– క్యాంప్ ఆఫీస్ కోసం పైగా ప్యాలెస్ !
–ఆరో నిజాం మీర్ మహబూబ్ అలీఖాన్ కాలంలో నిర్మించిన పైగా ప్యాలెస్..
– ప్రగతి భవన్ ను డిప్యూటీ సీఎంకు కేటాయింపు
– ఇప్పుడు అంతకంటే పెద్ద భవనంలో ఉంటారా?
– క్యాంపు ఆఫీసు విషయంలో అనేక విమర్శలు
ఇదేనిజం, తెలంగాణ బ్యూరో: ‘ప్రగతి భవన్ ఓ గడీ.. అక్కడికి ఎవరికీ ప్రవేశం ఉండదు. మేం వస్తే ప్రగతి భవన్ ను నాలెడ్జ్ సెంటర్ చేస్తాం. ముఖ్యమంత్రి కూడా సాధారణ జనానికి అందుబాటులో ఉండేలా ప్లాన్ చేస్తాం.’ అంటూ గతంలో బీఆర్ఎస్ హయాంలో రేవంత్ అనేక పర్యాయాలు ఆరోపించారు. ఇక తాను ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే ప్రగతి భవన్ ముందున్న కంచెలు తొలించారు. జనం కూడా చప్పట్లు కొట్టారు. అయితే ఇప్పుడు రేవంత్ రెడ్డి తన కోసం మరో క్యాంప్ ఆఫీస్ ఏర్పాటు చేసుకొనే ప్రయత్నంలో ఉన్నారు. సహజంగా ముఖ్యమంత్రిని సాధారణ ప్రజలే కాకుండా.. విదేశీ ప్రతినిధులు కలుస్తుంటారు. అత్యవసరంగా అధికారులతో సమీక్షా సమావేశాలు నిర్వహించాల్సి ఉంటుంది. అవసరమైతే కేబినెట్ సమావేశాలు కూడా నిర్వహించాల్సి వస్తుంది. అందుకనుగుణంగానే అప్పటి సీఎం కేసీఆర్.. అన్ని హంగులతో ప్రగతి భవన్ ను నిర్మించారు. అయితే తాను అధికారంలో ఉన్నప్పుడు ప్రగతి భవన్ ను రేవంత్ నిందించాడు కనక.. ఇప్పుడు అందులో ఉండటం లేదు. ఇక డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మాత్రం ప్రగతి భవన్ లో ఉంటున్నారు.
మీర్ మహబూబ్ అలీఖాన్ కాలంలో నిర్మించిన ప్యాలెస్
తాజాగా రేవంత్ రెడ్డి అధికారిక నివాసం కోసం అధికారులు హైదరాబాద్ లోని ఆరవ నిజాం మీర్ మహబూబ్ అలీఖాన్ కాలంలో నిర్మించిన పైగా ప్యాలెస్ ను పరిశీలించినట్టు వార్తలు వచ్చాయి. ఈ భవనంలో అన్ని హంగులు ఉన్నాయని.. సీఎం అనుకూల పత్రికలో కథనం వచ్చింది. దీంతో ఈ భవనం కేటాయిస్తారేమోనని ఊహాగానాలు జోరుగా వినిపిస్తున్నాయి. ఈ భవనాన్ని మీర్ మహబుబ్ అలీఖాన్ కాలంలో ప్రధానమంత్రిగా పనిచేసిన నవాబ్ వికారుల్ ఉమ్రా 1900లో ఈ ప్యాలెస్‌ను నిర్మించాడు.
గడీని వదిలి ప్యాలెస్‌కు వెళ్తారా?
ముఖ్యమంత్రి ప్రజలకు అందుబాటులో ఉండరు. ఆయన ఉంటున్న ప్రగతి భవన్ లో 105 బెడ్రూంలు ఉన్నాయి. బంగారు తాపడాలు ఉన్న కుర్చీలు ఉన్నాయి. మొత్తం ప్రతి గదికి బుల్లెట్ ప్రూఫ్ పెట్టించారు. అదో ప్యాలెస్. వెండి కూర్చీలు ఉన్నాయి. అంటూ ఇలా రేవంత్ రెడ్డి గతంలో రకరకాల ఆరోపణలు చేశారు. అయితే ప్రస్తుతం ప్రగతి భవన్ డిప్యూటీ సీఎం భట్టి నివాసంగా మారింది. రేవంత్ వర్ణించినట్టుగా అక్కడేమి లేవని తేట తెల్లమైంది. అయితే కేసీఆర్ ను బదనాం చేయడంలో కాంగ్రెస్ సక్సెస్ అయ్యి ఓట్లు రాబట్టుకున్నది. ఇప్పుడు రేవంత్ ఏకంగా నిజాం నాలుగు ఎకరాల రాజభవనాన్నే తన క్యాంపు ఆఫీస్ గా మార్చుకుంటే ప్రజల స్పందన కూడా ఏ లెవెల్లో ఉంటుందో వేచి చూడాల్సిందే.
అందుకే ఇప్పుడు ఆయన ప్రగతి భవన్ లోకి వెళ్లడం లేదన్న విమర్శలు వస్తున్నాయి. ఇక రేవంత్ ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ప్రజాభవన్ విషయంలో రకరకాల విమర్శలు వస్తున్నాయి. అయితే ప్రస్తుతం మంత్రి ఓ భవనంలో ఉంటున్నారు. ఎంసీఆర్ హెచ్ ఆర్డీలో సీఎం రేవంత్ రెడ్డి క్యాంప్ ఆఫీసు కోసం తాను తాత్కాలిక భవనం నిర్మించబోతున్నట్టు కూడా వార్తలు వచ్చాయి. చివరకు అది కూడా వర్కవుట్ కాలేదు. ఎంసీఆర్ హెచ్ఆర్డీ లో క్యాంప్ ఏర్పాటు చేస్తామంటే అక్కడి స్థానికులు ఒప్పుకోవడం లేదు. నిజానికి గడీ అంటే ఓ చిన్నపాటి భూ స్వామి ఇల్లు మాత్రమే. అయితే రాజప్రాసాదం అంటే చాలా పెద్దదని అర్థం. గతంలో కాంగ్రెస్ లీడర్లు గడీల పాలన అని విమర్శించారు. మరి ఇప్పుడు అంతకంటే ఎక్కువ ట్రోల్స్ కు గురయ్యే అవకాశం ఉంది. ఇక ముఖ్యమంత్రి రేవంత్ ప్రమాణ స్వీకారం చేయించాక క్యాంప్ ఆఫీసు విషయంలో అనేక చిక్కుముడులు ఎదురవుతున్నాయి. తొలుత ఎంసీఆర్ హెచ్ ఆర్డీలో రేవంత్ రెడ్డి క్యాంప్ ఆఫీసు తాత్కాలికంగా నిర్మాణాలు సాగిస్తామని చెప్పారు. కానీ ఏం జరిగిందే తెలియదు కానీ ఆ దిశగా అడుగులు పడటం లేదు. ఇప్పుడు మరోసారి సీఎం క్యాంప్ ఆఫీస్ అంశం తెరమీదకు వచ్చింది.