Homeహైదరాబాద్latest Newsప్రముఖ తెలుగు న్యూస్ రీడర్ కన్నుమూత

ప్రముఖ తెలుగు న్యూస్ రీడర్ కన్నుమూత

Hyderabad : తొలి తెలుగు NewsReader శాంతి స్వ‌రూప్ కన్నుమూశారు. దూరదర్శన్‌ తెలుగు ప్రసారాల్లో వార్తలు చదువుతూ తెలుగు ప్రజలకు చేరువైన శాంతిస్వరూప్‌ ప్రైవేట్ శాటిలైట్ ఛానల్స్ రాక ముందు తెలుగు ప్రజలందరికి సుపరిచితులైన వార్తా ప్రయోక్తగా గుర్తింపు పొందారు.
80,90వ దశకాల్లో ఆయన గొంతు తెలియని తెలుగు ప్రజలు లేరంటే అతిశయోక్తి కాదు. డీడీ తెలుగు ప్రసారాలు ప్రారంభమైన తర్వాత న్యూస్‌ రీడర్‌గా కెరీర్ సాగింది. పదవీ విరమణ చేసే వరకు ఆయన డీడీలో అదే వృత్తిలో కొనసాగారు. 2011లో పదవీ విరమణ చేశారు. కొద్ది రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న శాంతి స్వరూప్‌ హైద‌రాబాద్ య‌శోదా ఆస్ప‌త్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచిన‌ట్లు ఆయ‌న కుటుంబ స‌భ్యులు తెలిపారు. రెండు రోజుల క్రితం శాంతిస్వ‌రూప్ గుండెపోటుతో యశోదా ఆస్ప‌త్రిలో చేరారని ఆయన కుమారుడు తెలిపారు. శాంతిస్వ‌రూప్ మృతిపై పలువురు ప్రముఖులు సంతాపం తెలిపారు. తెలుగు రాష్ట్రాలకు చెందిన రాజ‌కీయ ప్ర‌ముఖులు, జ‌ర్న‌లిస్టులు సంతాపం వ్య‌క్తం చేశారు. ఆయ‌న కుటుంబ స‌భ్యుల‌కు ప్ర‌గాఢ సానుభూతి తెలిపారు.

1983 న‌వంబ‌ర్ 14న దూరద‌ర్శ‌న్ ఛానెల్‌లో శాంతి స్వ‌రూప్ తెలుగులో తొలిసారి వార్త‌లు చ‌దివారు. అప్పట్లో వార్తలు చదవడానికి ఇప్పటి మాదిరి న్యూస్‌ ప్రాంప్టర్‌ సౌకర్యం ఉండేది కాదు. ప‌దేళ్లకు పైగా టెలీప్రాంప్ట‌ర్ సదుపాయం లేకుండానే కేవలం పేప‌ర్లపై రాసిచ్చిన వార్తల్ని చూసి ఆయన ప్రజలకు వినిపించే వారు. తడబాటు లేకుండా స్పష్టమైన ఉచ్చరణతో ఎప్పుడు విన్నా టక్కున గుర్తు పట్టే స్వరంతో తెలుగు ప్రజలకు ఆయన చేరువ అయ్యారు. రేడియోల శకం ముగిసి, టీవీ వార్తలు మొదలయ్యాక దూరదర్శన్‌లో మొదట్లో సాయంత్రం పూట మాత్రమే వార్తలు ప్రసారం అయ్యేవి. న్యూస్‌ రీడర్‌గా ప్రేక్షకులకు శాంతి స్వరూప్ అనతి కాలంలోనే చేరువ అయ్యారు. 2011లో ప‌ద‌వీ విర‌మ‌ణ చేసే వ‌ర‌కు శాంతి స్వ‌రూప్ వార్త‌లు చ‌దివారు. ఆయన న్యూస్‌ రీడర్‌గా లైఫ్ టైమ్ అచీవ్‌మెంట్ అవార్డును కూడా అందుకున్నారు. శాంతిస్వ‌రూప్‌కు భార్య‌, ఇద్ద‌రు కుమారులు ఉన్నారు. కుమారుడు సాప్ట్ వేర్ ఉద్యోగి గా పనిచేస్తున్నారు.

పదవీ విరమణ తర్వాత రామంతపూర్ లో నివాసం ఉంటున్న ఆయన మరణ వార్త తెలియడంతో అభిమానులు, సన్నిహితులు భౌతికకాయాన్ని సందర్శించి నివాళులు అర్పిస్తున్నారు. దాదాపు రెండు దశాబ్దాల పాటు తెలుగు ప్రజలకు తాజా వార్తా సమాచారం అందచేయడంలో శాంతి స్వరూప్‌ ఎనలేని కృషి చేశారు. వార్తలకు అనుగుణంగా భావోద్వేగాన్ని గొంతులో పలికించడం ఆయన ప్రత్యేకతగా అభిమానులు గుర్తు చేసుకుంటున్నారు.

కిషన్ రెడ్డి సంతాపం…
శాంతిస్వరూప్ గారి మృతిపై కేంద్రమంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి సంతాపం తెలిపారు

తొలితరం తెలుగు న్యూస్ రీడర్ శాంతిస్వరూప్ అనారోగ్యంతో కన్నుమూశారని తెలిసి విచారం వ్యక్తం చేశారు. తెలుగు టీవీ వార్తలకు ఓ ఐకాన్‌గా వారు తనకంటూ ప్రత్యేకతను చాటుకున్నారు. ఎందరోమంది న్యూస్ రీడర్లకు వారు స్ఫూర్తిగా నిలిచారని కొనియాడారు.

భాష, ఉచ్ఛారణలో స్పష్టత, గంభీరమైన గొంతు, వార్తకు తగ్గట్లుగా అందులో గాంభీర్యాన్ని, ఉద్వేగాన్ని ఒలికిస్తూ వార్తలు చదివే తీరు, వివిధ అంశాలపై వారికున్న అద్భుతమైన అవగాహన వంటివి తెలుగు వీక్షకులకు శాంతి స్వరూప్ గారిని చేరువచేశాయి. సాంకేతికత అంతగా లేని రోజుల్లోనే.. టెలిప్రాంప్టర్ లేకుండా వార్తలు చదివేవారని గుర్తు చేసుకున్నారు.

Recent

- Advertisment -spot_img