Homeహైదరాబాద్latest Newsతెలంగాణ నూతన చిహ్నం రెడీ.. రాష్ట్ర ఆవిర్భావ వేడుకల్లో కొత్త లోగో ఆవిష్కరణ

తెలంగాణ నూతన చిహ్నం రెడీ.. రాష్ట్ర ఆవిర్భావ వేడుకల్లో కొత్త లోగో ఆవిష్కరణ

ఇదే నిజం, తెలంగాణ బ్యూరో: రాష్ట్ర నూతన చిహ్నం తుది రూపు సిద్ధమైంది. అమరవీరుల పోరాటం, త్యాగాలను ప్రతిబింబించేలా రాష్ట్ర చిహ్నం ఉంటుందని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. కళాకారుడు రుద్ర రాజేశం రూపొందించిన నమూనాపై బుధవారం సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. ప్రస్తుతం ఉన్న రాచరిక గుర్తులను చెరిపేస్తూ.. ప్రజాస్వామ్యం, ఉద్యమ స్ఫూర్తిని ప్రతిబింబించేలా కొత్త లోగోను తయారు చేసే దిశగా కసరత్తు చేస్తున్నట్లు ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. అందుకోసం 12 నమూనాలు తయారు చేయించారు. ఈ విషయమై ఇటీవల సీపీఐ, సీపీఎం నేతలతో పాటు ఉద్యమకారులు, పార్టీ నేతలు, కొందరు అధికారులతోనూ సీఎం చర్చించారు. ప్రస్తుత చిహ్నంలోని కాకతీయ కళా తోరణాన్ని తొలగించాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే అంతర్జాతీయంగా గుర్తింపు ఉన్న చార్మినార్, మూడు సింహాలు, జాతీయ జెండాలోని మూడు రంగులను కొనసాగిస్తూనే.. పోరాటం, త్యాగాలను ప్రతిబింబించేలా మరో గుర్తు పెట్టాలని కొన్ని రోజులుగా పలువురు సూచించినట్లు సమాచారం. రెండ్రోజుల క్రితం రుద్ర రాజేశంతో చర్చించిన సీఎం కొన్ని మార్పులను సూచించారు. బుధవారం తుది రూపంపై సీఎం సమీక్షలో రుద్ర రాజేశం, మంత్రి జూపల్లి కృష్ణారావు, ప్రొఫెసర్ కోదండరాం, అద్దంకి దయాకర్, జేఏసీ నేత రఘు, సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి, పలువురు నేతలు పాల్గొన్నారు. సిద్ధమైన కొత్త లోగోను తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో ఆవిష్కరించనున్నారు.

సోషల్​ మీడియాలో వైరల్ అవుతోన్న లోగోలు..
అధికారిక చిహ్నానికి సంబంధించిన మూడు రకాల లోగోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. తెలంగాణ కొత్త రాజముద్ర ఇదేనంటూ.. ఆ మూడు లోగోల ఫొటోలను వైరల్ చేస్తున్నారు. వైరల్ అవుతున్న ఫొటోల్లో మొదటి లోగో మధ్యలో పూర్ణకుంభం.. పైభాగంలో మూడు సింహాల రాజముద్ర, కింది భాగంలో చార్మినార్ బొమ్మ ఉంది. పూర్ణకుంభం ఇరువైపులా తంగేడు ఆకులు కూడా ఉన్నాయి. రెండో లోగోలో పైభాగంలో మూడు సింహాల రాజముద్ర, మధ్యలో తెలంగాణ మ్యాప్, కింది భాగంలో హుస్సేస్ సాగర్‌లోని బొమ్మ కనిపిస్తోంది. మూడో లోగోలోనూ.. పైభాగంలో మూడు సింహాల చిహ్నం ఉండగా.. మధ్యలో వెలుగుతున్న సూర్యున్ని తలపించేలా ఓ గుర్తు ఉండి.. దాని చూట్టూ నీటి బిందువుల ఆకారాలు విస్తరించి ఉన్నాయి. ఇదిలా ఉంటే.. ఈ మూడు చిహ్నాల్లో నాలుగు భాషల్లో (తెలుగు, ఇంగ్లీష్, హిందీ, ఉర్దు) తెలంగాణ పేరు కనిపిస్తోంది.

13 చరణాలతో జయ జయహే తెలంగాణ
తెలంగాణ రాష్ట్ర గీతం ‘జయ జయహే తెలంగాణ’ ఆవిష్కరణకు అంతా సిద్ధమైంది. ఇందుకు సంబంధించిన కసరత్తును ప్రభుత్వం పూర్తి చేసింది. మొత్తం 13 చరణాలతో కూడిన పాటను సిద్ధం చేశారు. 2 నిమిషాల 30 సెకన్లతో రాష్ట్ర గీతం సాగనున్నట్లు తెలుస్తోంది. ఇందుకు సంబంధించి అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా జూన్‌ 2న ప్రజల ముందుకు రాష్ట్ర గీతాన్ని తీసుకురానున్నారు. ఈ సందర్భంగా బుధవారం సినీ మ్యూజిక్ డైరెక్టర్ ఎం.ఎం.కీరవాణి, ఆయన టీమ్.. సీఎం రేవంత్‌రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తదితరులను కలిశారు. కీరవాణి స్వరపరిచిన పాటను వారు విన్నారు. అందెశ్రీ రాసిన ఈ గీతం సుమారు 6 నిమిషాల నిడివి ఉంది. ప్రతిఒక్కరూ సులువుగా ఆలపించేలా కీరవాణి, ఆయన టీమ్ ఈ పాటను అందుబాటులోకి తెచ్చినట్లు తెలుస్తోంది. సీఎంతో పాటు, గీత రచయిత అందెశ్రీ, ప్రొఫెసర్ కోదండరామ్‌ తదితరులు సమావేశంలో ఉన్నారు.

Recent

- Advertisment -spot_img