Homeక్రైం‘డీప్​ ఫేక్​’ ను అరికట్టేందుకు కొత్త చట్టం తీసుకొస్తం

‘డీప్​ ఫేక్​’ ను అరికట్టేందుకు కొత్త చట్టం తీసుకొస్తం

– కేంద్ర ఐటీ శాఖ సహాయ మంత్రి చంద్రశేఖర్

ఇదే నిజం, నేషనల్ బ్యూరో: డీప్‌ఫేక్‌ వీడియోలు, నకిలీ సమాచార వ్యాప్తిని అరికట్టే దిశగా కేంద్రం చర్యలకు సిద్ధమైంది. ఇందులో భాగంగానే సోషల్‌ మీడియా సంస్థలతో కేంద్రం త్వరలో సమావేశం జరపనుంది. ఈ నేపథ్యంలో కేంద్ర ఐటీశాఖ సహాయ మంత్రి రాజీవ్‌ చంద్రశేఖర్‌ మాట్లాడుతూ.. కీలక వ్యాఖ్యలు చేశారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ), డీప్‌ ఫేక్‌ వంటి సాంకేతికతతో సృష్టించే నకిలీ సమాచారం నుంచి ప్రజలకు రక్షణ కల్పించేందుకు చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు. అవసరమైతే ఇందుకోసం కొత్త చట్టం తీసుకొస్తామని ఓ జాతీయ మీడియా సంస్థకు వెల్లడించారు. ‘సాధికారత, వృద్ధి, సృజనాత్మకతకు ఏఐ బలమైన సాధనమే అయినప్పటికీ.. కొంతమంది దాన్ని దుర్వినియోగం చేస్తున్నారన్న విషయాన్ని మర్చిపోవద్దు. టెక్నాలజీ సాయంతో వీరు నకిలీ, విద్వేషపూరిత సమాచారాన్ని వ్యాప్తి చేసి.. సమాజంలో గందరగోళం సృష్టించేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇలాంటి డీప్‌ఫేక్‌ వీడియోలు, నకిలీ సమాచారం ప్రజల భద్రతకు ప్రమాదకరంగా మారుతున్నాయి.

ఇలాంటి వాటిని అరికట్టేందుకు ఇప్పటికే మేం ఐటీ నిబంధనలు తీసుకొచ్చాం’అని రాజీవ్‌ చంద్రశేఖర్‌ తెలిపారు. వీటి వ్యాప్తిని అడ్డుకునేందుకు కొత్తగా ఫ్రేమ్‌వర్క్‌ను రూపొందిస్తున్నామని కేంద్రమంత్రి తెలిపారు. డీప్‌ఫేక్‌, నకిలీ సమాచార వ్యాప్తిని అడ్డుకునేందుకు అవసరమైతే కొత్త చట్టం తీసుకొస్తామని వెల్లడించారు. ఈ అంశంపై సామాజిక మాధ్యమ సంస్థలతో కేంద్రం సమావేశం కానున్న నేపథ్యంలో రాజీవ్‌ చంద్రశేఖర్‌ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. ఇటీవల కొందరు సినీతారల డీప్‌ఫేక్‌ వీడియోలు కలకలం రేపిన విషయం తెలిసిందే. దీనిపై ప్రధాని మోదీ కూడా గతవారం స్పందిస్తూ.. డీప్‌ఫేక్‌ వీడియోలు ఆందోళనకరమన్నారు. దీనిపై ప్రజలకు అవగాహన కల్పించాలని మీడియాను కోరారు. ఈ నేపథ్యంలోనే చర్యలకు సిద్ధమైన కేంద్ర ప్రభుత్వం..ఈ గురు, శుక్రవారాల్లో సోషల్ మీడియా సంస్థల ప్రతినిధులతో భేటీ కానుంది.

Recent

- Advertisment -spot_img