- కేంద్ర ప్రభుత్వంతో లెక్కకు మించి సఖ్యత
- నిత్యం కేంద్రమంత్రులతో సంప్రదింపులు
- రేవంత్ అభ్యర్థనలు.. కేంద్రం ఆమోదాలు
- బీజేపీ పాలిత ముఖ్యమంత్రిలా వ్యవహరిస్తున్న సీఎం
- ఓ కన్నేసిన కాంగ్రెస్ హైకమాండ్
- తాజాగా రేవంత్ ఇంటికి గోయల్
- ముఖ్యమంత్రి అడిగిందే తడువుగా రక్షణ శాఖ భూములకు మోక్షం
- స్మార్ట్ సిటీల గడువు పొడిగింపు
- కాంగ్రెస్ కార్యకర్తల్లోనూ అనేక అనుమానాలు
ఇదేనిజం, తెలంగాణ బ్యూరో: సహజంగా కాంగ్రెస్ పాలిత ముఖ్యమంత్రులకు కేంద్రంలో అధికారంలో ఉన్న ఎన్డీయే కూటమికి పెద్దగా సఖ్యత ఉండదు. ప్రాంతీయ పార్టీలు అధికారంలో ఉంటేనే ఆయా రాష్ట్రాలను కేంద్రంలో మిత్రపక్షాలతో కలిసి అధికారంలో ఉన్న బీజేపీ టార్గెట్ చేస్తూ ఉంటుంది. అయితే చాలా విచిత్రంగా తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. ఇక్కడి ప్రభుత్వంతోనూ కేంద్రం ఘర్షణ వాతావరణంలో ఉండాలి. అయితే అందుకు విరుద్ధంగా తెలంగాణ ప్రభుత్వంతో కేంద్రం సఖ్యతగా ఉంది. దానికితోడు ఇక్కడి ముఖ్యమంత్రితో మరింత అనుకూలంగా ఉంది. ఆయన చేసిన ప్రతిపాదనలు అన్నీ ఓకే అయిపోతున్నాయి. ఇటీవల రేవంత్ అడిగిందే తడువుగా స్మార్ట్ సిటీల గడువు పెంచారు. కంటోన్మెంట్ భూములు అప్పగించేశారు. తాజాగా కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ రేవంత్ తో సమావేశమయ్యారు. మొత్తంగా ఈ వ్యవహారం అనుమానాలకు తావిస్తోంది. కాంగ్రెస్ అధిష్ఠానం కూడా ఈ అంశాన్ని నిశితంగా పరిశీలిస్తోంది.
ఏం జరుగుతోంది?
కేంద్ర ప్రభుత్వంతో సఖ్యతగా ఉండి నిధులు తెచ్చుకోవడం తప్పేముంది? అన్నది రేవంత్ వర్గీయుల ప్రశ్న. రేవంత్ అనుకూల మీడియాలోనూ దీన్ని హైలైట్ చేస్తూ కథనాలు వండివారుస్తున్నారు. కానీ సగటు కాంగ్రెస్ కార్యకర్తలకు ఈ విషయం మీద అనేక డౌట్స్ ఉన్నాయి. ఏదో ఒకరోజు రేవంత్ రెడ్డి ఏక్ నాథ్ షిండేలా మారి.. తన వర్గం ఎమ్మెల్యేలతో కలిసి బీజేపీతో కలిసి పోతారు అని గతంలో ఊహాగానాలు వినిపించాయి. ఇప్పుడు అది నిజమేనన్నట్టు పరిణామాలు జరుగుతున్నాయి. ఈ వ్యవహారాల మీద అధిష్ఠానం కాస్త సీరియస్ గానే దృష్టి పెట్టినట్టు కనిపిస్తోంది. అందుకే రేవంత్ కేంద్ర మంత్రులను కలిసిన ప్రతి సారి .. ఆయన మంత్రి వర్గ సహచరులు సీఎంతోపాటూ ఉంటున్నారు.
రాహుల్ చూస్తున్నారా?
ఓ వైపు అన్ని రాష్ట్రాల్లో బీజేపీతో కాంగ్రెస్ ఘర్షణ పడుతోంది. కాంగ్రెస్ పార్టీ మిత్రపక్షమైన డీఎంకే, తృణముల్ కాంగ్రెస్, ఆప్ అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో సైతం కేంద్రం ఆయా రాష్ట్రాలను ఇబ్బంది పెడుతున్నది. ఇక ఏకంగా ఢిల్లీలో కర్రపెత్తనం చెలాయిస్తోంది. కానీ అటువంటి బీజేపీ తెలంగాణ రాష్ట్రంలో రేవంత్ రెడ్డితో సఖ్యతగా ఉండటంపై అనేక అనుమానాలు వస్తున్నాయి. మరి ఈ పరిణామాలు ఎక్కడికి దారితీస్తాయి? బీజేపీ వ్యూహమేంటి? రేవంత్ రెడ్డి ఆలోచన ఏంటి? అన్నది తెలియాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే. ఇక ఈ వ్యవహారాలపై కాంగ్రెస్ హైకమాండ్ ఎటువంటి చర్యలు తీసుకోబోతున్నది అన్నది కూడా వేచి చూడాలి.