Homeహైదరాబాద్latest Newsరేవంత్.. నువ్వో చీప్ మినిస్టర్.. మాజీ మంత్రి హరీశ్ రావు సంచలన ట్వీట్..!

రేవంత్.. నువ్వో చీప్ మినిస్టర్.. మాజీ మంత్రి హరీశ్ రావు సంచలన ట్వీట్..!

  • నాకు మంత్రి పదవి ఎవరి భిక్షవల్లో రాలేదు
  • సోనియా కోరికమేరకు కాంగ్రెస్ పార్టీలో చేరా
  • నాకు మంత్రి పదవి వచ్చినప్పుడు నువ్వు బీఆర్ఎస్ లోనే ఉన్నావు
  • నేను మీడియాతో మాట్లాడుతుంటే నక్కి నక్కి చూస్తున్నావు
  • మాజీ మంత్రి హరీశ్ రావు ట్వీట్

ఇదేనిజం, తెలంగాణ బ్యూరో: రాష్ట్ర అసెంబ్లీలో కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య డైలాగ్ వార్ తీవ్రస్థాయిలో సాగుతోంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేటీఆర్, హరీశ్ రావును వ్యక్తిగతంగా టార్గెట్ చేస్తున్నారు. తద్వారా ప్రజా సమస్యల మీద చర్చ జరగకుండా రేవంత్ సభను డైవర్ట్ చేస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇదిలా ఉంటే గురువారం అసెంబ్లీలో రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. కాంగ్రెస్ దయాదాక్షణ్యం వల్లే అప్పట్లో హరీశ్ రావుకు మంత్రి పదవి వచ్చిందంటూ వ్యాఖ్యానించారు. దీనికి హరీశ్ రావు ట్విట్టర్ వేదికగా స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. 20 ఏళ్ల క్రితం నాటి ఓ పాత వీడియోను పోస్ట్ చేశారు. అందులో ఢిల్లీలో హరీశ్ రావు మీడియాతో మాట్లాడినట్లుగా ఉంది. పైగా హరీశ్ రావు మీడియాతో మాట్లాడుతుంటే.. వెనుక రేవంత్ రెడ్డి తొంగి తొంగి చూస్తున్నారు. ఈ వీడియోతో హరీశ్ రావు ఘాటు కౌంటర్ ఇచ్చారు. ‘రేవంత్ రెడ్డి.. నాకు మంత్రి పదవి ఎవరి భిక్ష వల్లనో రాలేదు. సోనియా గాంధీ కోరిక మేరకు ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వంలో చేరాం తప్ప పదవుల కోసం కాదు. నాకు మంత్రి పదవి వచ్చినపుడు టీ ఆర్ఎస్‌నే ఉన్నావ్.. ఆ ఊరేగింపులోనూ ఉన్నావు. తెలంగాణకు జరుగుతున్న అన్యాయాన్ని ప్రశ్నిస్తూ మంత్రి పదవికి రాజీనామా చేసినప్పుడు కూడా నా వెనకే ఉన్నావ్, నిక్కి నిక్కి చూశావ్. ఇదంతా నీ కళ్ల ముందు జరిగిందే. కానీ ఇవేమి తెలియనట్లు చిల్లర వ్యాఖ్యలు చేస్తున్నావు. పదవులు, విలువల గురించి మాట్లాడే హక్కు నీకెక్కడిది రేవంత్ రెడ్డి. తెలంగాణ ఉద్యమంలో పదవులను గడ్డి పోచలుగా త్యజించిన చరిత్ర మాది.’ అంటూ హరీశ్ రావు మండిపడ్డారు. తాము పదవుల కోసం పూటకో పార్టీ మారలేదని హరీశ్ రావు పేర్కొన్నారు.

Recent

- Advertisment -spot_img