HomeరాజకీయాలుPM : పటేల్ స్ఫూర్తితో భారత్​ను అభివద్ధి చెందిన దేశంగా మారుస్తం

PM : పటేల్ స్ఫూర్తితో భారత్​ను అభివద్ధి చెందిన దేశంగా మారుస్తం

– రాబోయే 25 ఏండ్లు అత్యంత ముఖ్యమైన కాలం
– బుజ్జగింపు రాజకీయాలు చేసేవారు భవిష్యత్​​ ప్రమాదాలను గుర్తించలేరు
– ప్రతిపక్షాలపై మండిపడ్డ ప్రధాని నరేంద్ర మోడీ
– సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి సందర్భంగా ఐక్యతా విగ్రహం వద్ద నివాళి

ఇదే నిజం, నేషనల్ బ్యూరో: రాబోయే 25 ఏళ్లు భారత్‌కు అత్యంత ముఖ్యమైన కాలమని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. ఉక్కుమనిషి సర్దార్‌ వల్లభాయ్‌ పటేల్ స్ఫూర్తితో ఈ దేశాన్ని సుసంపన్నంగా మార్చాలని పేర్కొన్నారు. మంగళవారం పటేల్ జయంతిని పురస్కరించుకుని గుజరాత్‌ రాష్ట్రం కేవడియాలోని ఐక్యతా విగ్రహం వద్ద ప్రధాని నివాళి అర్పించారు. ఈ సందర్భంగా నిర్వహించిన సభలో జనాలను ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ.. విపక్షాలపై విమర్శలు చేశారు.‘బుజ్జగింపు రాజకీయాలు చేసేవారు భవిష్యత్తులో వచ్చే ప్రమాదాలను చూడలేరు. ఉగ్రవాదానికి మద్దతు ఇచ్చేవారికి అండగా నిలబడేందుకూ వెనకాడరు. కొంతమంది రాజకీయ నేతలకు సానుకూల అంశాలు కనిపించవు.

వారు దేశ ఐక్యత కంటే సొంత లక్ష్యాలకే ప్రాధాన్యం ఇస్తారు’ అని విపక్షపార్టీలపై మోడీ మండిపడ్డారు. అలాగే త్వరలో జరగనున్న పలు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు, 2024 లోక్​సభ ఎన్నికల గురించి ప్రస్తావిస్తూ.. అలాంటి నేతలు దేశాన్ని విభజించడం ద్వారా ఎన్నికల్లో లబ్ధి పొందాలనుకుంటారని మండిపడ్డారు. వచ్చే 25 ఏళ్లలో భారత్‌ను అభివృద్ధి చెందిన దేశంగా మార్చాలని, అందుకోసం పటేల్‌ను స్ఫూర్తిగా తీసుకొని ప్రతి లక్ష్యాన్ని సాధించాలని సూచించారు. ఈ సందర్భంగా ఆర్టికల్‌ 370 రద్దు గురించి ప్రధాని ప్రస్తావిస్తూ.. కశ్మీర్‌, దేశం మధ్య అడ్డుగా ఉన్న ఆర్టికల్‌ 370 గోడ కూలిపోయిందని, ఈ విషయంలో సర్దార్ పటేల్ ఎక్కడున్నా సంతోషిస్తారని అన్నారు. పటేల్ జయంతిని పురస్కరించుకొని గుజరాత్‌లో భారీ స్థాయిలో యూనిటీ డే పరేడ్‌ను నిర్వహించారు. సీఆర్‌పీఎఫ్ మహిళా సిబ్బంది చేసిన విన్యాసాలను ప్రధాని మోడీ వీక్షించారు. ఈ సందర్భంగా వారి ధైర్యసాహసాలను ఆయన అభినందించారు.

Recent

- Advertisment -spot_img