Homeహైదరాబాద్latest Newsపాకిస్తాన్ కు ఆ సత్తా లేదు: ప్రధాని మోడీ

పాకిస్తాన్ కు ఆ సత్తా లేదు: ప్రధాని మోడీ

ఇదే నిజం, నేషనల్ బ్యూరో: పాకిస్థాన్​ వద్ద అణుబాంబులు ఉన్నాయని చెబుతున్న కాంగ్రెస్.. ఆ దేశం వద్ద వాటి నిర్వహణకు డబ్బులు లేవనే విషయాన్ని గుర్తించలేకపోయిందని ప్రధాని మోడీ విమర్శించారు. పాకిస్థాన్​ వద్ద అణుబాంబులు ఉన్నాయని.. అందుకే ఆ దేశాన్ని గౌరవించాలంటూ ఇటీవల కాంగ్రెస్ సీనియర్ నేత మణిశంకర్ అయ్యర్ చేసిన వ్యాఖ్యలకు మోడీ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. ఉత్తరప్రదేశ్​లోని బుందేల్​ఖండ్, బారాబంకీ, హామీర్​పూర్​లో శుక్రవారం నిర్వహించిన ఎన్నికల ప్రచార సభల్లో మోడీ పాల్గొని ప్రసంగించారు. సమాజ్​వాదీ పార్టీ(ఎస్పీ), కాంగ్రెస్​పై ప్రధాని విమర్శలు చేశారు. కాంగ్రెస్ సొంత దేశ ప్రజల్నే భయపెట్టాలని చూస్తోందన్నారు. పాకిస్థాన్‌తో కయ్యం పెట్టుకోవద్దని సలహాలు ఇస్తోందన్నారు. ‘పాకిస్థాన్ వద్ద అణుబాంబులున్నాయని కాంగ్రెస్ చెబుతోంది. కానీ పాక్ పరిస్థితి ఎంత దారుణంగా ఉందంటే వాళ్లకు ఆ బాంబులను ఏం చేయాలో తెలియడం లేదు. కనీసం ఎవరైనా కొంటారేమో అని ఎదురు చూస్తోంది. కానీ వాటి నాణ్యత సరిగ్గా లేకపోవడం వల్ల ఎవరూ కొనుగోలు చేసేందుకు ముందుకు రావడం లేదు’అని మోడీ సెటైర్ వేశారు. లోక్‌సభ ఎన్నికల్లో కేవలం 50 సీట్లే గెలవడాన్ని హస్తం పార్టీ లక్ష్యంగా పెట్టుకుందని, తద్వారా తన గౌరవాన్ని కాపాడుకోవచ్చని భావిస్తోందన్నారు. తొలి నాలుగు విడతల పోలింగ్‌లో ‘ఇండియా’ కూటమికి చుక్కెదురైందని, దీంతో నిరాశలో కూరుకుపోయిన కార్యకర్తలు ఇంటినుంచే బయటకు రావడం లేదని ఆయన ఎద్దేవా చేశారు. ‘ఉత్తర్‌ప్రదేశ్‌లో కాంగ్రెస్‌, సమాజ్‌వాదీ పార్టీల మధ్య అనేక పోలికలు ఉన్నాయి. ఈ రెండూ కుటుంబవాదాన్ని ప్రోత్సహిస్తాయి. అవినీతిమయ రాజకీయాల్లో నిమగ్నమయ్యాయి. ఓటుబ్యాంకును ఆకట్టుకునేందుకు దేనికైనా వెనుకాడవు. ఉగ్రవాదులు, మాఫియా, నేరగాళ్లకు సానుభూతి ప్రకటిస్తాయి. ‘ఆర్టికల్‌ 370’ను తిరిగి తెస్తామని కాంగ్రెస్ చెబుతోంది’అని మోడీ విమర్శించారు.

దేశంలో అలజడి, అస్థిరతను సృష్టించేందుకే విపక్ష ఇండియా కూటమి ఎన్నికల బరిలో ఉందని మోడీ మండిపడ్డారు. కూటమి అధికారంలోకి వస్తే రామమందిరంపైకి బుల్డోజర్లను పంపిస్తారని ఆయన ఆరోపించారు. ‘శ్రీరామనవమి రోజున రామమందిరంపై ఎస్పీకి చెందిన ఓ సీనియర్‌ నేత అనుచిత వ్యాఖ్యలు చేశారు. మరోవైపు అయోధ్యపై సుప్రీంతీర్పును మార్చాలని కాంగ్రెస్‌ ప్రయత్నాలు చేస్తోంది. ఈ రెండు పార్టీలకు కుటుంబం, అధికారమే మొదటి ప్రాధాన్యం. ఒకవేళ ఎస్పీ-కాంగ్రెస్‌ అధికారంలోకి వస్తే వారు రామమందిరంపైకి బుల్డోజర్లను పంపి రామ్‌లల్లాను మళ్లీ టెంట్‌లోకి తీసుకొస్తారు. ఓ వైపు బీజేపీ-ఎన్డీయే కూటమి జాతి ప్రయోజనాలకు జీవితాలను అంకితం చేస్తే.. ఇండియా కూటమి మాత్రం దేశంలో అస్థిర పరిస్థితులను సృష్టించేందుకు పోటీపడుతోంది. ఈ ఎన్నికల తర్వాత వారి కూటమి పేకమేడలా కూలిపోతుంది. జూన్‌ 4 ఎంతో దూరంలో లేదు. ఈ ఎన్నికల్లో మోడీ సర్కారు హ్యాట్రిక్‌ కొట్టబోతోందని ప్రపంచమంతా తెలుసు’ అని విజయంపై ప్రధాని ధీమా వ్యక్తం చేశారు. అమేథీలో ఆయన పోటీ చేసే సాహసం చేయరని తాను ముందే ఊహించానని, ఇప్పుడు అదే నిజమైందంటూ కాంగ్రెస్​ అగ్రనేత రాహుల్​పై సైతం మోడీ విమర్శలు చేశారు. కూటమి అధికారంలోకి వస్తే ప్ర‌తి ఒక్క‌రి ఆస్తుల‌ను ఆరా తీసి వాటిలో కొంత భాగాన్ని త‌మ ఓటు బ్యాంక్ అయిన ఓట్ జిహాద్ ప్ర‌జ‌ల‌కు క‌ట్ట‌బెడుతుందని మోడీ ఆరోపించారు. ‘మీ ఆస్తిని ఏ ప్ర‌భుత్వ‌మైనా లాగేసుకునేందుకు మీరు అనుమ‌తిస్తారా? మీకు ఎంత భూమి ఉంది. ఎంత పెద్ద ఇల్లు ఉంది. మీకు బంగారం ఏమైనా ఉందా అనే వివ‌రాల‌ను ఆరా తీస్తూ ఎక్స్‌రే జ‌రిపిస్తామ‌ని కాంగ్రెస్ త‌న ఎన్నిక‌ల మేనిఫెస్టోలో స్ప‌ష్టంగా ప్ర‌స్తావించింది’అని ప్రధాని పేర్కొన్నారు.

రంజాన్​ మాసంలో గాజాపై దాడులు ఆపాలని చెప్పాం
పవిత్ర రంజాన్‌ మాసంలో గాజాపై వైమానిక దాడులను నిలిపివేయాలని తన ప్రతినిధి ద్వారా ఇజ్రాయెల్‌కు సందేశం పంపానని ప్రధాని మోడీ తెలిపారు. శుక్రవారం ఆయన ఓ హిందీ చానెల్​కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ విషయాన్ని వెల్లడించారు. ‘రంజాన్‌ మాసంలో నా ప్రత్యేక ప్రతినిధిని ఇజ్రాయెల్‌ ప్రధాని నెతన్యాహు వద్దకు పంపించాను. ఆ పవిత్రమాసంలో బాంబింగ్‌ చేయవద్దన్న నా సందేశాన్ని ఆయనకు చేరవేశాడు. వారు కూడా దానిని పాటించడానికే యత్నించారు. కానీ, చివరి రెండు మూడు రోజుల్లో ఘర్షణ జరిగింది. ముస్లింల అంశాలపై తనను ఇబ్బంది పెట్టినా.. ఇటువంటి విషయాలను వెంటనే బహిర్గతం చేయను’అని వెల్లడించారు. పాలస్తీనా, ఇజ్రాయెల్‌ పర్యటనల విషయంలో కూడా తాను మార్పు తెచ్చినట్లు మోడీ పేర్కొన్నారు. ‘గతంలో ఇజ్రాయెల్‌ పర్యటనకు వెళితే.. పాలస్తీనాకు కూడా వెళ్లడం తప్పనిసరి. సెక్యులరిజం చూపించుకుని.. తిరిగి వచ్చేవారు. కానీ అలా చేయడానికి నేను నిరాకరించాను. ఒకసారి నేను జోర్డాన్‌ గగనతలంపై నుంచి పాలస్తీనాకు వెళ్తున్న విషయం తెలుసుకుని ఆ దేశ రాజు నాతో మాట్లాడారు. మోడీజీ అలా వెళ్లకూడదు.. మీరు నా అతిథి. నా హెలికాప్టర్‌ వాడుకోవచ్చు అని చెప్పారు’అని ప్రధాని తెలిపారు. నాడు పాలస్తీనా పర్యటనకు జోర్డాన్ రాజు హెలికాప్టర్‌లో వెళ్లగా.. ఇజ్రాయెల్‌ విమానాలు దానికి రక్షణ కల్పించాయని గుర్తు చేసుకున్నారు. ఈ ఇంటర్వ్యూలో మోడీ పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. ఎన్డీయే కూటమి 400 సీట్లు సాధిస్తుందంటూ బీజేపీ నేతలు ధీమా వ్యక్తం చేస్తున్న విషయం తెలిసిందే. దీన్ని మోడీ ప్రస్తావిస్తూ.. 400 సీట్లు గెలుస్తామని ప్రజలే మాలో విశ్వాసం నింపారన్నారు. వాళ్ల దృక్పథం తనకు తెలుసన్నారు. ఇక హిందూ-ముస్లిం రాజకీయాలంటూ విపక్షాలు చేస్తున్న విమర్శలను ప్రధాని తిప్పికొట్టారు. వారి బుజ్జగింపు రాజకీయాలను బయటపెడుతున్నందుకే తనపై ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారని ఆయన మండిపడ్డారు.

Recent

- Advertisment -spot_img