Homeహైదరాబాద్latest Newsతెలంగాణలో పెరుగుతున్న సమస్యలు…కక్ష సాధింపు చర్యలే కారణామా?

తెలంగాణలో పెరుగుతున్న సమస్యలు…కక్ష సాధింపు చర్యలే కారణామా?

కొత్త ప్రభుత్వం వస్తే తమ సమస్యలు తీరుతాయనుకున్న ప్రజలకు తీవ్ర నిరాశే ఎదురవుతోంది. కాంట్రాక్టు ఉద్యోగులు, రైతులు, పేదలు పలు సమస్యలతో సతమతమవుతున్నారు. లేని సమస్యల్ని కొనితెచ్చుకున్నామని కొందరు వాపోతున్నారు. గత మూడు నెలలుగా వైద్య శాఖలో జీతాల్లేక ఉద్యోగులు నానాయాతన పడుతున్నారు. తమ కుటుంబాన్ని పోషించలేక బాధను దిగమింగుకుంటున్నారు. ఈ రాష్ట్ర ప్రభుత్వం జాతీయ ఆరోగ్య మిషన్ – ఎన్‌హెచ్‌ఎం ఉద్యోగులకు మూడు నెలల నుంచీ జీతాలు ఇవ్వడం లేదు. అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్లు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, బస్తీ దవాఖానాలు, తెలంగాణ డయాగ్నోస్టిక్స్ తదితర విభాగాల్లో పనిచేస్తున్న దాదాపు 17 వేల మంది ఎంప్లాయీస్ వేదన అనుభవిస్తున్నారు. వైద్యులు, ఫార్మాసిస్టులు, ల్యాబ్ టెక్నీషియన్స్, నర్సులు, అకౌంటెంట్లు, డేటా ఎంట్రీ ఆపరేటర్లు, సెక్యూరిటీ గార్డులు, స్వీపర్లు తదితరులకు వేతనాలు అందడం లేదు. నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ ప్రభుత్వం కాలపాయపన చేస్తోంది. ప్రజల సమస్యల్ని పట్టించుకోకుండా ప్రాధాన్యత లేని అంశాలను లేవనెత్తుతోంది. దీంతో ప్రజల్లో వ్యతిరేకత పెరుగుతున్నట్లు కనిపిస్తోంది.

ప్రతీ నెలా ఒకటో తేదీనే జీతాలు ఇస్తున్నామని గొప్పగా చెప్పుకుంటోన్న రేవంత్ ప్రభుత్వం వైద్యశాఖలో పనిచేస్తోన్న ఉద్యోగులపై సవతితల్లి ప్రేమ కనబరుస్తున్నట్లు తెలుస్తోంది. కాంట్రాక్టు ఉద్యోగులు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు తమ జీతాలు పర్మినెంట్ అవుతాయని వేయి కళ్లతో ఎదురుచూస్తున్నారు. పొరుగు రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ ఇప్పటికే వారిని రెగ్యులర్ ఉద్యోగులుగా మారుస్తోంది. అంతేగాక దాదాపు గత 20 ఏళ్లుగా జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో పని చేస్తోన్న ఫీల్డ్ అసిస్టెంట్లు రెగ్యులర్ ఉద్యోగం కోసం పరితపిస్తున్నారు. ఎన్నో సమస్యలు వేధిస్తున్నా, కుటుంబ పోషణ భారంగా ఉన్నా ఏదోలా నెట్టుకొస్తున్నారు. అధికారంలోకి వస్తే వీళ్లందరి సమస్యలు పరిష్కరిస్తామన్న రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇవేమీ పట్టనట్టుగా వ్యవహరిస్తోంది. ప్రస్తుతమున్న సమస్యలు, సవాళ్లను వదిలేసి ప్రాధాన్యత లేని, ప్రజలకు అక్కర్లేని పనులపై దృష్టి సారిస్తున్నట్లు కనబడుతోంది.

గత పదేళ్లలో పక్కా ప్రణాళికతో రెప్పపాటు కూడా కరెంట్ పోయేది కాదు. తద్వారా పరిశ్రమల్లో ఉత్పత్తి పెరిగింది. డెవలప్‌మెంట్ గణనీయంగా జరిగింది. రాష్ట్ర ఖజానాకు రాబడి కూడా పెరగడంతో సంక్షేమ కార్యక్రమాల ద్వారా ప్రజలు లబ్ధిపొందారు. విద్యుత్ రంగంలో అమలు చేసిన పక్కా ప్రణాళిక వల్లే ఇది సాధ్యమైంది. కానీ ఇప్పుడు మాత్రం కరెంట్ కోతలతో ప్రజలకు ఉక్కపోత. పరిశ్రమలకు తలనొప్పి. తరచూ కరెంట్ కట్ అవుతోంది. ఉద్యోగుల విధులకు ఆటంకాలు ఏర్పడుతున్నాయి. ఉత్పత్తిపై ప్రభావం పడుతోంది. ఇవే కాక ఇంకా ఎన్నో సమస్యలు రాష్ట్రాన్ని పట్టిపీడిస్తున్నాయి. ఇవేమీ పట్టనట్టు ప్రభుత్వం ఒంటెద్దు పోకడ పోతున్నట్లు తెలుస్తోంది. ఇదే ధోరణితో పని చేస్తే రాష్ట్ర భవిష్యత్ అంధకారమయ్యే ప్రమాదం ఉంది. అభివృద్ధిలో మళ్లీ పదేళ్లు వెనక్కి వెళ్లాల్సి వస్తుంది. గత ప్రభుత్వంపై కక్ష సాధింపు చర్యలు, చిలిపి పనులు మానుకొని ప్రజా సమస్యలు, అభివృద్ధిపై ఫోకస్ చేస్తే రాష్టానికే గాక దేశానికి ఎంతో మేలు జరుగుతుంది.

Recent

- Advertisment -spot_img