Homeక్రైంపొల్యూషన్ ఢిల్లీ వాసుల ఆరోగ్యాన్ని దెబ్బతీస్తున్నది

పొల్యూషన్ ఢిల్లీ వాసుల ఆరోగ్యాన్ని దెబ్బతీస్తున్నది

– కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పరస్పర నిందలు వేసుకోవద్దు
– ఇది రాజకీయ యుద్ధం కాకూడదు
– దేశ రాజధానిలో గాలి నాణ్యతపై సుప్రీంకోర్టు ఆందోళన
– ఏం చేసైనా సరే పంట వ్యర్థాలను తగులబెట్టడాన్ని ఆపాలి
– ఢిల్లీ పొరుగు రాష్ట్రాలను ఆదేశించిన అత్యున్నత ధర్మాసనం

ఇదే నిజం, నేషనల్ బ్యూరో: దేశ రాజధాని ఢిల్లీలో రోజురోజుకి పెరుగుతున్నఎయిర్ పొల్యూషన్​పై సుప్రీంకోర్టు తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. క్షీణిస్తున్న గాలి నాణ్యత.. ‘ప్రజల ఆరోగ్యాన్ని ఖూనీ చేస్తోందని’ ఆవేదన చెందింది. ఈ సందర్భంగా ఎయిర్ పొల్యూషన్​పై కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలు పరస్పరం నిందలు వేసుకోవడంపై సుప్రీంకోర్టు సీరియస్‌ అయ్యింది. ఇది రాజకీయ యుద్ధం కాకూడదని సూచించింది. పొల్యూషన్​కు ప్రధాన కారణమైన పంట వ్యర్థాల దగ్ధాన్ని వెంటనే ఆపాలని ఢిల్లీ పొరుగు రాష్ట్రాలను ఆదేశించింది. ఢిల్లీ–ఎన్ సీఆర్ ప్రాంతాల్లో ఆందోళనకర రీతిలో పెరుగుతున్న ఎయిర్​ పొల్యూషన్​పై దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టు మంగళవారం విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా ప్రభుత్వాల తీరుపై కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ‘ప్రతి ఏడాది ఢిల్లీ ఇలా పొల్యూషన్​ కోరల్లో నలిగిపోకూడదు. ప్రతిసారి దీన్ని రాజకీయం చేయకూడదు. పొరుగున ఉన్న పంజాబ్‌, హర్యానా, ఉత్తరప్రదేశ్‌, రాజస్థాన్‌ రాష్ట్రాల్లో పంట వ్యర్థాల దగ్ధాలతో ఏటా చలికాలంలో ఢిల్లీలో కాలుష్యం తీవ్రంగా పెరుగుతోంది. ఈ పంట వ్యర్థాల దగ్ధం ఆగాలి. ఎలా ఆపుతారో మాకు సంబంధం లేదు. అది మీ పని (రాష్ట్ర ప్రభుత్వాలను ఉద్దేశిస్తూ). కానీ, ఇది ఆగాలి. వెంటే జరగాలి’అని ఆ నాలుగు రాష్ట్రాలను సుప్రీంకోర్టు ఆదేశించింది.


ఢిల్లీ ప్రభుత్వా బాధ్యతతో పనిచేయాలి


ఈ సందర్భంగా ఢిల్లీ ప్రభుత్వానికి కూడా కోర్టు పలు సూచనలు చేసింది. ‘ఢిల్లీ ప్రభుత్వం కూడా బాధ్యతాయుతంగా ప్రవర్తించాలి. బస్సులు కూడా కాలుష్యానికి కారణమవుతున్నాయి. వాటిని సగం సామర్థ్యంతో నడపండి. ఘన వ్యర్థాలు బహిరంగ ప్రదేశాల్లో కాల్చకుండా చర్యలు తీసుకోండి’అని కోర్టు స్పష్టం చేసింది. సరి-బేసి విధానంపైనా కోర్టు స్పందించింది. ‘ఇలాంటి విధానాలు.. కాలుష్య నియంత్రణపై పెద్దగా ప్రభావం చూపించకపోవచ్చు’ అని అభిప్రాయపడింది. ఇక, పంట వ్యర్థాల దగ్ధాన్ని ఆపే చర్యలపై చర్చించేందుకు.. యూపీ, రాజస్థాన్‌, హర్యానా, పంజాబ్‌, ఢిల్లీ ప్రభుత్వాలతో కేంద్రం బుధవారం అత్యవసర సమావేశం నిర్వహించాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. దీంతో పాటు, వాహనాల నుంచి వచ్చే పొల్యూషన్, వాటికి కారణమయ్యే ఇతర అంశాలపైనా చర్యలు తీసుకోవాలని పేర్కొంది. అనంతరం దీనిపై తదుపరి విచారణను నవంబరు 10వ తేదీకి వాయిదా వేసింది. ఢిల్లీలో గాలి నాణ్యత విపరీతంగా క్షీణిస్తోంది. దీంతో కాలుష్య నివారణకు ఆమ్‌ ఆద్మీ సర్కారు కీలక చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగానే ఈ నెల 13 నుంచి 20 వరకు వాహనాలకు సరి-బేసి విధానాన్ని అమలు చేయనున్నారు. అటు స్టూడెంట్ల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని అన్ని స్కూళ్లల్లో ఫిజికల్ క్లాసుల నిర్వహణను రద్దు చేశారు.

Recent

- Advertisment -spot_img