Homeహైదరాబాద్latest NewsMahatma Jyotirao Phule : ప్రాతస్మరణీయుడు జ్యోతీబా….

Mahatma Jyotirao Phule : ప్రాతస్మరణీయుడు జ్యోతీబా….

ఇదేనిజం: నేటి తరానికి మహాత్ముడు అంటే మొదటగా గుర్తొచ్చేది గాంధీజీ నే . కానీ గాంధీజీ మహాత్ముడిగా పరిణామం చెందడానికి ముందే జ్యోతిబా ఫూలే మహాత్ముడు. గాంధీజీ ఎలాగైతే తాను ఎదుర్కొన్న అవమానాల నుండి ఒక మహోద్యమానికి స్వీకారం చూట్టాడో, ఫూలే కూడా తాను అనుభవించిన కుల వివక్షకు వ్యతిరేఖంగా ఒక నవ సమాజ నిర్మాణానికి పూనుకున్నాడు.అక్కడ పోరాటం పరాయివాడితో . ఇక్కడ పోరాడాల్సింది మనవాళ్ళతో.అక్కడ కేవలం శత్రువుని దేశం నుండి పారద్రోలితే సరిపోతుంది.ఇక్కడ సమాజం లో ఒక పరివర్తన తీసుకురావాలి.వేలాది ఏళ్లుగా కుల, వర్గ, వర్ణ, జాతి విభేదాల పేరుతో తమ మనసులో కంచెలు ఏర్పరచుకున్న భారతీయుల ఆలోచనా సరళిలో సమూలంగా మార్పుని తీసుకురావాలి. ఆనాడు మహారాష్ట్రలో శూద్రుల పరిస్థితి ఎంత దయనీయంగా ఉండేదంటే వారు ఇంటి నుండి బయటకి వెళ్లాల్సి వస్తే మూతికి ముంత, నడుముకి చీపురు కట్టుకుని మాత్రమే వెళ్ళాలి.ఎందుకంటే వారి ఉమ్మి నేలమీద పడకూడదు. వారు నడిచిన అడుగుల జాడలు నేలమీద కనపడకూడదు.ఆలయాల్లో ప్రవేశానికి,విద్య నేర్చుకోవడానికి, ముఖానికి పసుపు-కుంకుమలు ధరించడానికి కూడా వారు అనర్హులు.పొరపాటున ఎవరైనా శూద్రుడు వేదాల్ని చదివినట్లు బయటకి తెలిస్తే అతని చెవిలో సీసం పోసి నిర్దాక్షిణ్యంగా చంపేంత పాశవిక న్యాయ వ్యవస్థ ఆరోజుల్లో రాజ్యమేలేది.

అలాంటి పరిస్థితుల్లో పూనా లోని దళిత మాలి కుటుంబానికి చెందిన గోవింద రావు ఫూలే, చిమ్నాబాయి దంపతులకి 11 ఏప్రిల్,1827న జన్మించాడు జ్యోతిరావ్ ఫూలే.వారి పూర్వీకులని మొదట్లో గోరేలని పిలిచేవారు.వారు మహారాష్ట్రలోని సతారా నుండి పూనా కి వలస వచ్చి అక్కడ పూల వ్యాపారం లో స్థిరపడ్డారు .క్రమంగా వారి ఇంటి పేరు ఫూలే(పూలమ్మే వారు ) గా స్థిరపడింది. జ్యోతిరావ్ పుట్టిన సంవత్సరంలోపే అనారోగ్యం వల్ల తల్లి చిమ్నాబాయి కనుమూసింది. ప్రాథమిక విద్య పూర్తి చేసిన తర్వాత, జ్యోతిరావ్ తండ్రికి పొలం పనుల్లో, పూల వ్యాపారం లో సహాయంగా ఉండేవాడు. పదమూడేళ్ళ వయసులోనే ఆయనకి సావిత్రి బాయి తో వివాహం జరిగింది. ఫూలేలో చిన్నతనం నుండే సహజ సిద్ధంగా వచ్చిన ప్రజ్ఞా పాటవాల్ని గమనించిన ఒక ఉపాధ్యాయుడు ఆయన తండ్రిని ఒప్పించి ఫూలే ని సెకండరీ స్కూలు కి పంపించే ఏర్పాటు చేశాడు.అక్కడే థామస్ పెయిన్ అనే అమెరికన్ రచయిత వ్రాసిన HUMAN RIGHTS పుస్తకం ఫూలేని ఎంతగానో ప్రభావితం చేసింది.ఫూలే లోని సంస్కరాణాభిలాషకి బీజం అక్కడే పడిందనుకోవచ్చు.

కొన్ని సార్లు అవమానం అనేది మనిషి మనసు పొరల్లో నిద్రాణస్థితిలో ఉన్న ఒక ఆలోచనని, బాధ్యతని వెన్ను తట్టి లేపుతుంది. దక్షిణాఫ్రికా లో ఒక రైలు ప్రయాణంలో గాంధీ కి జరిగిన అవమానం, తర్వాత ఆయనని స్వాతంత్రోద్యమంలోకి దిగేలా పురికొల్పింది .అలాంటి సంఘటనే 1848 లో ఫూలే కి కూడా ఎదురయ్యింది.తన మిత్రుని వివాహ వేడుకకి హాజరయిన ఫూలేని, ఒక శూద్రుడు తమతో సరిసమానంగా ఊరేగింపు వేడుకలో పాల్గొనడం సహించలేని ఆ మిత్రుని తల్లిదండ్రులు,బంధువులు ఆయనని ఘోరంగా అవమానించి,వేడుక మధ్యలోనుండే వెళ్లగొట్టారు.ఆ అవమానం సమాజంలో పాతుకుపోయిన వర్ణ వ్యవస్థ, అంటరానితనం పట్ల ఫూలే లో ఆగ్రహ జ్వాలల్ని రగిలించింది. ఆ సంఘటన తర్వాత ఫూలేకి తన కర్తవ్యం ఏమిటో స్పష్టంగా బోధ పడింది.అప్పటి సామాజిక వ్యవస్థని మరింత క్షుణ్ణంగా అధ్యయనం చేయడం మొదలు పెట్టాడు. శూద్రులు, ఇతర అణగారిన వర్గాలు, స్త్రీల (ముఖ్యంగా వితంతువులు) దీన స్థితి ఆయన్ని విఫరీతంగా కలచివేసింది.వారి జీవితాల్లో మార్పు తేవాలంటే చదువొక్కటే తగిన ఆయుధమని ఆయన గ్రహించాడు. ఆ మార్పు తన ఇంటి నుండే మొదలవ్వాలని, 1848 లోనే తన భార్య సావిత్రి భాయి ఫూలే కి చదవడం, రాయడం నేర్పించాడు.ఆ రోజుల్లో స్త్రీలు విద్య నేర్చుకుంటే భర్తకి ఆయుక్షీణమనే మూఢనమ్మకం బలంగా ఉండేది. సావిత్రికి చదువు నేర్పడం ద్వారా ఆ నమ్మకాన్ని పటాపంచలు చేశాడు ఫూలే. ఆ తర్వాత అదే సంవత్సరం ఫూలే దంపతులు దేశంలోనే మొట్టమొదటి సారిగా బాలికల కోసం ఒక పాఠశాలని ప్రారంభించారు. శూద్రుడైన ఫూలే స్థాపించిన ఆ పాఠశాలలో బోధించడానికి ఎవ్వరూ ముందుకు రాకపోవడంతో, సావిత్రినే బోధించడానికి నియమించాడు. అలా సావిత్రీ బాయి ఫూలే ఆధునిక భారతదేశంలోనే మొట్ట మొదటి మహిళా ఉపాధ్యాయురాలిగా చరిత్రకెక్కింది. భారత చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించదగిన సంఘటన అది.ఈ క్రమంలో అగ్రవర్ణాల వారి నుండి లెక్కలేనన్ని వేధింపులు ఎదురైనా తట్టుకుని నిలబడ్డారు ఫూలే దంపతులు.

ఆనాటి సమాజం లో బాల్య వివాహాలు సర్వసాధారణం. వితంతు వివాహాలు పూర్తిగా నిషిద్ధం. చాలా మంది వితంతువులు యువతులే . 1863లో ఒక వితంతు మహిళ తన అక్రమ సంతానాన్ని గత్యంతరం లేని స్థితిలో చంపి, ఒక బావిలో పడవేసిన ఘటన ఫూలే ని తీవ్రంగా బాధించింది. అలాంటి సంఘటనల్ని అరికట్టడానికి 1863 లో ఒక అనాథాశ్రమాన్ని స్థాపించాడు.ఇది పూణే లో ఒక పెను సంచాలనాన్నే సృష్టించింది. అక్కడ గర్భిణులైన వితంతువులు క్షేమంగా ప్రసవం చేసుకునే వసతులు కల్పించాడు. వారి వివరాల్ని బయటకి రానివ్వకుండా గోప్యంగా ఉంచేవాడు. వారు కావాలనుకుంటే ఆ పిల్లల్ని తమతో తీసుకెళ్లవచ్చు.లేదంటే ఆ పిల్లల బాధ్యత ఫూలే నే చూసుకునేవాడు.

1874 లో జ్యోతి రావు ఫూలే సత్యశోధక సమాజాన్ని స్థాపించాడు.సామాజిక వివక్షకి గురి అవుతున్న అణగారిన వర్గాల హక్కుల పరిరక్షణ ఈ సంస్థ యొక్క ముఖ్య లక్ష్యం. అగ్రవర్ణాల,ఛాందసవాదుల ఆధిపత్యాన్ని సవాలు చేస్తూ సార్వ జనీన సత్య ధర్మ పుస్తక్ , గులాంగిరి వంటి ఎన్నో గ్రంథాలని రచించాడు. ఆయన సేవలకి గుర్తుగా విఠల్ రావు అనే మరో సంఘ సంస్కర్త 1888 లో ఫూలేని ‘మహాత్మ’ అనే బిరుదుతో సత్కరించాడు. ఫూలే సాధించిన విజయాలు తర్వాతి తరం లో ఎంతోమందికి స్ఫూర్తిదాయకంగా నిలిచాయి. రాజ్యాంగ నిర్మాత B.R అంబేద్కర్ ని అత్యంత ప్రభావితం చేసిన ముగ్గురు గొప్ప వ్యక్తుల్లో ఫూలే కూడా ఒకడు.(బుద్ధుడు, సంత్ కబీర్ మిగతా ఇద్ధరు).

తన తుది శ్వాస వరకూ అణగారిన వర్గాల అభ్యున్నతి కోసం పరితపించిన మహాత్మా జ్యోతి రావు ఫూలే 28 నవంబర్ 1890న పరమపదించారు.

(నేడు ఫూలే 198వ జయంతి)

-కట్ట రాకేష్

Recent

- Advertisment -spot_img