Homeఎడిటోరియల్​Congress Failure : కాంగ్రేస్ పార్టీ వ‌రుస‌ ఓట‌ముల‌కు ప్ర‌ధాన కార‌ణాలేమిటి

Congress Failure : కాంగ్రేస్ పార్టీ వ‌రుస‌ ఓట‌ముల‌కు ప్ర‌ధాన కార‌ణాలేమిటి

Congress Failure : కాంగ్రేస్ పార్టీ వ‌రుస‌ ఓట‌ముల‌కు ప్ర‌ధాన కార‌ణాలేమిటి

‘కాంగ్రెస్ ముక్త భారత్’ అంటే.. కాంగ్రెస్ పార్టీ నుంచి భారతదేశానికి విముక్తి కల్పించాలని భారతీయ జనతా పార్టీ (బీజేపీ) పదేపదే చెబుతుంటుంది.

వాస్తవానికి ఐదు రాష్ట్రాలకు ఎన్నికలు జరిగితే ఎన్నికలు జరిగే నాటికి నాలుగు రాష్ట్రాలు, ఉత్తర్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, మణిపూర్, గోవాల్లో భారతీయ జనతా పార్టీయే అధికారంలో ఉంది.

ఇప్పుడు ఆయా రాష్ట్రాల్లో తిరిగి అధికారంలోకి వచ్చింది. కాంగ్రెస్ పార్టీ పంజాబ్‌లో అధికారంలో ఉంది.

దానిని కోల్పోయింది. సాధారణంగా చూస్తే ఇదేమంత పెద్ద విషయంగా కనిపించకపోవచ్చు.

కానీ, రాజకీయంగా మాత్రం దీనికి ఉన్న ప్రాధాన్యం, దీని ప్రభావం వేరు.

బీజేపీ రాజకీయ ఎత్తుగడలు, ఎన్నికల వ్యూహాలకు ఎలా మెరుగులు దిద్దుకుంటోంది, కాంగ్రెస్ పార్టీ ఎక్కడ వెనకబడుతోంది అనేది పరిశీలించాల్సిన విషయం.

కొన్ని దశాబ్దాల పాటు దేశంలో మెజార్టీ ప్రాంతాల్లో దిల్లీ నుంచి గల్లీ దాకా అన్ని రాజకీయ పదవులనూ అనుభవించింది కాంగ్రెస్ పార్టీ.

అలాంటి పార్టీ ఇప్పుడు ఎందుకు తన ప్రాభవాన్ని కోల్పోతోంది? ‘కాంగ్రెస్ ముక్త భారత్’ అన్న బీజేపీ నినాదం నిజమవుతుందా? కాంగ్రెస్ పార్టీ తాజా పరిస్థితికి సంబంధించి తెలుసుకోవాల్సిన 5 అంశాలు ఇవీ..

బలమైన నాయకుడు, నాయకత్వం

నరేంద్ర మోదీ ప్రస్తుతం దేశంలో అత్యధిక ప్రజాకర్షణ ఉన్న నాయకుడు అని పలు సర్వేల ద్వారానే కాదు ఎన్నికల ఫలితాల రూపంలో కూడా స్పష్టమవుతోంది.

ఉత్తరప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికల్లో యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వ వ్యతిరేకతను అధిగమించడంలోనూ, ఉత్తరాఖండ్‌లో ముగ్గురు ముఖ్యమంత్రులను మార్చి, ప్రతి ఐదేళ్లకూ ఒకసారి ప్రభుత్వం మారిపోయే సంప్రదాయాన్నికూడా మార్చి అధికారంలోకి రావడానికి బీజేపీకి ఉన్న అతిపెద్ద సానుకూలత మోదీయేనని పలువురు రాజకీయ విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు.

పంజాబ్‌లో ఆమ్ ఆద్మీ పార్టీ విజయానికి అరవింద్ కేజ్రీవాల్‌కు ఉన్న ప్రజాదరణ కూడా బాగా సహకరించిందని బీబీసీ పంజాబీ సీనియర్ జర్నలిస్ట్ దలీప్‌సింగ్ అభిప్రాయపడ్డారు.

కొంత కాలం పాటు పంజాబ్‌లో కేజ్రీవాల్‌కూ ఒక అవకాశం ఇవ్వండి అనే ఆమ్ ఆద్మీ పార్టీ ప్రచారం చేసింది.

తర్వాతే పబ్లిక్ పోల్ ద్వారా భగవంత్ సింగ్ మాన్‌ను సీఎం అభ్యర్థిగా ప్రకటించింది.

కానీ, కాంగ్రెస్ పార్టీలో మాత్రం ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ తర్వాత అలాంటి ప్రజాకర్షణ ఉన్న నాయకుడు, నాయకురాలు మరెవరూ ఇప్పటికీ ఎదగలేదు.

వాస్తవానికి రాహుల్ గాంధీ అలాంటి నాయకుడిగా ఎదుగుతారని చాలామంది అంచనా వేశారు.

కానీ, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో రాహుల్ గాంధీ పాత్ర ఏంటి? అనేది ఎవ్వరూ స్పష్టంగా, బహిరంగంగా చెప్పలేని పరిస్థితి.

”హిందీ బెల్ట్‌గా భావించే ఉత్తర భారతంలో నరేంద్ర మోదీకి ఎదురు లేదు.

ఎందుకంటే ఆయన చెప్పే మాటలు నేరుగా ప్రజల్లోకి వెళతాయి.

మోదీ స్థాయిలో ప్రజల్ని ఆకర్షించే వాక్ చాతుర్యం మరెవరికీ లేదు” అని న్యాయవాది చల్లా లక్ష్మీకాంత బీబీసీతో అన్నారు.

నాయకత్వానికి సంబంధించి కూడా ఇదే పరిస్థితి. పార్టీ నాయకత్వం ఏ నిర్ణయం తీసుకున్నా దానికి వ్యతిరేకంగా ఒక వర్గం రాజకీయం చేయడం కాంగ్రెస్‌లో పరిపాటిగా మారింది.

బీజేపీలో ప్రస్తుతం అలాంటిది కనిపించట్లేదు.

రాహుల్ గాంధీ నాయకత్వం పట్ల ఆ పార్టీలోనే వ్యతిరేకత ఉంది.

పేరు వెల్లడించేందుకు ఇష్టపడని ఒక కాంగ్రెస్ పార్టీ నాయకుడు బీబీసీతో మాట్లాడుతూ.. పంజాబ్ ముఖ్యమంత్రిగా చరణ్‌జిత్ సింగ్ చన్నీని నియమించడం, ఉత్తరాఖండ్ మాజీ ముఖ్యమంత్రి, ప్రస్తుత ముఖ్యమంత్రి అభ్యర్థి హరీశ్ రావత్‌ను పంజాబ్ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ఇన్‌చార్జిగా నియమించడం రెండూ రాహుల్ గాంధీ తీసుకున్న నిర్ణయాలేనని తెలిపారు.

ఏదైనా ఒక వ్యూహాన్ని రచించి దాన్ని అనుకున్నట్లుగా అమలు చేయడంలో కాంగ్రెస్ విఫలమవుతోందని వెల్లడించారు.

పూర్తిస్థాయిలో దృష్టి కేంద్రీకరించకపోవడం, సరైన విధానం అవలంబించకపోవడం

న్యాయవాది చల్లా లక్ష్మీకాంత మాటల్లో చెప్పాలంటే.. ప్రస్తుత రాజకీయాలకూ, పాత రాజకీయాలకూ చాలా తేడా ఉంది.

‘ఎలక్షన్ స్టంట్’, ‘పొలిటికల్ డ్రామా’ రాజకీయాలు ఏంటో, నిబద్ధతతో చేసే రాజకీయం ఏంటో ప్రజలకు తేడా తెలుస్తోంది.

కాంగ్రెస్ పార్టీకి అమేథీ, రాయ్‌బరేలీ పెట్టని కోటల్లాంటివి.

రాహుల్ గాంధీ ప్రాతినిథ్యం వహించిన అమేథీలోను, సోనియాగాంధీ ఇంకా ప్రాతినిథ్యం వహిస్తున్న రాయ్‌బరేలీలోని మొత్తం 10 అసెంబ్లీ నియోజకవర్గాల్లోనూ ప్రధాన పోటీ బీజేపీ, సమాజ్‌వాది పార్టీల మధ్యే.

ఇందులో మూడు ఎస్సీ రిజర్వ్డ్ స్థానాలు ఉండటం గమనార్హం.

ఉత్తర్ ప్రదేశ్‌కు సంబంధించి కాంగ్రెస్ పార్టీ గత రెండేళ్ల కాలంలో ఎక్కువగా దృష్టిపెట్టిన అంశం హాథ్‌రస్‌లో జరిగిన దళిత బాలిక అత్యాచారం.

దీనిపై నిరసన తెలిపేందుకు వెళ్లే క్రమంలో పోలీసు లాఠీ దెబ్బలు తిన్నానని రాహుల్ గాంధీ చెప్పారు.

రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ ఈ అంశానికి ప్రాధాన్యత ఇచ్చి, దీనిని ఒక కీలక అంశంగా పరిగణించారు. కానీ, పార్టీ శ్రేణుల నుంచి మాత్రం దీనికి అంత ప్రాధాన్యత లభించలేదు.

ప్రియాంక, రాహుల్ గాంధీలు వెళ్లినప్పుడు స్థానికంగా నాయకులు రావడం, వీరి పర్యటన ముగిసిన తర్వాత మళ్లీ ఎవ్వరూ సంబంధిత అంశాలను పట్టించుకోకపోవడం వల్ల వీరు ఎన్నిసార్లు ఆ రాష్ట్రంలో పర్యటించినా అవి పర్యటనలుగానే మిగిలిపోతున్నాయి తప్ప సంబంధిత అంశాలపై తమ ముద్ర కనిపించేలా చేయలేకపోయారని, రాజకీయంగా వ్యూహాత్మక విధానాలు లేకపోవడం వల్లనే కాంగ్రెస్ పార్టీకి కేడర్ దూరమవుతోందని లక్ష్మీ కాంత అన్నారు.

”నరేంద్ర మోదీ ఈ వయసులో కూడా 16 గంటలకు పైగా పనిచేస్తుంటారు. తన పనితో పాటు పార్టీ గురించి, రాజకీయాల గురించి ఆలోచిస్తుంటారు. ఆ స్థాయిలో రాహుల్ గాంధీ కానీ, ప్రియాంకా గాంధీ కానీ పనిచేస్తున్నారా? అన్నది ఆలోచించుకోవాలి. ప్రజా క్షేత్రంలో మోదీ ఏ మేరకు తన మార్క్‌ను వేస్తున్నారో ఆ మేరకు రాహుల్ గాంధీ వేసుకుంటున్నారా? ప్రజల ఆలోచనల్లో మోదీకి ఉన్నంత స్పేస్ రాహుల్ గాంధీకి లభిస్తోందా?” అని సుప్రీంకోర్టు న్యాయవాది శ్రావణ్ కుమార్ బీబీసీతో మాట్లాడుతూ చెప్పారు.

కేవలం ప్రచారం చేసి, తర్వాత తమతమ వ్యక్తిగత జీవితాలకు పరిమితం అయితే ఇప్పుడున్న రాజకీయాలకు సరిపోదని, ‘గెస్ట్ అప్పియరెన్స్‌’ నడవదని శ్రవణ్ కుమార్ అభిప్రాయపడ్డారు.

పాతతరం నాయకుల్లో వ్యతిరేకత, కొత్తతరం ఓటర్లు దూరం

కాంగ్రెస్ పార్టీ అంటేనే నిర్ణయాలు తీసుకోకుండా నాన్చడం అని ఏఐసీసీ కార్యాలయం నుంచి గత దశాబ్దకాలానికి పైగా ఆ పార్టీ కార్యకలాపాలను పరిశీలిస్తున్న విలేఖరులకు బాగా తెలిసిన విషయం.

దీనికి ప్రధాన కారణం ఆ పార్టీలో ఉన్న పాతతరం నాయకత్వం అనే వాదన కూడా ఉంది.

సోనియాగాంధీ, రాహుల్ గాంధీ కోటరీల్లోని మనుషులుగా, సలహాదారులుగా, పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జులుగా ఎంతో మంది పాతతరం నాయకులు బలమైన పాత్ర పోషిస్తున్నారు.

2013లో ఏఐసీసీ, రాహుల్ గాంధీని తదుపరి తరం నాయకుడిగా నిర్ణయిస్తూ పార్టీ ఉపాధ్యక్షుడిగా నియమించింది.

జైపూర్‌లో జరిగిన ఈ నియామకం అనంతరం కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సభ్యులను ఉద్దేశించి రాహుల్ మాట్లాడుతూ.. ”మేమంతా కలసి దేశాన్ని కొత్తగా మార్చేస్తాం (ట్రాన్స్‌ఫార్మ్)” అన్నారు.

కానీ, ఆయన పార్టీలో కూడా ఏమాత్రం మార్పు తీసుకురాలేకపోయారు.

వాస్తవానికి గ్రాండ్ ఓల్డ్ పార్టీగా పిలిచే కాంగ్రెస్‌ పార్టీలో వ్యవస్థీకృతంగా మార్పులు తీసుకురావాలని అంతకు ముందు పార్టీ ప్రధాన కార్యదర్శిగా ఉన్నప్పటినుంచే రాహుల్ గాంధీ ప్రయత్నించారు.

పార్టీలో అంతర్గత ప్రజాస్వామ్యం ఉండాలని, నియామకాల్లో పారదర్శకత ఉండాలని, పార్టీ పదవులకు ఎన్నికలు నిర్వహించాలని ఆయన భావించారు. కానీ, అవేవీ సఫలం కాలేదు.

దీనికి ప్రధాన కారణం కాంగ్రెస్ పార్టీలోని పాతతరం నాయకులేనని భావిస్తుంటారు.

కాంగ్రెస్ పార్టీలో సమూల మార్పులు చేయాలంటూ 2019లో గ్రూప్ ఆఫ్ 23 లేదా జీ23గా పిలిచే కాంగ్రెస్ నాయకుల బృందం సోనియా గాంధీని డిమాండ్ చేసింది.

గులాంనబీ ఆజాద్, కపిల్ సిబల్, వీరప్ప మొయిలీ, ముకుల్ వాస్నిక్, ఆనంద్ శర్మ, రాజ్‌బబ్బర్, శశిథరూర్ వంటి వాళ్లు ఈ బృందంలో ఉన్నారు. జీ23 అంటే జీ హుజూర్ 23 కాదని అప్పట్లో కపిల్ సిబల్ వ్యాఖ్యానించారు.

వాస్తవానికి కాంగ్రెస్ పార్టీలో పాత తరానికీ, కొత్త తరానికీ మధ్య సంఘర్షణ చాలాకాలం నుంచే ఉంది.

కొత్త తరానికి చెందిన ఎంతో మంది నాయకులు, రాహుల్ గాంధీకి ఎంతో దగ్గర అనుకున్న జ్యోతిరాదిత్య సింధియా, ఆర్పీఎన్ సింగ్ లాంటి నాయకులు కూడా కాంగ్రెస్ పార్టీని వదిలిపెట్టి ఇతర పార్టీల్లో చేరారు.

రాజస్థాన్‌లో అశోక్ గెహ్లాట్, సచిన్ పైలట్ మధ్య ఘర్షణ ఇప్పటికీ పూర్తిగా సమసిపోలేదు.

అసోసియేషన్ ఫర్ డెమొక్రటిక్ రిఫార్మ్స్(ఏడీఆర్) నివేదిక ప్రకారం.. 2016 నుంచి 2020 మధ్య కాలంలో దేశవ్యాప్తంగా పార్టీలు మారిన ఎమ్మెల్యేలు 405 అయితే, అందులో 170 మంది (42 శాతం) కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలే ఉన్నారు.

మరోవైపు కొత్తతరం ఓటర్లను ఆకట్టుకోవడంలో కూడా కాంగ్రెస్ పార్టీ విఫలమవుతోందని ఆ పార్టీకి ఎన్నికల్లో లభిస్తున్న ఓట్ల శాతాన్నిబట్టి తెలుస్తోంది.

ఒక రీసెర్చి సంస్థతో కలసి లైవ్‌మింట్ దినపత్రిక నిర్వహించిన మిల్లీనియల్ సర్వే ప్రకారం 50 శాతం కొత్తతరం ఓటర్లు మోదీని, బీజేపీని ఇష్టపడుతుంటే రాహుల్ గాంధీని, కాంగ్రెస్ పార్టీని ఇష్టపడుతున్న వారి శాతం 20 కూడా లేదు.

”కొత్తతరం ఓటర్లను ఆకట్టుకునే విధంగా పార్టీ కార్యక్రమాలను రూపొందించుకోవాల్సిన అవసరం ఉంది” అని ఆలిండియా కాంగ్రెస్ కమిటీ (ఏఐసీసీ) కార్యదర్శి గిడుగు రుద్రరాజు బీబీసీతో అన్నారు.

జనరేషన్ గ్యాప్ వచ్చిందని, స్వాతంత్ర్య ఉద్యమంలో కాంగ్రెస్ పార్టీ పోషించిన పాత్ర గురించి, స్వాతంత్ర్యానంతరం దేశ నిర్మాణంలో కాంగ్రెస్ పార్టీ పాత్ర గురించి ప్రస్తుత తరానికి తెలియదని చెప్పారు.

ప్రస్తుతం ఓటర్లు సోషల్ మీడియా, వాట్సాప్‌ల ద్వారా కూడా ప్రభావితం అవుతున్నారని తెలిపారు.

కాంగ్రెస్ పార్టీ కూడా వామపక్షాల్లాగే అవుతుందా?

భారతదేశంలో వామపక్షాలు.. ప్రధానంగా సీపీఎం, సీపీఐలు ఎప్పుడూ ఈ దేశాన్ని పాలించలేదు. లెఫ్ట్ ఫ్రంట్‌ దేశంలో ఏకకాలంలో అధికారంలో ఉన్న రాష్ట్రాలు మూడు (త్రిపుర, పశ్చిమ బెంగాల్, కేరళ) మాత్రమే.

ఈ రెండు పార్టీలకూ అత్యధికంగా లోక్‌సభ సీట్లు లభించింది 2004లో. సీపీఎం 43 స్థానాల్లోనూ, సీపీఐ 10 స్థానాల్లోనూ గెలుపొందాయి. ప్రస్తుతం కేరళలో మాత్రమే వామపక్ష ప్రభుత్వం అధికారంలో కొనసాగుతోంది.

కాంగ్రెస్ పార్టీ ఈ దేశంలో ప్రతిపక్షంలో కూర్చుంది ఇప్పటి వరకూ 14 సంవత్సరాలు మాత్రమే.. అంటే 55 సంవత్సరాల పాటు అధికారంలో కొనసాగింది.

లోక్‌సభలో కాంగ్రెస్ పార్టీ అత్యధికంగా గెలుచుకున్న స్థానాలు 404 (1984 ఎన్నికల్లో. ఇందిరాగాంధీ హత్య తర్వాత జరిగిన ఎన్నికలు. రాజీవ్ గాంధీ నాయత్వం చేపట్టారు).

ఓట్ల శాతం పరంగా కూడా ఆ పార్టీకి అదే ఉత్తమ ప్రదర్శన. మొత్తం పోలైన ఓట్లలో కాంగ్రెస్‌కు 49.01 శాతం ఓట్లు లభించాయి.

పార్టీ దారుణ ఓటమి సీట్ల పరంగా, ఓట్ల శాతం పరంగా 2014లో.. 19.3 శాతం ఓట్లతో 44 లోక్‌సభ స్థానాలు దక్కించుకుంది.

ఇప్పటికి రాజస్థాన్, చత్తీశ్‌గఢ్ రాష్ట్రాల్లో ఆ పార్టీ అధికారంలో ఉంది.

మహారాష్ట్ర, తమిళనాడు, జార్ఖండ్ రాష్ట్రాల్లో ఇతర పార్టీలతో కలసి ఏర్పాటు చేసిన ప్రభుత్వంలో కొనసాగుతోంది. 29 రాష్ట్రాల్లో కనీసం ఒక్కసారి అయినా అధికారం చేపట్టింది.

రాజకీయ ప్రభావం, అధికారం, ఎన్నికల్లో గెలుపు.. ఏ కోణంలోనూ కాంగ్రెస్ పార్టీకి వామపక్షాలు దరిదాపుల్లో కూడా లేవు.

అయితే, సిద్దాంత పరమైన రాజకీయాలతో పాటు ప్రజల రోజువారీ జీవనంలో భాగంగా ఎదుర్కొనే సమస్యలపైన కూడా పోరాటం చేస్తూ, ప్రజలకు అండదండగా ఉండకపోతే మాత్రం లెఫ్ట్ పార్టీల్లాగే కాంగ్రెస్ పార్టీకి కూడా ప్రజాబలం తగ్గిపోతుందని కాంగ్రెస్ నాయకులు కూడా అంగీకరిస్తున్నారు.

”కమ్యూనిస్టుల పరిస్థితి కాంగ్రెస్‌కు రాకపోవచ్చు. కానీ, ప్రజాస్వామ్య దేశంలో కాంగ్రెస్ వంటి పార్టీ ఇలా ఉండటం మాత్రం మంచిది కాదు.

కాంగ్రెస్ ముక్త భారత్ అనేది బీజేపీ నినాదం అయినప్పటికీ.. కాంగ్రెస్ నాయకుల నిర్లక్ష్యం వల్లనే అది సాధ్యమయ్యే పరిస్థితి కనిపిస్తోంది.

పార్టీకి దిశా, నిర్దేశం లేకుండా చేస్తోంది నాయకులే.

కాంగ్రెస్ పార్టీ అలక్ష్యం వల్లనే ఇప్పుడు తృణమూల్ మమతా బెనర్జీ, టీఆర్ఎస్ కేసీఆర్, తాజాగా ఆమ్ ఆద్మీ కేజ్రీవాల్ లాంటి వాళ్లు కూడా ప్రధాన మంత్రి పదవికి రేసులో ఉన్నారనేలా అభిప్రాయాలు వినిపిస్తున్నాయి” అని శ్రావణ్ కుమార్ చెప్పారు.

2021 డిసెంబర్‌ 26 నుంచి 29 వరకు తాడేపల్లిలో సీపీఎం ఆంధ్రప్రదేశ్ 26వ రాష్ట్ర మహా సభలు జరిగాయి.

ఆ సందర్భంగా సీపీఎం పొలిట్ బ్యూరో సభ్యుడు బీవీ రాఘవులు మాట్లాడుతూ.. ”సరళీకరణ విధానాలు వచ్చాక ప్రజల జీవితాల్లో పెనుమార్పులు వచ్చాయి. అందుకు అనుగుణంగా పోరాట పంథాను మార్చుకోవాలి” అని చెప్పారు.

సీపీఎం పార్టీ సిద్ధాంత పరంగా చేసే పోరాటాలతో పాటు, ప్రజలు తమ జీవితాల్లో ఎదుర్కొనే ఇతర సమస్యలపైనా దృష్టిపెట్టాల్సి ఉందని తెలిపారు.

”కూలీ, వేతనాల పెంపు, భూపంపిణీ వంటి వర్గ సమస్యలపై పోరాడుతూనే, నివాస ప్రాంతాల్లో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై అధ్యయనం చేసి, పోరాటాల్లోకి ప్రజలను సమీకరించాలి” అని చెప్పారు.

కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతపరమైన అంశాలు.. ఆ పార్టీ వెబ్‌సైట్‌లో పేర్కొన్న మేరకు.. ప్రజాస్వామ్యం, జాతీయవాదం, సెక్యులరిజం, సమ్మిళిత వృద్ధి (ఇన్‌క్లూజివ్ గ్రోత్), సామాజిక న్యాయం.

విధానపరమైన పోరాటాలకు ప్రజాబలం పెంచుకోవాలంటే.. ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులపై దృష్టి కేంద్రీకరించడం ఒక్కటే మార్గమని బీవీ రాఘవులు తెలిపారు.

కాంగ్రెస్ పార్టీ మళ్లీ పుంజుకోవాలంటే ఏం చేయాలి?

”రాష్ట్రాల్లో ఉన్న నాయకత్వం పట్ల, అంతులేని స్వార్థంతో పనిచేసే నాయకుల పట్ల వ్యతిరేకత ఉందే తప్ప నెహ్రూ-గాంధీ కుటుంబం పట్ల ప్రజల్లో వ్యతిరేకత లేదు” అని రెండు దశాబ్దాలకు పైగా కాంగ్రెస్ పార్టీ కార్యకలాపాలను కవర్ చేస్తున్న సీనియర్ జర్నలిస్టు (ఎన్టీవీ) బీఎల్‌ఎస్వీ ప్రసాద్ అన్నారు.

తాము ప్రాతినిధ్యం వహిస్తున్న పార్టీని అన్నివిధాలుగా బలోపేతం చేయకుండా కాంగ్రెస్‌లో నాయకులు వ్యక్తిగతంగా బలపడ్డారని చెప్పారు.

ప్రజల అవసరాలు, అభిరుచులు, అభిప్రాయాలకు అనుగుణంగా కాంగ్రెస్ పార్టీ మారాల్సి ఉందని, అదంత తేలిక కాకపోయినప్పటికీ నిరుత్సాహ పడాల్సిన పనిలేదన్నారు.

ప్రజాజీవితంలో సుదీర్ఘకాలం పాటు ఓర్పుతో, పట్టుదలతో రాహుల్ గాంధీ ప్రజల కోసం పనిచేయాలని, ప్రజాప్రయోజనాలే లక్ష్యంగా పనిచేస్తున్నారనే భావన ప్రజలకు కలగాలని, అప్పుడే ప్రజలు అధికారం ఇస్తారని చెప్పారు.

”గెలుపు, ఓటమితో సంబంధం లేకుండా ప్రజల మధ్యలోనే ఉండాలి. పార్టీ సిద్ధాంతాల ప్రకారం, ప్రజల సమస్యల పరిష్కారానికి కృషి చేయాలి. తప్పుల్ని సవరించుకుని ముందుకెళ్లాలి” అని గిడుగు రుద్రరాజు చెప్పారు.

”ప్రజా సమస్యలకు అనుగుణంగా పనిచేయాలి. ప్రత్యర్థి కంటే, ప్రత్యర్థి పార్టీ కంటే మేం బాగా పనిచేస్తాం అనే నమ్మకాన్ని ప్రజలకు ఇవ్వాలి.

అంతే తప్ప ఎదుటివాళ్ల ఓటమి మనకు గెలుపు అవుతుందిలే అని, ఎదుటివాళ్లపై వ్యతిరేకతతో మనకు ఓటేస్తారులే అని కాంగ్రెస్ నాయకులు అనుకోకూడదు.

ఎదుటివాళ్లను కూడా ఓడించి కాంగ్రెస్‌ను అధికారంలోకి తీసుకురావాలి అని ప్రజల్లో అనిపించేలాగా నాయకులు పనిచేయాలి” అని శ్రావణ్ కుమార్ తెలిపారు.

నరేంద్ర మోదీ ప్రభుత్వం కొత్తగా తీసుకువచ్చిన మూడు వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలంటూ దాదాపు 40కి పైగా రైతు సంఘాలు సంయుక్త కిసాన్ మోర్చా పేరిట దిల్లీ సరిహద్దుల్లో నిరసనలు తెలిపి, విజయం సాధించారు.

నరేంద్ర మోదీ మెడలు వంచారంటూ అప్పట్లో రైతుల్ని చాలామంది అభినందించారు.

అయితే, సంయుక్త కిసాన్ మోర్చాకు చెందిన పలువురు రైతు నాయకులు పంజాబ్ ఎన్నికల్లో పోటీ చేయాలని నిర్ణయించుకున్నారు.

ఆ సందర్భంగా సంయుక్త కిసాన్ మోర్చా అధికార ప్రతినిధి డాక్టర్ దర్శన్ పాల్ స్పందిస్తూ.. ”పోరాటం చేసేంత వరకే వీళ్లంతా రైతులు. ఒకసారి తిరిగి తమ గ్రామాలకు చేరుకున్నారంటే వీళ్లు వివిధ పార్టీలకు చెందినవాళ్లు” అని అన్నారు.

Recent

- Advertisment -spot_img