ఇదేనిజం, శేరిలింగంపల్లి: ప్రభుత్వ భూముల్లో గత 30 సంవత్సరాలుగా నివాసాలు ఏర్పరుచుకొని ఉంటున్న పేద ప్రజలకు అధికారులు ఇస్తున్న నోటీసులను తక్షణమే ఉపసహరించుకోవాలని శేరిలింగంపల్లి నియోజకవర్గ ఇన్చార్జి, బీజేపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు రవికుమార్ యాదవ్ డిమాండ్ చేశారు. మంగళవారం ఆయన నియోజక వర్గ కన్వీనర్ రాఘవేంద్రరావు, సీనియర్ నాయకులు నాగుల్ గౌడ్ ఆధ్వర్యంలో నోటీసులు అందుకున్న కుటుంబాలను పరామర్శించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మియాపూర్ ప్రభుత్వ భూముల్లో గత 30 సంవత్సరాలుగా నివాసాలు ఏర్పరుచుకొని ముజఫర్ అహ్మద్ నగర్లో ఉంటున్న పేద ప్రజల ఇళ్ళకు గత నెల 27 నుండి హెచ్ఎండీఏ అధికారులు ఖాళీ చెయ్యాలని నోటీసులు అందించి భయభ్రాంతులకు గురి చేస్తూ పేద ప్రజల జీవితాలతో ఆడుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కొందరి రాజకీయ ప్రయోజనాల వల్ల సర్వే నెంబర్ 100, 101 లో ఎక్కడినుండో వచ్చి ప్రభుత్వ భూమిని కబ్జా చేయాలని చూసినవారి పై ఈ చర్యకు ప్రేరేపించిన వ్యక్తులపై కఠిన చర్య తీసుకోవాలని కోరారు. ఎవరో చేసిన దుశ్చర్యకు ఈరోజు ఈ అమాయక బస్తీ వాసులకు శాపంగా మారిందని ఏ ఒక్క ఇల్లు కూడా కూల్చకుండా భారతీయ జనతాపార్టీ వారి తరఫున న్యాయ పోరాటం చేస్తుందన్నారు. హెచ్ఎండిఏ కమిషనర్, రంగారెడ్డి జిల్లా కలెక్టర్ అవసరమైతే హైకోర్టు, సుప్రీంకోర్టు వరకు వెళ్లి న్యాయ పోరాటం చేసి ఇచ్చిన నోటీసులను ఉపసంహరించుకునే విధంగా ఒత్తిడి తీసుకువస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో బస్తీ వాసులు మాన్యం, రవికాంత్, లారీ శీను, గౌతమ్, ప్రవీణ్, ప్రకాష్, వినోద్, అయ్యన్న, నాయకులు: లక్ష్మణ్ ముదిరాజ్, రాజేష్ గౌడ్, గణేష్ ముదిరాజ్, రామకృష్ణ రెడ్డి,శివారెడ్డి, రాము, పవన్ యాదవ్, పాపయ్య తదితరులు పాల్గొన్నారు.