– ఎన్నికలప్పుడే కాంగ్రెస్ అగ్రనేతలు వస్తారు
– ఎప్పుడూ అందుబాటులో ఉండేది బీఆర్ఎస్ లీడర్లే
– బోధన్ లో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత
ఇదేనిజం, బోధన్: బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత .. రాహుల్ గాంధీపై విమర్శలు గుప్పించారు. రాహుల్ గాంధీ కాదు ఎన్నికల గాంధీ అంటూ ఫైర్ అయ్యారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా గురువారం ఆమె ఎమ్మెల్యే షకీల్ కలిసి బోధన్ లో పర్యటించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ.. కాంగ్రెస్ అగ్రనేతలు ఎన్నికలప్పుడే రాష్ట్రానికి వస్తారని ఫైర్ అయ్యారు. ప్రజలకు ప్రతిక్షణం అందుబాటులో ఉండేది బీఆర్ఎస్ లీడర్లేనని గుర్తు చేశారు. ప్రధాని మోడీ, కాంగ్రెస్ నేతలు బీఆర్ఎస్ పథకాలను కాపీ కొట్టారని విమర్శించారు. రైతు బంధు పథకాన్ని కేసీఆర్ తీసుకొస్తే.. దాన్ని మోడీ కాపీ కొట్టి.. తక్కువ మొత్తంలో రైతులకు ఆర్థిక సాయం చేస్తున్నారని ఆరోపించారు. రాష్ట్రంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఇప్పటివరకు ఎకరానికి రూ. 10,000 ఆర్థిక సాయం చేసిందని.. భవిష్యత్ లో ఈ మొత్తాన్ని రూ. 16,000కు పెంచబోతున్నామని చెప్పారు. తెలంగాణలో మతకల్లోలాలు రెచ్చగొట్టేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందని ఫైర్ అయ్యారు. బోధన్ నియోజకవర్గంలో ఎమ్మెల్యే షకీల్ బతుకమ్మ పండగకు ఏర్పాట్లు చేస్తున్నారని గుర్తు చేశారు. రాష్ట్రంలో మతసామరస్యం వెల్లివిరుస్తోందని గుర్తు చేశారు. వ్యవసాయాన్ని పండగ చేసిన ఘనత కేసీఆర్ దేనని కొనియాడారు. కాంగ్రెస్ అగ్రనేతలు వచ్చి మాకు నీతులు చెప్పాల్సిన అవసరం లేదని మండిపడ్డారు. రైతులకు అన్ని విధాలా మేలు చేస్తున్నామని చివరి గింజ వరకు ధాన్యం కొంటున్నామని గుర్తు చేశారు.