HomeజాతీయంRGI Report : దేశంలో ఎక్కువ‌ మరణాలకు ఈ మూడే కారణం

RGI Report : దేశంలో ఎక్కువ‌ మరణాలకు ఈ మూడే కారణం

RGI Report : దేశంలో ఎక్కువ‌ మరణాలకు ఈ మూడే కారణం

RGI Report : దేశంలో సంభవిస్తున్న మరణాలకు ప్రధానంగా మూడు కారణాలు ఉన్నాయని, అవి హృద్రోగ సమస్యలు, న్యూమోనియా, ఆస్తమా అని రిజిస్ట్రార్ జనరల్ ఆఫ్ ఇండియా (ఆర్‌జీఐ) ఓ నివేదికలో వెల్లడించింది.

2020లో దేశంలో సంభవించిన మరణాల్లో 42 శాతం ఈ మూడింటి వల్లే సంభవించినట్టు తెలిపింది.

అలాగే, అదే ఏడాది సంభవించిన మరణాల్లో వైద్యపరంగా ధ్రువీకరించిన 18 లక్షల మరణాల్లో 9 శాతం కరోనా కారణంగా సంభవించినట్టు వివరించింది.

2020లో దేశవ్యాప్తంగా 81.15 లక్షల మరణాలు సంభవించాయి. వైద్యులు ధ్రువీకరించిన మరణాలు మాత్రం 18,11,688. వీరిలో హృద్రోగ సమస్యల కారణంగా 32.1 శాతం మంది మరణించగా, శ్వాస వ్యవస్థ సంబంధిత వ్యాధులతో మరో 10 శాతం మంది ప్రాణాలు విడిచారు.

9 శాతం (1,60,618) మంది కరోనాతో మృతి చెందారు. అయితే, కేంద్ర ఆరోగ్య శాఖ మాత్రం కరోనా కారణంగా సంభవించిన మరణాలను 1,48,994గా చెబుతుండడం గమనార్హం.

ఈ ఏడాది మే 25 నాటికి దేశవ్యాప్తంగా 5,24,507 మంది కరోనాతో మరణించినట్టు కేంద్రం చెబుతోంది.

ఆర్‌జీఐ నివేదిక ప్రకారం.. ఊపిరితిత్తులు, గుండెకు సంబంధించి సమస్యలతోనే దేశంలోనే ఎక్కువ మంది మరణిస్తుండగా, న్యూమోనియా ఆ తర్వాతి స్థానంలో ఉంది.

ఆస్తమా సంబంధిత మరణాలను శ్వాసకోస వ్యవస్థ సంబంధిత మరణాలుగా చెబుతున్నారు.

సెప్టిసీమియా, క్షయ వంటి వ్యాధుల కారణంగా 7.1 శాతం మంది మరణించగా, ఎండోక్రైన్, పోషకాహార, జీవక్రియ వ్యాధులకు (డయాబెటిస్) సంబంధించి 5.8 శాతం మరణాలు సంభవించాయి.

కేన్సర్ వల్ల 4.7 శాతం మంది మరణించగా, గాయాలు, విషప్రయోగం వల్ల 5.6 శాతం మంది ప్రాణాలు కోల్పోయారు. 9 రకాల ఆరోగ్య సమస్యలతో 88.7 శాతం మంది చనిపోయారు.

అన్ని రకాల మరణాల్లో పురుషులు 64 శాతం మంది ఉండగా, మహిళలు 36 శాతంగా ఉన్నారు.

ఇక, మొత్తం మరణాల్లో 5.7 శాతం ఏడాదికంటే తక్కువ వయసున్న చిన్నారుల్లో కనిపించగా, 45 ఏళ్ల వయసు పైబడిన వారిలో ఎక్కువ మంది హృద్రోగ సమస్యలతోనే చనిపోతున్నట్టు ఆర్‌జీఐ నివేదిక చెబుతోంది.

Recent

- Advertisment -spot_img