అమరావతి : అంతర్వేదిలో చోటు చేసుకున్న ఘటనతోపాటు పిఠాపురం, కొండబిట్రగుంట ఘటనలుయాదృచ్ఛికాలు కావని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు. విగ్రహాల ధ్వంసాలు, రథాల దహనాలు యాధృచ్ఛికంగా జరుగుతాయని, మతిస్థిమితం లేనివారి పని, తేనె పట్టు కోసం చేసిన పని అంటే పిల్లలు కూడా నవ్వుతారన్నారు. పిఠాపురంలో దేవతా విగ్రహాల ధ్వంసం సమయంలోనే సరిగా స్పందిస్తే ఇలాంటివి జరిగేవా? అని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. మత విశ్వాసాలను దెబ్బతీస్తున్న తీరుపై ఆడపడుచులందరూ మంగళ, శుక్రవారాల్లో హారతులిస్తూ తమ నిరసన తెలపాలని పవన్ పిలుపునిచ్చారు. ఇతర మతాల పెద్దలూ ఈ ఘటనలను ఖండించాలన్నారు. పోలీసుల దర్యాప్తుపై నమ్మకం లేదని, హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తితో విచారణ చేయించాలని అవసరమైతే సీబీఐ దర్యాప్తు కోసం కేంద్రాన్ని కోరతామన్నారు. హిందూ మతం గురించి స్పందిస్తే తనపై మతవాది అన్న ముద్రను ఎందుకు వేస్తారని పవన్ ప్రశ్నించారు. రాజ్యాంగం అన్ని మతాలకు సమాన స్వేచ్ఛ ఇచ్చిందని గుర్తుచేశారు. అన్ని మతాలు నాకు సమానమేనన్నారు. ఎవరికీ అన్యాయం జరిగిన ఇలాగే స్పందిస్తానన్నారు. రాష్ట్రంలో హిందూ మతంపై వరుసగా జరుగుతున్న సంఘటనలు చూస్తుంటే వీటి వెనుక వ్యూహం ఉందనిపిస్తుందన్నారు.
అంతర్వేది ఘటన యాదృచ్ఛికం కాదుః పవన్ కల్యాణ్
RELATED ARTICLES