ఇదేనిజం, శేరిలింగంపల్లి: కొండాపూర్ లోని శ్రీ చైతన్య కాలేజ్ వాల్మీకి బ్రాంచ్ లో పుడ్ పాయిజన్ తో విద్యార్థులు అస్వస్థత కు గురైన సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. గురువారం రాత్రి ఆహారం తిన్న విద్యార్థుల్లో 40 మందికి పైగా ఒక్కసారిగా వాంతులు, విరేచనాలు కావడంతో విద్యార్థులు ఆందోళనకు గురయ్యారు. విషయం తెలుసుకున్న ఆల్ ఇండియా యూత్ ఫెడరేషన్ (ఏఐవైఎఫ్ )నాయకులు హాస్టల్ వద్దకు వెళ్లి ఆందోళకు దిగారు. ఇంత జరిగినా శ్రీ చైతన్య యజమాన్యం విద్యార్థులను పట్టించుకోకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని ఏఐవైఎఫ్ నాయకులు ఆరోపించారు. విద్యార్థులకు మెరుగైన వైద్యం కోసం ఆసుపత్రికి వెంటనే తరలించాలని డిమాండ్ చేశారు. కానీ,యాజమాన్యం మాత్రం రెండు రోజులుగా విద్యార్థులను బయట ఆసుపత్రికి తీసుకువెళ్లకుండా ఆర్ఎంపీ వైద్యులను తీసుకువచ్చి చికిత్స చేయిస్తున్నట్లు ఆరోపిస్తున్నారు. 40 మంది విద్యార్థుల్లో 27 మంది విద్యార్థులు అనారోగ్యంతో బాధపడుతున్నట్లు సమాచారం. మీడియాను లోపలికి అనుమతించకుండా యాజమాన్యం విషయం బయటకు పొక్కకుండా అక్కడే చికిత్స చేయిస్తుందని ఆరోపిస్తున్నారు.