– టికెట్లపై పీసీసీ చీఫ్ మార్క్
– సర్వే రిపోర్ట్ పేరిట బిగ్ స్కెచ్
– రేవంత్ టికెట్లు అమ్ముకుంటున్నారంటూ
సొంతపార్టీ నేతల ఆరోపణ
– తన వర్గాన్ని పెంచి పోషించుకొనేందుకు రేవంత్ ప్లాన్?
– సీనియర్లకు ఎక్కడికక్కడ చెక్?
– కాంగ్రెస్ లిస్ట్‌పై ఫుల్ సస్పెన్స్
– 30 స్థానాల్లో తీవ్ర పోటీ?
– సునీల్ కనుగోలు సర్వేలే ఆధారం
– సర్వేల మాటున పట్టు బిగిస్తున్న రేవంత్
– సీనియర్లలో మొదలైన టెన్షన్
– టికెట్ల కేటాయింపులో స్పష్టంగా రేవంత్ ముద్ర
– పీసీసీ చీఫ్ పై మొదలైన అసంతృప్తి
ఇదేనిజం, తెలంగాణ బ్యూరో: ‘సర్వేలే ఫైనల్ .. సర్వేలో ఎవరికి బలముంటే వారికే టికెట్. ఎంత పెద్ద లీడర్ అయినా సర్వే ఆధారంగానే టికెట్ కేటాయిస్తాం.’ ఇటీవల కాంగ్రెస్ పార్టీ టికెట్ల విషయంలో పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి తరుచూ చెబుతున్న మాట. కానీ ఈ సర్వేల వెనుక ఏదైనా మతలబు ఉందా? అని కాంగ్రెస్ పార్టీలోని కొందరు ముఖ్య నేతలు అనుమాన పడుతున్నారు. ఎందుకంటే ప్రస్తుతం తెలంగాణ కాంగ్రెస్ టికెట్లకు సంబంధించి సునీల్ కనుగోలు సర్వే రిపోర్టే ఫైనల్. ఆ రిపోర్ట్ ఆధారంగా కాంగ్రెస్ హైకమాండ్ టికెట్లు కేటాయిస్తోంది. అయితే సునీల్ కనుగోలు సర్వేపై సొంతపార్టీలోనే అనేక అనుమానాలు వినిపిస్తున్నాయి. రేవంత్ రెడ్డి సర్వేల మాటున తన సొంత వర్గాన్ని బలంగా పోషించుకుంటున్నారని పలువురు సీనియర్లు లోలోపల మథనపడుతున్నట్టు తెలుస్తోంది. సునీల్ కనుగోలు రేవంత్ చెప్పినట్టుగా నడుచుకుంటున్నారన్నది వారి ఆరోపణ. కాంగ్రెస్ పార్టీలోని సీనియర్ నేతలు మల్లు భట్టి విక్రమార్క, ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి సైతం తమ అనుచరులకు టికెట్లు ఇప్పించుకోలేని పరిస్థితి నెలకొన్నది. రేవంత్ రెడ్డి సర్వేలపేరుతో అక్కడ తమ అనుచరుగణాన్ని దించుతున్నారన్న విమర్శలు వస్తున్నాయి. కాంగ్రెస్ పార్టీ ఫస్ట్ లిస్ట్ ఇంకా బయటకు రాకముందే పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిపై అనేక ఆరోపణలు వస్తున్నాయి. పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి.. మహేశ్వరం టికెట్ ను రూ. 10 కోట్లు, ఐదెకరాలు భూమి తీసుకొని అమ్ముకున్నారని.. ఆ సెగ్మెంట్ టికెట్ ఆశించిన కొత్త మనోహర్ రెడ్డి ఆరోపించారు. సర్వే రిపోర్ట్ అనుకూలంగా ఉండటంతో ఈ టికెట్ బడంగ్‌పేట కార్పొరేషన్ మేయర్ చిగిరింత పారిజాతరెడ్డికి ఇవ్వబోతున్నట్టు జోరుగా ప్రచారం సాగుతోంది. ఇలా అనేక నియోజకవర్గాల్లోనూ ఇదే పరిస్థితి ఉంది.
సునీల్ కనుగోలుపై సీనియర్ల గుస్సా
కాంగ్రెస్ పార్టీ ఎన్నికల వ్యూహకర్త సునీల్ కనుగోలు పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డికి అనుకూలంగా వ్యవహరిస్తారని జోరుగా ప్రచారం సాగుతోంది. సునీల్ కనుగోలుపై మొదటి నుంచి కాంగ్రెస్ సీనియర్లు విమర్శలు గుప్పిస్తున్నారు. తన మీద సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం సాగుతోందని కాంగ్రెస్ ఎంపీ, సీనియర్ నేత ఉత్తమ్ కుమార్ ఆరోపించారు. గత నవంబర్‌లో ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆరోపించగా.. పోలీసులు ఎంక్వైరీ చేస్తే కాంగ్రెస్ వార్ రూమ్ నుంచే ఉత్తమ్ కుమార్ రెడ్డిపై తప్పుడు ప్రచారం సాగుతోందని తేలింది. నిజానికి సునీల్ కనుగోలు అండ్ టీమ్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా పోస్టులు పెట్టాలి. రాష్ట్ర ప్రభుత్వం మీద వ్యతిరేకంగా ప్రచారం చేయాలి. ప్రభుత్వ తప్పులను ఎత్తిచూపాలి. కానీ కనుగోలు టీమ్ మాత్రం ప్రభుత్వ వ్యతిరేక పోస్టులు పెడుతూనే.. రేవంత్ రెడ్డికి అనుకూలంగా.. కాంగ్రెస్ పార్టీలోని ఆయన వ్యతిరేకుల మీద పోస్టులు పెట్టినట్టు తేలింది. దీంతో అప్పట్లోనే సీనియర్ లీడర్లు సునీల్ కనుగోలుపై విమర్శలు గుప్పించారు. తాజాగా మరోసారి ఇదే తరహా ఆరోపణలు వినిపిస్తున్నాయి. సునీల్ కనుగోలు రేవంత్ రెడ్డి చెప్పిన విధంగానే సర్వేలు తయారు చేస్తున్నారన్న ఆరోపణలు గుప్పుమంటున్నాయి. సీనియర్ లీడర్ల అనుచరులకు టికెట్ల రాకుండా రేవంత్ రెడ్డి అడ్డం పడుతున్నారని.. ఇందుకు సునీల్ కనుగోలు సర్వే రిపోర్టలను అడ్డం పెట్టుకుంటున్నారన్న ఆరోపణలు ఉన్నాయి.
లిస్ట్ వస్తే రణరంగమే..
కాంగ్రెస్ పార్టీ లిస్ట్ విషయంలో ప్రస్తుతం సస్పెన్స్ వాతావరణం నెలకొన్నది. హస్తం పార్టీకి సంబంధించి 60 నుంచి 70 నియోజకవర్గాల్లో పెద్దగా సమస్య లేదు. ఎందుకంటే అక్కడ సీనియర్ లీడర్లు ప్రాతినిథ్యం వహిస్తున్నారు. కానీ 40 నుంచి 50 నియోజకవర్గాలు మాత్రం తీవ్ర సమస్యాత్మకంగా ఉన్నాయి. అక్కడ టికెట్ ఆశిస్తున్న వారి సంఖ్య ఎక్కువగా ఉంది. మరోవైపు సీనియర్ లీడర్ల అనుచరులు ఉన్న చోట కూడా సమస్య పెరిగే అవకాశం ఉంది. కొన్ని నియోజకవర్గాల్లో కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, మల్లు భట్టి విక్రమార్క అనుచరులకు టికెట్లు ఖాయమని హామీ ఇచ్చారు. కానీ అక్కడ సర్వేల పేరుతో రేవంత్ రెడ్డి తన మనుషులకు టికెట్లు ఇప్పించుకొనేలా ప్లాన్ చేస్తున్నారు. దీంతో ఆయా నియోజకవర్గాల్లో గందరగోళ పరిస్థితి నెలకొన్నది. కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి కి భువనగిరి అసెంబ్లీ సెగ్మెంట్ మీద ఎంతో పట్టుంది. ఆ పార్లమెంటు నియోజకవర్గం నుంచి ఆయన ఎంపీగా కూడా ప్రాతినిథ్యం వహిస్తున్నారు. అయితే ఈ సెగ్మెంట్ లో వెంకట్ రెడ్డిని తీవ్రంగా విమర్శించి బీఆర్ఎస్ పార్టీలో చేరిన కుంభం అనిల్ కుమార్ రెడ్డి నెల తిరగకముందే మళ్లీ కాంగ్రెస్ పార్టీలో చేరారు. పీసీసీ చీఫ్ రేవంత్ ప్రోద్భలంతోనే కుంభం సొంతగూటికి వచ్చారు. అయితే ఇదే సెగ్మెంట్ నుంచి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి జిట్టా బాలకృష్ణారెడ్డికి టికెట్ ఇప్పించాలని గట్టి పట్టుదలతో ఉన్నారు. ఇక్కడ రేవంత్ సర్వేల ఆధారంగా టికెట్ కుంభం అనిల్ కు ఇప్పించుకొనే చాన్స్ ఉందని కోమటిరెడ్డి అనుమానిస్తున్నారు. రేవంత్ రెడ్డి రాష్ట్రవ్యాప్తంగా తన మార్కు చూపిస్తున్నారు. చివరకు సీనియర్ లీడర్ల అడ్డాల్లోకి కూడా వెళ్లిపోయి తన మనుషులను రంగంలోకి దించుతున్నారు. దీంతో సీనియర్లు వర్సెస్ రేవంత్ అన్నట్టుగా పంచాయితీ నెలకొన్నది.
రేవంత్ పర్యవేక్షణలోనే సునీల్ కనుగోలు?
సునీల్ కనుగోలును అధిష్ఠానం ఏరి కొని తెలంగాణకు వ్యూహకర్తగా నియమించింది. గతంలో కర్ణాటకలోనూ సునీల్ కనుగోలు సక్సెస్ ఫుల్ గా పనిచేశారు. అక్కడ బీజేపీ సర్కారుపై 30శాతం సర్కారు అంటూ గట్టిగా ప్రచారం చేసి సఫలీకృతమయ్యారు. దీంతో సునీల్ కనుగోలును కాంగ్రెస్ హైకమాండ్ గట్టిగా నమ్ముతోంది. టికెట్ల విషయంలో కనుగోలు టీమ్ చెప్పిందే ఫైనల్ అని కాంగ్రెస్ భావిస్తోంది. అయితే ఇక్కడే రేవంత్ రెడ్డి తన మార్కు రాజకీయం చూపిస్తున్నారు. సునీల్ కనుగోలు పూర్తిగా రేవంత్ రెడ్డి సమక్షంలో ఆయన ఆధ్వర్యంలోనే పని చేస్తున్నారన్నది కాంగ్రెస్ సీనియర్ల లీడర్ల ఆరోపణ. కాంగ్రెస్ పార్టీ లిస్ట్ వస్తే మాత్రం రాష్ట్రంలో తీవ్ర అలజడి రేగే ప్రమాదం ఉందని వార్తలు వస్తున్నాయి. ముఖ్యంగా సీనియర్ లీడర్ల అనుచరులకు టికెట్లు దక్కకపోతే వారంతా తీవ్ర స్థాయిలో ప్రతిఘటించే ప్రమాదం ఉంది.
బీసీ కోటాపై సర్వే రిపోర్టుల ఎఫెక్ట్
వచ్చే ఎన్నికల్లో బీసీలకు గణనీయంగా టికెట్లు ఇస్తామని కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచీ చెబుతోంది. ప్రతి పార్లమెంటు నియోజకవర్గపరిధిలో రెండు టికెట్లను బీసీ వర్గాలకు ఇస్తామని కాంగ్రెస్ చెప్పింది. అయితే సర్వే రిపోర్టుల ఆధారంగా చూస్తే ఆ పరిస్థితి కనిపించడం లేదు. చాలా మంది సీనియర్ లీడర్లకు సైతం వచ్చే ఎన్నికల్లో టికెట్ దక్కే అవకాశం కనిపించడం లేదు. జనగామ నియోజకవర్గాన్ని పొన్నాల లక్ష్మయ్య ఆశిస్తున్నారు. కానీ అక్కడ సర్వేల పేరుతో కొమ్మూరి ప్రతాప్ రెడ్డి అక్కడ టికెట్ వచ్చే చాన్స్ ఉందని ప్రచారం సాగుతోంది. పొన్నాల లాంటి సీనియర్ల పరిస్థితే ఇలా ఉంటే.. అనేక నియోజకవర్గాల్లో ఈ ప్రభావం ఉండనున్నది. మొత్తంగా రేవంత్ రెడ్డి సర్వే రిపోర్టుల ఆధారంగా తన వర్గాన్ని పెంచి పోషించుకుంటున్నారన్న అనుమానాలు బలపడుతున్నాయి. మరి కాంగ్రెస్ పార్టీలో ఈ వ్యవహారం ఎక్కడికి దారి తీస్తుందో వేచి చూడాలి.