HomeతెలంగాణRevanth Reddy 'Hasta' Laaghavam రేవంత్ రెడ్డి 'హస్త' లాఘవం

Revanth Reddy ‘Hasta’ Laaghavam రేవంత్ రెడ్డి ‘హస్త’ లాఘవం

– టికెట్లపై పీసీసీ చీఫ్​ మార్క్​
– సర్వే రిపోర్ట్​ పేరిట బిగ్​ స్కెచ్​
– రేవంత్​ టికెట్లు అమ్ముకుంటున్నారంటూ
సొంతపార్టీ నేతల ఆరోపణ
– తన వర్గాన్ని పెంచి పోషించుకొనేందుకు రేవంత్​ ప్లాన్​?
– సీనియర్లకు ఎక్కడికక్కడ చెక్​?
– కాంగ్రెస్​ లిస్ట్​పై ఫుల్​ సస్పెన్స్​
– 30 స్థానాల్లో తీవ్ర పోటీ?
– సునీల్​ కనుగోలు సర్వేలే ఆధారం
– సర్వేల మాటున పట్టు బిగిస్తున్న రేవంత్​
– సీనియర్లలో మొదలైన టెన్షన్​
– టికెట్ల కేటాయింపులో స్పష్టంగా రేవంత్​ ముద్ర
– పీసీసీ చీఫ్​ పై మొదలైన అసంతృప్తి

ఇదేనిజం, తెలంగాణ బ్యూరో: ‘సర్వేలే ఫైనల్​ .. సర్వేలో ఎవరికి బలముంటే వారికే టికెట్​. ఎంత పెద్ద లీడర్​ అయినా సర్వే ఆధారంగానే టికెట్​ కేటాయిస్తాం.’ ఇటీవల కాంగ్రెస్​ పార్టీ టికెట్ల విషయంలో పీసీసీ చీఫ్​ రేవంత్​ రెడ్డి తరుచూ చెబుతున్న మాట. కానీ ఈ సర్వేల వెనుక ఏదైనా మతలబు ఉందా? అని కాంగ్రెస్ పార్టీలోని కొందరు ముఖ్య నేతలు అనుమాన పడుతున్నారు. ఎందుకంటే ప్రస్తుతం తెలంగాణ కాంగ్రెస్​ టికెట్లకు సంబంధించి సునీల్​ కనుగోలు సర్వే రిపోర్టే ఫైనల్​. ఆ రిపోర్ట్​ ఆధారంగా కాంగ్రెస్​ హైకమాండ్​ టికెట్లు కేటాయిస్తోంది. అయితే సునీల్​ కనుగోలు సర్వేపై సొంతపార్టీలోనే అనేక అనుమానాలు వినిపిస్తున్నాయి. రేవంత్​ రెడ్డి సర్వేల మాటున తన సొంత వర్గాన్ని బలంగా పోషించుకుంటున్నారని పలువురు సీనియర్లు లోలోపల మథనపడుతున్నట్టు తెలుస్తోంది. సునీల్​ కనుగోలు రేవంత్​ చెప్పినట్టుగా నడుచుకుంటున్నారన్నది వారి ఆరోపణ. కాంగ్రెస్​ పార్టీలోని సీనియర్​ నేతలు మల్లు భట్టి విక్రమార్క, ఉత్తమ్​ కుమార్​ రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్​ రెడ్డి సైతం తమ అనుచరులకు టికెట్లు ఇప్పించుకోలేని పరిస్థితి నెలకొన్నది. రేవంత్​ రెడ్డి సర్వేలపేరుతో అక్కడ తమ అనుచరుగణాన్ని దించుతున్నారన్న విమర్శలు వస్తున్నాయి. కాంగ్రెస్​ పార్టీ ఫస్ట్​ లిస్ట్ ఇంకా బయటకు రాకముందే పీసీసీ చీఫ్​ రేవంత్​ రెడ్డిపై అనేక ఆరోపణలు వస్తున్నాయి. పీసీసీ చీఫ్​ రేవంత్​ రెడ్డి.. మహేశ్వరం టికెట్​ ను రూ. 10 కోట్లు, ఐదెకరాలు భూమి తీసుకొని అమ్ముకున్నారని.. ఆ సెగ్మెంట్ టికెట్​ ఆశించిన కొత్త మనోహర్ రెడ్డి ఆరోపించారు. సర్వే రిపోర్ట్​ అనుకూలంగా ఉండటంతో ఈ టికెట్ బడంగ్​పేట కార్పొరేషన్​ మేయర్​ చిగిరింత పారిజాతరెడ్డికి ఇవ్వబోతున్నట్టు జోరుగా ప్రచారం సాగుతోంది. ఇలా అనేక నియోజకవర్గాల్లోనూ ఇదే పరిస్థితి ఉంది.

సునీల్​ కనుగోలుపై సీనియర్ల గుస్సా
కాంగ్రెస్​ పార్టీ ఎన్నికల వ్యూహకర్త సునీల్​ కనుగోలు పీసీసీ చీఫ్​ రేవంత్​ రెడ్డికి అనుకూలంగా వ్యవహరిస్తారని జోరుగా ప్రచారం సాగుతోంది. సునీల్​ కనుగోలుపై మొదటి నుంచి కాంగ్రెస్ సీనియర్లు విమర్శలు గుప్పిస్తున్నారు. తన మీద సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం సాగుతోందని కాంగ్రెస్ ఎంపీ, సీనియర్​ నేత ఉత్తమ్​ కుమార్​ ఆరోపించారు. గత నవంబర్​లో ఉత్తమ్​ కుమార్​ రెడ్డి ఆరోపించగా.. పోలీసులు ఎంక్వైరీ చేస్తే కాంగ్రెస్​ వార్​ రూమ్​ నుంచే ఉత్తమ్​ కుమార్​ రెడ్డిపై తప్పుడు ప్రచారం సాగుతోందని తేలింది. నిజానికి సునీల్​ కనుగోలు అండ్​ టీమ్​ కాంగ్రెస్​ పార్టీకి అనుకూలంగా పోస్టులు పెట్టాలి. రాష్ట్ర ప్రభుత్వం మీద వ్యతిరేకంగా ప్రచారం చేయాలి. ప్రభుత్వ తప్పులను ఎత్తిచూపాలి. కానీ కనుగోలు టీమ్​ మాత్రం ప్రభుత్వ వ్యతిరేక పోస్టులు పెడుతూనే.. రేవంత్​ రెడ్డికి అనుకూలంగా.. కాంగ్రెస్​ పార్టీలోని ఆయన వ్యతిరేకుల మీద పోస్టులు పెట్టినట్టు తేలింది. దీంతో అప్పట్లోనే సీనియర్​ లీడర్లు సునీల్​ కనుగోలుపై విమర్శలు గుప్పించారు. తాజాగా మరోసారి ఇదే తరహా ఆరోపణలు వినిపిస్తున్నాయి. సునీల్​ కనుగోలు రేవంత్ రెడ్డి చెప్పిన విధంగానే సర్వేలు తయారు చేస్తున్నారన్న ఆరోపణలు గుప్పుమంటున్నాయి. సీనియర్​ లీడర్ల అనుచరులకు టికెట్ల రాకుండా రేవంత్​ రెడ్డి అడ్డం పడుతున్నారని.. ఇందుకు సునీల్​ కనుగోలు సర్వే రిపోర్టలను అడ్డం పెట్టుకుంటున్నారన్న ఆరోపణలు ఉన్నాయి.

లిస్ట్​ వస్తే రణరంగమే..
కాంగ్రెస్ పార్టీ లిస్ట్​ విషయంలో ప్రస్తుతం సస్పెన్స్​ వాతావరణం నెలకొన్నది. హస్తం పార్టీకి సంబంధించి 60 నుంచి 70 నియోజకవర్గాల్లో పెద్దగా సమస్య లేదు. ఎందుకంటే అక్కడ సీనియర్​ లీడర్లు ప్రాతినిథ్యం వహిస్తున్నారు. కానీ 40 నుంచి 50 నియోజకవర్గాలు మాత్రం తీవ్ర సమస్యాత్మకంగా ఉన్నాయి. అక్కడ టికెట్​ ఆశిస్తున్న వారి సంఖ్య ఎక్కువగా ఉంది. మరోవైపు సీనియర్​ లీడర్ల అనుచరులు ఉన్న చోట కూడా సమస్య పెరిగే అవకాశం ఉంది. కొన్ని నియోజకవర్గాల్లో కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, ఉత్తమ్​ కుమార్​ రెడ్డి, మల్లు భట్టి విక్రమార్క అనుచరులకు టికెట్లు ఖాయమని హామీ ఇచ్చారు. కానీ అక్కడ సర్వేల పేరుతో రేవంత్​ రెడ్డి తన మనుషులకు టికెట్లు ఇప్పించుకొనేలా ప్లాన్​ చేస్తున్నారు. దీంతో ఆయా నియోజకవర్గాల్లో గందరగోళ పరిస్థితి నెలకొన్నది. కోమటిరెడ్డి వెంకట్​ రెడ్డి కి భువనగిరి అసెంబ్లీ సెగ్మెంట్​ మీద ఎంతో పట్టుంది. ఆ పార్లమెంటు నియోజకవర్గం నుంచి ఆయన ఎంపీగా కూడా ప్రాతినిథ్యం వహిస్తున్నారు. అయితే ఈ సెగ్మెంట్​ లో వెంకట్​ రెడ్డిని తీవ్రంగా విమర్శించి బీఆర్ఎస్​ పార్టీలో చేరిన కుంభం అనిల్​ కుమార్​ రెడ్డి నెల తిరగకముందే మళ్లీ కాంగ్రెస్​ పార్టీలో చేరారు. పీసీసీ చీఫ్​ రేవంత్​ ప్రోద్భలంతోనే కుంభం సొంతగూటికి వచ్చారు. అయితే ఇదే సెగ్మెంట్​ నుంచి కోమటిరెడ్డి వెంకట్​ రెడ్డి జిట్టా బాలకృష్ణారెడ్డికి టికెట్​ ఇప్పించాలని గట్టి పట్టుదలతో ఉన్నారు. ఇక్కడ రేవంత్​ సర్వేల ఆధారంగా టికెట్​ కుంభం అనిల్​ కు ఇప్పించుకొనే చాన్స్​ ఉందని కోమటిరెడ్డి అనుమానిస్తున్నారు. రేవంత్​ రెడ్డి రాష్ట్రవ్యాప్తంగా తన మార్కు చూపిస్తున్నారు. చివరకు సీనియర్ లీడర్ల అడ్డాల్లోకి కూడా వెళ్లిపోయి తన మనుషులను రంగంలోకి దించుతున్నారు. దీంతో సీనియర్లు వర్సెస్​ రేవంత్​ అన్నట్టుగా పంచాయితీ నెలకొన్నది.

రేవంత్​ పర్యవేక్షణలోనే సునీల్​ కనుగోలు?
సునీల్​ కనుగోలును అధిష్ఠానం ఏరి కొని తెలంగాణకు వ్యూహకర్తగా నియమించింది. గతంలో కర్ణాటకలోనూ సునీల్​ కనుగోలు సక్సెస్​ ఫుల్​ గా పనిచేశారు. అక్కడ బీజేపీ సర్కారుపై 30శాతం సర్కారు అంటూ గట్టిగా ప్రచారం చేసి సఫలీకృతమయ్యారు. దీంతో సునీల్​ కనుగోలును కాంగ్రెస్​ హైకమాండ్​ గట్టిగా నమ్ముతోంది. టికెట్ల విషయంలో కనుగోలు టీమ్​ చెప్పిందే ఫైనల్​ అని కాంగ్రెస్​ భావిస్తోంది. అయితే ఇక్కడే రేవంత్​ రెడ్డి తన మార్కు రాజకీయం చూపిస్తున్నారు. సునీల్​ కనుగోలు పూర్తిగా రేవంత్​ రెడ్డి సమక్షంలో ఆయన ఆధ్వర్యంలోనే పని చేస్తున్నారన్నది కాంగ్రెస్ సీనియర్ల లీడర్ల ఆరోపణ. కాంగ్రెస్ పార్టీ లిస్ట్​ వస్తే మాత్రం రాష్ట్రంలో తీవ్ర అలజడి రేగే ప్రమాదం ఉందని వార్తలు వస్తున్నాయి. ముఖ్యంగా సీనియర్ లీడర్ల అనుచరులకు టికెట్లు దక్కకపోతే వారంతా తీవ్ర స్థాయిలో ప్రతిఘటించే ప్రమాదం ఉంది.

బీసీ కోటాపై సర్వే రిపోర్టుల ఎఫెక్ట్​
వచ్చే ఎన్నికల్లో బీసీలకు గణనీయంగా టికెట్లు ఇస్తామని కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచీ చెబుతోంది. ప్రతి పార్లమెంటు నియోజకవర్గపరిధిలో రెండు టికెట్లను బీసీ వర్గాలకు ఇస్తామని కాంగ్రెస్ చెప్పింది. అయితే సర్వే రిపోర్టుల ఆధారంగా చూస్తే ఆ పరిస్థితి కనిపించడం లేదు. చాలా మంది సీనియర్​ లీడర్లకు సైతం వచ్చే ఎన్నికల్లో టికెట్​ దక్కే అవకాశం కనిపించడం లేదు. జనగామ నియోజకవర్గాన్ని పొన్నాల లక్ష్మయ్య ఆశిస్తున్నారు. కానీ అక్కడ సర్వేల పేరుతో కొమ్మూరి ప్రతాప్​ రెడ్డి అక్కడ టికెట్​ వచ్చే చాన్స్ ఉందని ప్రచారం సాగుతోంది. పొన్నాల లాంటి సీనియర్ల పరిస్థితే ఇలా ఉంటే.. అనేక నియోజకవర్గాల్లో ఈ ప్రభావం ఉండనున్నది. మొత్తంగా రేవంత్​ రెడ్డి సర్వే రిపోర్టుల ఆధారంగా తన వర్గాన్ని పెంచి పోషించుకుంటున్నారన్న అనుమానాలు బలపడుతున్నాయి. మరి కాంగ్రెస్​ పార్టీలో ఈ వ్యవహారం ఎక్కడికి దారి తీస్తుందో వేచి చూడాలి.

Recent

- Advertisment -spot_img