HomeజాతీయంPADMA AWARDS: 112 మందికి పద్మ అవార్డులు- చిన్న జీయర్‌కు పద్మ భూషణ్‌,నటి రవీనా టండన్‌కు...

PADMA AWARDS: 112 మందికి పద్మ అవార్డులు- చిన్న జీయర్‌కు పద్మ భూషణ్‌,నటి రవీనా టండన్‌కు పద్మశ్రీ

PADMA AWARDS: గణతంత్ర దినోత్సవం సందర్భంగా కేంద్రం ప్రభుత్వం బుధవారం దేశ అత్యున్నత పౌర పురస్కారాలైన పద్మ అవార్డు (PADMA AWARDS)లను ప్రకటించింది. ఆరుగురిని పద్మవిభూషణ్‌, 9 మందిని పద్మ భూషణ్‌, 91 మందిని పద్మశ్రీ పురస్కారాలకు ఎంపిక చేసింది. వీరిలో 19 మంది మహిళలు, ఇద్దరు ఎన్నారైలు ఉన్నారు. 7 మందికి మరణానంతరం ఈ పురస్కారాలను ప్రకటించారు. ఉత్తరప్రదేశ్‌ మాజీ సీఎం ములాయం సింగ్‌ యాదవ్‌, ఓఆర్‌ఎస్‌ సృష్టికర్త దిలీప్‌ మహలనబిస్‌, ప్రముఖ ఆర్కిటెక్ట్‌ బీవీ దోశీకి మరణానంతరం పద్మ విభూషణ్‌ అవార్డులు లభించాయి. ప్రముఖ తబలా విద్వాంసుడు జాకీర్‌ హుస్సేన్‌, మాజీ విదేశాంగ మంత్రి ఎస్‌ఎం కృష్ణ, అమెరికాకు చెందిన గణిత శాస్త్రవేత్త శ్రీనివాస్‌ వరదన్‌కు కూడా పద్మ విభూషణ్‌ ఇచ్చారు.

ప్రముఖ వ్యాపారవేత్త కుమార మంగళం బిర్లా, సమాజ సేవకురాలు సుధామూర్తి, గాయని వాణీ జయరాంతోపాటు తెలంగాణ నుంచి ఆధ్యాత్మిక వేత్తలు స్వామి చిన్న జీయర్‌, కమలేష్‌ డి పటేల్‌కు పద్మ భూషణ్‌ పురస్కారం ప్రకటించారు. తెలంగాణ నుంచి ఎమ్‌.విజయ్‌ గుప్తా(సైన్స్‌, ఇంజినీరింగ్‌), పసుపులేటి హనుమంతరావుకు (వైద్యం), బి.రామకృష్ణారెడ్డికి (సాహిత్యం, విద్య) పద్మశ్రీ పురస్కారం లభించింది. ఆంధ్రప్రదేశ్‌ నుంచి ప్రముఖ సంగీత దర్శకుడు ఎమ్‌ఎమ్‌ కీరవాణి, గణేశ్‌ నాగప్ప కృష్ణరాజ నగర, అబ్బారెడ్డి నాగేశ్వర రావు(సైన్స్‌, ఇంజినీరింగ్‌ విభాగం), కె.సచ్చిదానంద శాస్త్రి, సీవీ రాజు(కళలు), సంకురాత్రి చంద్రశేఖర్‌(సమాజ సేవ), ప్రకాశ్‌ చంద్ర సూద్‌(సాహిత్యం, విద్య)కు పద్మశ్రీ పురస్కారం దక్కింది. స్టాక్‌ మార్కెట్‌ దిగ్గజం రాకేశ్‌ ఝున్‌ఝున్‌వాలా(మరణానంతరం), ప్రముఖ బాలీవుడ్‌ నటి రవీనా టండన్‌కు పద్మశ్రీ లభించింది.

పద్మ విభూషణ్‌
ములాయం సింగ్‌ యాదవ్‌: సమాజ్‌వాదీ పార్టీ వ్యవస్థాపకుడు. యూపీకి మూడుసార్లు ముఖ్యమంత్రిగా పనిచేశారు. రక్షణ మంత్రిగా బాధ్యతలు నిర్వహించారు. సుదీర్ఘ కాలం లోక్‌సభ సభ్యుడిగా ఉన్నారు.
దిలీప్‌ మహలనబిస్‌: శిశు వైద్య నిపుణుడు. అతిసార వ్యాధుల చికిత్స కోసం ఓరల్‌ రీహైడ్రేషన్‌ విధానాన్ని కనిపెట్టినవారిలో ఒకరు.

జాకీర్‌ హుస్సేన్‌: చిన్న వయసులోనే సంగీత సాధన చేసిన ప్రజ్ఞాశీలి. ప్రఖ్యాత తబలా విద్వాంసుడు, సంగీత దర్శకుడు, నటుడు. ప్రిన్స్‌టన్‌, స్టాన్‌ఫర్డ్‌ వర్సిటీలలో అధ్యాపకులుగా పనిచేశారు.
బాలకృష్ణ దోశీ: భారత్‌లో తొలి తరం దిగ్గజ ఆర్కిటెక్ట్‌. ఐఐఎం-బెంగళూరు, ఈసీఐఎల్‌ టౌన్‌షిప్‌-హైదరాబాద్‌ లాంటి ఎన్నో ప్రముఖ నిర్మాణాలకు ఆర్కిటెక్ట్‌గా పని చేశారు.

శ్రీనివాస్‌ వరదన్‌: తమిళనాడులో జన్మించి అమెరికాలో స్థిరపడిన భారతీయ అమెరికన్‌. 20వ శతాబ్దంలో అత్యంత ప్రభావంతమైన గణిత శాస్త్రవేత్తగా గుర్తింపు పొందారు. సంభావ్యత సిద్ధాంతంలో విశేష కృషి చేశారు.
ఎస్‌ఎం కృష్ణ: అమెరికాలో ఉన్నత విద్యాభ్యాసం చేశారు. దేశంలోని సీనియర్‌ రాజకీయ నాయకుల్లో ఒకరు. కర్ణాటక సీఎంగా, విదేశాంగ మంత్రిగా, మహారాష్ట్ర గవర్నర్‌గా పనిచేశారు.

పద్మ భూషణ్‌
ఎస్‌ఎల్‌ భైరప్ప, కపిల్‌ కపూర్‌ (సాహిత్యం, విద్య), దీపక్‌ ధార్‌(సైన్స్‌,ఇంజినీరింగ్‌), సుమన్‌ కల్యాణ్‌పుర్‌(కళలు), కుమార్‌ మంగళం బిర్లా (ట్రేడ్‌, ఇండస్ట్రీ), వాణీ జయరామ్‌ (కళలు), స్వామి చిన్నజీయర్‌ (ఆధ్యాత్మికం), కమలేశ్‌ డీ పటేల్‌ (ఆధ్యాత్మికం), కపిల్‌ కపూర్‌ (సాహిత్యం, విద్య)

స్వామి చిన్న జీయర్‌: 23 సంవత్సరాల వయసులో ఐహిక సుఖములను త్యజించి జీయర్‌ అయ్యారు. 1984లో వేద విద్య, ఆగమ శాస్ర్తాలను నేర్పే జీయర్‌ ఎడ్యుకేషనల్‌ ట్రస్ట్‌ (జెట్‌)ను స్థాపించారు. శంషాబాద్‌లో జిమ్స్‌ దవాఖాన స్థాపించి ఉచిత వైద్యం అందిస్తున్నారు. శంషాబాద్‌లోని సమతా స్పూర్తి కేంద్రంలో 216 అడుగుల ఎత్తైన రామానుజాచార్య విగ్రహాన్ని ఏర్పాటు చేశారు.

కమలేశ్‌ దేశ్‌బాయ్‌ పటేల్‌(దాజి): శ్రీ రామచంద్ర మిషన్‌, హార్ట్‌ఫుల్‌నెస్‌ ఇన్‌స్టిట్యూట్‌, హార్ట్‌పుల్‌నెస్‌ ఎడ్యుకేషన్‌ ట్రస్ట్‌లను స్థాపించి యోగ, ధ్యానంపై ఉచిత శిక్షణ ఇస్తున్నారు. వర్షపు నీటి సద్వినియోగం, అటవీ సంరక్షణపై ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు.

అసమాన ధైర్య సాహసాలు

అసమాన ధైర్యసాహసాలు ప్రదర్శించిన వీర జవాన్లకు కేంద్రం గ్యాలెంట్రీ అవార్డులు ప్రకటించింది. వారిలో కొందరు.. మేజర్‌ సుభాంగ్‌- కీర్తిచక్ర 2020, ఏప్రిల్‌లో జమ్ముకశ్మీర్‌లోని బుగ్దాం జిల్లాలో తెల్లవారుజాము సమయంలో జరిగిన ఓ ఉగ్రవాద వ్యతిరేక ఆపరేషన్‌లో జవాన్ల టీమ్‌కు నేతృత్వం వహించిన మేజర్‌ సుభాంగ్‌ అత్యంత ధైర్యసాహసాలు ప్రదర్శించారు. ఉగ్రవాదుల కదలికలను గమనిస్తూ.. వారు 10 మీటర్ల సమీపానికి వచ్చేలా వ్యూహం రచించారు. ఉగ్రవాదుల కాల్పుల్లో తన ఎడమ భుజంపై గాయకావడంతో పాటు మరో ఇద్దరు జవా న్లకు గాయాలయ్యాయి. అయినా ఏమాత్రం వెరవకుండా అసమాన పరాక్రమాన్ని ప్రదర్శించి ఉగ్రవాదులను మట్టుబెట్టారు.

నాయక్‌ జితేంద్ర సింగ్‌-కీర్తిచక్ర
2021, డిసెంబర్‌ నుంచి నిర్వహించిన మూడు ఆపరేషన్లలో నాయక్‌ జితేంద్ర సింగ్‌ అసాధారణ ధైర్యసాహసాలను ప్రదర్శించారు. మూడు ఆపరేషన్లలో ఆయన నేతృత్వంలోని బృందం మొత్తంగా ఏడుగురు ఉగ్రవాదులను ఏరివేసింది. గత ఏడాది ఏప్రిల్‌లో జరిగిన ఆపరేషన్‌లో ఉగ్రవాదుల దాడుల్లో తీవ్ర గాయాలైనా.. ధైర్యంగా ముందుకు వెళ్లి ఓ ఇంటిలో దాక్కొన్న ఉగ్రవాదిని హతమార్చారు.

కెప్టెన్‌ అరుణ్‌ కుమార్‌ – శౌర్య చక్ర
2022 మే 13న జమ్ముకశ్మీర్‌లోని బంది పోరా జిల్లాలో ఇద్దరు ఉగ్రవాదులు తలదా చుకున్నారన్న సమాచారంతో భద్రతా బలగా లు అక్కడికి చేరుకొన్నాయి. వారిని మట్టు బెట్టేందుకు కెప్టెన్‌ అరుణ్‌ కుమార్‌ కీలక పాత్ర పోషించారు. ప్రాణాలకు తెగించి ఉగ్ర వాదులు తలదాచుకొన్న చోటుకు చేరి ఒక ఉగ్రవాదిని మట్టుబెట్టారు. ఇంకో ఉగ్రవాది కలుగు నుంచి బయటకు వచ్చేలా చేశారు. ఆ ఉగ్రవాదిని తోటి భద్రతా సిబ్బంది మట్టు బెట్టారు. అసమాన ధైర్యం, గొప్ప నాయ కత్వం ప్రదర్శించినందుకు గానూ కెప్టెన్‌ అరుణ్‌కుమార్‌ను శౌర్య చక్ర వరించింది.

కెప్టెన్‌ యుధ్‌వీర్‌సింగ్‌ – శౌర్య చక్ర
రాష్ట్రీయ రైఫిల్స్‌ 9వ బెటాలియన్‌కు చెందిన కెప్టెన్‌ యుధ్‌వీర్‌సింగ్‌.. 2022 ఏప్రిల్‌ 11న కుల్గాం జిల్లాలో జరిగిన కోవర్ట్‌ ఆపరేషన్‌కు నేతృత్వం వహించారు. ఉగ్రవాదులు పారిపోకుండా ప్రణాళిక రచించారు. వారిని చుట్టుముట్టి దిగ్బం ధించారు. తప్పించుకొనేందుకు ఉగ్రవాదులు గ్రెనేడ్లు విసిరినా, ఫైరింగ్‌ చేసినా ఏమాత్రం బెరుకు లేకుండా వారి సమీపానికి వెళ్లి మట్టుబెట్టారు. చుట్టుపక్కల నివాసం ఉంటున్న పౌరులకు హాని కలగకుండా జాగ్రత్త పడ్డారు. కోవర్ట్‌ ఆపరేషన్‌లో అసమాన ధైర్యసాహసాలు ప్రదర్శించి నందుకు కెప్టెన్‌ యుధ్‌వీర్‌సింగ్‌కు శౌర్య చక్రను ప్రకటించారు.

Recent

- Advertisment -spot_img