరాల్డ్ పత్రికకు కాంగ్రెస్ పార్టీ నిధులు కొనసాగుతున్నా కూడా.. భారతదేశపు ఉత్తమ పాత్రికేయులు కొందరి సారథ్యంలో అగ్రస్థాయి ఆంగ్ల దినపత్రికల్లో ఒకటిగా అది నిలిచింది.

కానీ ఆర్థిక కారణాల వల్ల ఈ పత్రిక 2008లో మరోసారి మూతపడింది.

మళ్లీ 2016లో పత్రికను డిజిటల్ పబ్లికేషన్ రూపంలో పునఃప్రారంభించారు.

కాంగ్రెస్ మీద ఆరోపణలు ఏమిటి?

సుబ్రమణ్యంస్వామి 2012లో గాంధీల మీద ఒకట ట్రయల్ కోర్టులో కేసు వేశారు.

ఏజేఎల్ సంస్థకు చెందిన 2,000 కోట్ల రూపాయలకు పైగా గల ఆస్తులను హస్తగతం చేసుకోవటం కోసం గాంధీలు ఆ సంస్థను తమ యాజమాన్యంలోకి తెచ్చుకోవటానికి కాంగ్రెస్ పార్టీ నిధులను ఉపయోగించుకున్నారని ఆయన ఆరోపించారు.

2008లో నేషనల్ హెరాల్డ్‌ను మూసివేసేటపుడు ఏజేఎల్ సంస్థ కాంగ్రెస్ పార్టీకి మొత్తం 90 కోట్ల రూపాయలు బకాయి ఉంది.

2010లో కాంగ్రెస్ పార్టీ ఈ బకాయిని యంగ్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్‌కు కేటాయించింది. లాభాపేక్ష లేని ఈ సంస్థను అప్పటికి కొన్ని నెలల ముందు స్థాపించారు.

ఆ సంస్థ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్లలో సోనియా గాంధీ, రాహుల్ గాంధీలు ఉన్నారు. కంపెనీలో వారిద్దరికీ చెరొక 38 శాతం వాటా ఉంది.

మిగతా 24 శాతం వాటా కాంగ్రెస్ నాయకులు మోతీలాల్ వోరా, ఆస్కార్ ఫెర్నాండెజ్, పాత్రికేయుడు సుమన్ దూబే, పారిశ్రామికవేత్త శాం పిట్రోడాల యాజమాన్యంలో ఉంది. సుబ్రమణ్యం స్వామి వేసిన కేసులో వారి పేర్లు కూడా నిందితులుగా చేర్చారు.

వేల కోట్ల విలువైన ఆస్తులను ‘అక్రమంగా సొంతం చేసుకోవటానికి’ గాంధీలు ఈ సాకును ఉపయోగించుకున్నారనేది సుబ్రమణ్యం స్వామి ఆరోపణ.

ఏజేఎల్ సంస్థ మీద, దానికి సంబంధించి దిల్లీ, లక్నో, ముంబై తదితర నగరాల్లో ఉన్న స్థిరాస్థుల మీద యంగ్ ఇండియా సంస్థ పూర్తి నియంత్రణ పొందిందని బీజేపీ నాయకుడు ఆరోపించారు.

కాంగ్రెస్ పార్టీ ఏం చెప్తోంది?

ఇది ”మనీ (డబ్బు) ఏమీ లేకుండానే మనీ లాండరింగ్ జరిగిందనే ఆరోపణలతో కూడిన వింత కేసు” అని కాంగ్రెస్ పార్టీ అభివర్ణించింది.

భారతదేశం స్వాతంత్ర్యం పొందిన తర్వాత దేశాన్ని అత్యధిక కాలం పరిపాలించిన కాంగ్రెస్ పార్టీ ”భయంతో తలవంచద”ని, ”పోరాటం చేస్తుంద”ని ఆ పార్టీ పేర్కొంది.

ఏజేఎల్ ఆర్థిక సమస్యల్లో చిక్కుకున్నపుడు ఆ సంస్థను కాంగ్రెస్ పార్టీ గట్టెక్కించిందని, దాని చారిత్రక వారసత్వం మీద కాంగ్రెస్ పార్టీకి గల విశ్వాసమే దీనికి కారణమని ఆ పార్టీ చెప్తోంది.

కాలక్రమంలో కాంగ్రెస్ పార్టీ ఏజేఎల్‌కు 90 కోట్ల రూపాయలు అప్పుగా ఇచ్చింది.

2010లో ఏజేఎల్ తన బకాయిలకు బదులుగా సంస్థలో వాటాలు ఇవ్వటంతో అది అప్పుల నుంచి విముక్తమైందని, ఆ షేర్లను కొత్తగా ఏర్పాటు చేసిన యంగ్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్‌కు కేటాయించిందని కాంగ్రెస్ పార్టీ చెప్తోంది.

యంగ్ ఇండియా అనేది ”లాభాపేక్ష లేని సంస్థ” అని, ఆ సంస్థ షేర్ హోల్డర్లకు కానీ, డైరెక్టర్లకు కానీ ఎలాంటి డివిడెండ్లూ (లాభాలల్లో వాటాలు) చెల్లించలేదని కాంగ్రస్ పార్టీ పేర్కొంది.

”నేషనల్ హెరాల్డ్ పత్రిక యజమానిగా, ప్రచురణకర్తగా, ముద్రణకర్తగా ఏజేఎల్ సంస్థే కొనసాగుతోంది.

ఆస్తుల విషయంలో ఎలాంటి మార్పు కానీ, బదలాయింపు కానీ లేదు” అని ఏజేఎల్ ఉద్ఘాటిస్తోంది.

నేషనల్ హెరాల్డ్ పత్రికను లక్ష్యంగా చేసుకోవటం ద్వారా.. ”భారత స్వాతంత్ర్య సమర యోధులను, దేశపు మహోన్నత నేతలను, స్వాంత్ర్యోద్యమానికి వారు చేసిన కృషిని బీజేపీ అవమానిస్తోంది” అని కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి అభిషేక్ మను సింఘ్వీ విమర్శించారు.

బీజేపీ ప్రభుత్వం ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్‌ను, చట్టాన్ని అమలు చేసే ఇతర కేంద్ర ప్రభుత్వ సంస్థలను తన రాజకీయ ప్రత్యర్థులను వేధించటానికి వారికి వ్యతిరేకంగా ఉపయోగిస్తోందని కూడా ఆయన ఆరోపించారు.

ప్రధానమంత్రి నరేంద్రమోదీ నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వం తన విమర్శకులను లక్ష్యంగా చేసుకోవటానికి ప్రభుత్వ సంస్థలను ఉపయోగిస్తోందనే ఆరోపణలు విస్తృతంగా ఉన్నాయి.

Recent

- Advertisment -spot_img