Homeహైదరాబాద్latest Newsలండన్​లో రేవంత్ కామెంట్లు.. వెనకుండి నడిపించింది వారే..!

లండన్​లో రేవంత్ కామెంట్లు.. వెనకుండి నడిపించింది వారే..!

ఇదేనిజం, తెలంగాణ బ్యూరో: లండన్ లోని ప్రవాసాంధ్రుల సభలో సీఎం రేవంత్ చేసిన కామెంట్లు ఓ రేంజ్ లో వైరల్ అయ్యాయి. నిజానికి ఈ సభలో రేవంత్ అకారణంగా, అసందర్భంగా కేసీఆర్ ను ఆడిపోసుకున్నారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కు ఏ మాత్రం సంబంధం లేని అంశం మీద ఆయనను తిట్టిపోశారు. గతంలో కొన్ని పార్లమెంటు నియోజకవర్గాల సన్నాహక సమావేశాల్లో బీఆర్ఎస్ కార్యకర్తల్లో ధైర్యం నింపేందుకు కేటీఆర్ మాట్లాడుతూ.. త్వరలో పులి ఎంట్రీ ఇవ్వబోతున్నదని.. కేసీఆర్ ను ఉద్దేశించి మాట్లాడారు. అయితే ఈ కామెంట్లు ఎప్పుడో చేస్తే .. రేవంత్ రెడ్డి మాత్రం తాజాగా కేసీఆర్ ను టార్గెట్ చేసి తిట్టారు. ఇదిలా ఉంటే రేవంత్ లండన్ లో చేసిన కామెంట్లను సొంత పార్టీ కార్యకర్తలే జీర్ణించుకోలేపోతున్నట్టు తెలుస్తుంది. సహజంగా ఏ ముఖ్యమంత్రి అయినా ప్రధాని అయినా విదేశాల్లో పర్యటించినప్పుడు దేశ సంస్కృతి గురించో.. ఆయా రాష్ట్రాల ముఖ్యమంత్రులైతే వారి రాష్ట్రం గురించి గొప్పగా మాట్లాడుతుంటారు. కానీ రేవంత్ మాత్రం అందుకు విరుద్ధంగా ఓ రాజకీయ ఆరోపణ చేసి హెడ్ లైన్స్ లో నిలిచారు.

ఆర్గనైజర్లు ఎవరు?
ఇక లండన్ లో జరిగిన ఈ సభ నిర్వాహకుల మీద కూడా అనేక విమర్శలు వస్తున్నాయి. ఈ సభ పక్కాగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, ఆ పార్టీ లండన్ వింగ్ ఏర్పాటు చేసినట్టు కనిపిస్తోంది. అంతేకాక లండన్ లో జరిగిన సభలో సీఎం రేవంత్ మాట్లాడుతుంటే ఈలలు వేసింది.. గోల చేసింది ఆంధ్రాకు సంబంధించిన ఓ సామాజికవర్గం వారేనా? అన్న అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. ఇక రేవంత్ రెడ్డి కూడా ఎక్కడా తెలంగాణ పదం ఉచ్ఛరించకుండా జాగ్రత్త పడ్డారు. ఎన్టీఆర్, చంద్రబాబు నాయుడును పొగిడారు. ఆయన చంద్రబాబు, ఎన్టీఆర్ ను పొగుడుతుంటే సభ మామూలుగా హోరెత్తలేదు. దీన్ని బట్టి అక్కడ ఉన్నది తెలుగుదేశం అభిమానులేనని స్పష్టమవుతున్నది. ఈ సభలో తెలుగు దేశం జెండాలు కనిపించాయి. చంద్రబాబు అనుకూల నినాదాలు హోరెత్తాయి. అసలు ఈ సభ ప్రవాసాంధ్రుల సభనా, టీడీపీ సభనా అన్నట్టుగా కనిపించింది. ఎక్కడా కాంగ్రెస్ అనుకూల, తెలంగాణ అనుకూల నినాదాలు వినిపించకపోవడం గమనించదగ్గ విషయం.


ట్రోలింగ్ డైవర్షన్ కోసమేనా?
రేవంత్ దావోస్ లో పర్యటించినప్పుడు ఆయన మాట్లాడిన ఇంగ్లీష్ పై ట్రోల్స్ ఓ రేంజ్ లో బయటకు వచ్చాయి. బహుశా గతంలో ఏ రాష్ట్రానికి సంబంధించిన ముఖ్యమంత్రికి ఇటువంటి ట్రోల్స్ ఎప్పుడూ ఎదురుకాలేదేమో. ఇక గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఐటీ మంత్రి కేటీఆర్ దావోస్ వ్యవహారం చూసుకొనేవారు. ఇప్పుడు ఐటీ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు సైతం దావోస్ లో పర్యటించినా ఆయన మౌన ముద్ర దాల్చారు. శ్రీధర్ బాబు మాట్లాడితే బాగుండేదని కూడా కొందరు కాంగ్రెస్ శ్రేయోభిలాషులు అన్నారు. ఇదిలా ఉంటే దావోస్ పర్యటన ద్వారా భారీగా పెట్టుబడులు తెచ్చుకున్నామని అనుకూల పత్రికల్లో బాజాలు కొట్టించుకున్న రేవంత్.. తన మీద వచ్చిన ట్రోలింగ్ మీద దృష్టి మళ్లించేందుకే లండన్ పర్యటనను వాడుకున్నారన్న విమర్శలు వస్తున్నాయి. ఏపీలో వచ్చే ఎన్నికల్లో టీడీపీకి మేలు చేయడం కూడా మరో వ్యూహం అంటున్నారు. ఏపీ సీఎం జగన్ కు.. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కు ఆప్తుడన్న విషయం తెలిసిందే. అయితే ఇక్కడ కేసీఆర్ ను టార్గెట్ చేయడం ద్వారా టీడీపీ అభిమానులను, అధినేతను, టీడీపీ అనుకూల పత్రికను రేవంత్ మెప్పించగలిగారు. ఏది ఏమైనా రేవంత్ అసందర్భ వ్యాఖ్యానంపై రకరకాల విమర్శలు వినిపిస్తున్నాయి.

Recent

- Advertisment -spot_img