Homeజిల్లా వార్తలుసస్య రక్షణ చర్యలు తీసుకోవాలి

సస్య రక్షణ చర్యలు తీసుకోవాలి

– జగదేవపూర్‌ వ్యవసాయ అధికారి యు వసంతరావు
– పలు గ్రామాల్లో వరినారుమళ్లు పరిశీలన

ఇదేనిజం, జగదేవపూర్‌: చలికి వరి నారుమడిలో రైతులు సస్య రక్షణ చర్యలు తీసుకోవాలని వ్యవసాయ అధికారి యు వసంతరావు అన్నారు. బుధవారం మండలంలోని చాట్లపల్లి , తీగుల్‌, రాంనగర్‌ గ్రామాలలో వరి నారుమండ్లను ఏవో పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యాసంగిలో చలి ప్రభావంతో నారు పెరగకపోవడం, ఆకులు పసుపు, ఎరుపు రంగులోకి మారడం, నారు చనిపోవడం వంటివి జరుగుతాయని వీటి నివారణకు సస్యరక్షణ చర్యలు తీసుకోవాలని సూచించారు.

-సాయంత్రం వేళల్లో నారుమడిలో నీరు తీసివేసి పగటిపూట వెచ్చటి నీరు పెడుతూ ఉండాలి.
-రోజు సాయంత్రం ఒక అడుగు ఎత్తులో వెదురు బద్దలు అమర్చి దానిమీద సన్నని ప్లాస్టిక్‌ షీట్‌ లేదా కల్లాల పట్టాలు తో నారుమడి మీద కప్పి మరుసటి రోజు ఉదయం తీసి వేయాలి.
-జింకు లోపం వలన ఆకులపై తుప్పు మచ్చలు ఏర్పడతాయి, జింక్‌ సల్ఫేట్‌ రెండు గ్రాములు లీటర్‌ నీటిలో కలిపి పిచికారి చేసుకోవాలి.
-నారు ఆరోగ్యంగా పెరగడానికి యూరియా వేస్తున్నప్పుడు ఒక కిలో యూరియాకి రెండు గ్రాముల కార్బండిజమ్‌, మాంకోజబ్‌ మిశ్రమ మందును కలిపి పిచికారి చేయాలి.
-కాండం తొలిచూ పురుగు, మోగి పురుగు బారి నుంచి కాపాడుకోవడానికి కార్బోఫ్యూరాన్‌ 3 జి గుళికలు ఎకరాకు సరిపడే నారుమడికి ఒక కేజీ చొప్పున చల్లాలి.
-చలి తీవ్రత ఎక్కువ ఉండి మంచుతో కూడిన వాతావరణం ఉన్నచో అగ్గి తెగులు ఆశించకుండా ముందు జాగ్రత్తగా ట్రైక్లోజోల్‌ 0.6 గ్రాములు లీటర్‌ నీటికి చొప్పున పిచికారి చేయాలి. ఈ సూచనలు, సలహాలు పాటించడం వల్ల నారు ఆరోగ్యంగా పెరిగే అవకాశం ఉందని తెలిపారు.

Recent

- Advertisment -spot_img