Homeహైదరాబాద్latest Newsఎంపీలుగా పోటీ చేయబోతున్న రేవంత్​ సోదరులు

ఎంపీలుగా పోటీ చేయబోతున్న రేవంత్​ సోదరులు

ఆ రెండు నియోజకవర్గాలపై కన్ను

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సోదరులు రాజకీయాల్లో యాక్టివ్ అయ్యేందుకు జోరుగా ప్రయత్నాలు చేస్తున్నారు. రేవంత్ రెడ్డి సోదరులు తిరుపతి రెడ్డి, కొండల్ రెడ్డి ఇప్పటికే తెరవెనక తమదైన శైలిలో జోరుగా పాలిటిక్స్ నడుపుతున్నారు . చాలా మంది కాంగ్రెస్ లీడర్లు వారిని ప్రసన్నం చేసుకొనేందుకు ప్రయత్నాలు కూడా చేస్తున్నారు. ఇక వ్యాపారవేత్తలు, పారిశ్రామిక వేత్తలు సైతం వారి ఆశిస్సుల కోసం పాకులాడుతున్నారు. ఇంతకాలం తెరవెనక చక్రం తిప్పిన రేవంత్ బ్రదర్స్ ఇప్పుడు నేరుగా రాజకీయాల్లోకి వచ్చేందుకు రెడీ అయిపోయారు. రేవంత్ అన్న తిరుపతి రెడ్డి పాలమూరు ఎంపీ సీటు మీద కన్నేశాడు. టికెట్ కోసం అప్లై చేసుకున్నారు కూడా.. అంతేకాక అక్కడి లోకల్ లీడర్లతో నిత్యం టచ్ లో ఉంటున్నారట. ఇక పాలమూరు పార్లమెంట్ సెగ్మెంట్ వ్యాప్తంగా తిరుపతి రెడ్డి పోస్టర్లే దర్శనమిస్తున్నాయి. ఈ టికెట్ ను మరో కాంగ్రెస్ నేత వంశీచంద్ రెడ్డి కూడా ఆశిస్తున్నారు. అయితే రేవంత్ పలుకుబడి ఉపయోగిస్తే కచ్చితంగా తిరుపతిరెడ్డికి ఈ టికెట్ వచ్చే చాన్స్ ఉంది. ఉమ్మడి పాలమూరు రేవంత్ సొంత జిల్లా కనక.. తన సోదరుడే అక్కడ ఉంటే ఆయన పట్టు కోల్పోకుండా ఉండొచ్చని రేవంత్ భావిస్తున్నారేమో. ఇక ఈ టికెట్ ను ఆశిస్తున్న వంశీచంద్ ను ఎలా బుజ్జగిస్తారో వేచి చూడాలి. రేవంత్ సొంత నియోజకవర్గం ఈ పార్లమెంటు పరిధిలోకే వస్తుంది.. దాంతో పాటు ఈ పార్లమెంటు పరిధిలోని ఎమ్మెల్యేలు మొత్తం కాంగ్రెస్ వారే ఉన్నారు కనక.. ఈ సీటు గెలుచుకోవడం పెద్ద కష్టమేమీ కాదు. ఆ లెక్కలు వేసుకొనే తిరుపతి రెడ్డి రంగంలోకి దిగినట్టు తెలుస్తోంది.

ఇక రేవంత్ రెడ్డి చిన్న తమ్ముడు కొండల్ రెడ్డి కూడా ఎంపీ సీటు మీద కన్నేశారు. మల్కాజిగిరి పార్లమెంటు సీటు కోసం ఆయన దరఖాస్తు చేసుకున్నారు. ఇక కొండల్ రెడ్డి ఇప్పటికే రాజకీయాల్లో ఫుల్ యాక్టివ్ అయిపోయారు. మీడియా కంటపడకుండా చక్రం తిప్పుతున్నారు. కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన లీడర్లంతా నిత్యం కొండల్ రెడ్డితో టచ్ లో ఉంటున్నారు. కొండలన్నకు చెప్తే ఏ పని అయినా చిటికెలో జరిగిపోతుందని కాంగ్రెస్ వర్గాల్లో టాక్. ఇక ఇంతకాలం తెరవెనక ఉండి రాజకీయం నడిపిన కొండల్ రెడ్డి డైరెక్ట్ గా పాలిటిక్స్ లోకి రావాలని చూస్తున్నారు. మరి రేవంత్ ఇద్దరు సోదరులకు టికెట్లు ఇప్పించుకుంటారా? లేక ఒక్కరికే ఇప్పించుకుంటారా? మొత్తానికే వద్దనుకుంటారా? అన్నది వేచి చూడాలి. మల్కాజిగిరి రేవంత్ రెడ్డి సిట్టింగ్ సీటు కావడం గమనార్హం. దీనికి తోడు ఇక్కడ సెటిలర్ల ఓట్లు ఎక్కువ కనక రేవంత్ రెడ్డి సోదరుడే రంగంలోకి దిగితే రేవంత్ కు నిత్యం అండగా ఉంటే ఓ ఆంధ్రా సామాజికవర్గం ఓట్లు గుంపగుత్తగా పడే చాన్స్ ఉంది. అందుకే ఈ సీటు మీద కొండల్ దృష్టి సారించినట్టు తెలుస్తోంది.

ముఖ్యమంత్రి కేసీఆర్ మీద ప్రధానంగా వచ్చిన ఆరోపణ ఆయన కుటుంబసభ్యులంతా రాజకీయాల్లో ఉన్నారన్నదే . కొడుకు, కూతురు, మేనల్లుడు, తోడల్లుడి కొడుకు ఇలా అందిరకీ పదవులు ఇచ్చారని ఆయన మీద ప్రత్యర్థులు ఆరోపణలు చేసేవారు. ముఖ్యంగా రేవంత్ రెడ్డి విపక్షంలో ఉన్నప్పుడు కేసీఆర్ కుటుంబాన్నే టార్గెట్ చేశారు. ఆయన మనవడిని కూడా వదలకుండా విమర్శలు చేశారు. నిత్యం ఆయన కుటుంబం మీద వ్యక్తిగత ఆరోపణలు చేసేవారు. ఈ రాష్ట్రంలో నిరుద్యోగులకు ఎవరికీ ఉద్యోగాలు రాలేదు కానీ.. కేసీఆర్ ఫ్యామిలీలో అందరికీ ఉద్యోగాలు వచ్చాయని ఆరోపించేవారు. వారంతా ఉద్యమంలో పనిచేశారని బీఆర్ఎస్ పార్టీ ఎంత సర్దిచెప్పుకున్నా ఈ ఆరోపణలు ఆగలేదు. అయితే ఇన్ని ఆరోపణలు గుప్పించిన రేవంత్ ఇప్పుడు తన సోదరులను పాలిటిక్స్ లోకి తీసుకొస్తాడా? అన్నది వేచి చూడాలి. అంతేకాక కాంగ్రెస్ పార్టీలో కుటుంబ రాజకీయాలు కొత్త కాదు. అటు గాంధీ ఫ్యామిలీ నుంచి.. రాష్ట్ర నేతల దాకా అందరూ ఈ తరహా రాజకీయాలు చేస్తున్నవారే.. ఇక కోమటిరెడ్డి బ్రదర్స్ ఇద్దరూ పాలిటిక్స్ లో ఉన్నారు. ఉత్తమ్ దంపతులు ఉన్నారు. జానారెడ్డి తన కుమారుడిని ఎమ్మెల్యేగా గెలిపించుకున్నారు. మరో కొడుకుకు ఎంపీ సీటు ఇప్పించుకొనేందుకు విశ్వప్రయత్నం చేస్తున్నారు. ఇక డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అయితే తన సతీమణిని ఎంపీగా పోటీచేయించేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టారు. కాబట్టి రేవంత్ కూడా తన సోదరులకు టికెట్ ఇప్పించుకుంటారా? తాను కూడా ఫ్యామిలీ పాలిటిక్స్ కి తెరతీయనున్నారా అన్నది ఇంకొన్ని రోజుల్లో తేలనుంది.

RELATED ARTICLES

Recent

- Advertisment -spot_img