– నటి త్రిషపై ఆయన చేసిన కామెంట్స్ విషయంలో జాతీయ మహిళా కమిషన్ సీరియస్
– అలీఖాన్‌పై చర్యలు తీసుకోవాలంటూ తమిళనాడు పోలీసులకు ఆదేశాలు
ఇదే నిజం, నేషనల్ బ్యూరో: నటి త్రిషపై నటుడు మన్సూర్ అలీఖాన్ చేసిన వ్యాఖ్యలను జాతీయ మహిళా కమిషన్ సీరియస్‌గా తీసుకుంది.ఈ విషయాన్ని సుమోటోగా స్వీకరించిన ఎన్‌సీడబ్ల్యూ.. మన్సూర్‌పై కేసు నమోదు చేయాలని తమిళనాడు పోలీసులకు ఆదేశాలు జారీ చేసింది.
త్రిషపై ఆయన చేసిన వ్యాఖ్యలు ఎంతగానో బాధించాయని.. మహిళల గురించి ఈ విధంగా అసభ్యకరమైన వ్యాఖ్యలు చేస్తే సహించేదిలేదని తెలిపింది. ‘త్రిషను ఉద్దేశించి మన్సూర్ అలీఖాన్ చేసిన వ్యాఖ్యలను మేము ఖండిస్తున్నాం. అతడిపై ఐపీసీ సెక్షన్ 509బీ (ఎలక్ట్రానిక్ మీడియంలో లైంగిక ఆరోపణలు)తో ఇతర సంబంధిత సెక్షన్లపై కేసు నమోదు చేయాలని తమిళనాడు డీజీపీకి ఆదేశాలు జారీ చేస్తున్నాం. మహిళలపై హింసను ప్రేరేపించే ఇలాంటి వ్యాఖ్యలను సహించేది లేదు’అని ఎన్‌సీడబ్ల్యూ ట్వీట్ చేసింది. తమిళ నటుడు మన్సూర్ అలీఖాన్ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ‘లియో’లో త్రిషతో ఓ సీన్ గురించి అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారు. ‘గతంలో ఎన్నో చిత్రాల్లో నేను రేప్ సీన్లలో నటించా. ‘లియో’లో ఆఫర్ వచ్చినప్పుడు త్రిషతోనూ అలాంటి సీన్ ఉంటుందని అనుకున్నా. కాకపోతే, అలాంటి సీన్ లేకపోవడం బాధగా అనిపించింది’అని మన్సూర్ అలీఖాన్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. దీనిపై త్రిష ఆగ్రహం వ్యక్తం చేశారు. అతడి వ్యాఖ్యలను తాను తీవ్రంగా ఖండిస్తున్నానన్నారు. ఇలాంటి వారి వల్లే సమాజానికి చెడ్డపేరు వస్తుందని.. అతడితో కలిసి స్క్రీన్ షేర్ చేసుకోనందుకు ఆనందంగా ఉందన్నారు. మరోవైపు, మన్సూర్ వ్యాఖ్యలపై సినీ ప్రముఖులు సైతం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి వ్యాఖ్యలు చేయడం తగదంటున్నారు