ఇదేనిజం, వెబ్‌డెస్క్ : ఆధునిక యుగంలో మానవాళిని ఎన్నో సమస్యలు వెంటాడుతున్నాయి. ఆర్థిక ఇబ్బందులు, అనారోగ్య సమస్యలు, కుటుంబ కలహాలు ఇలా ఎన్నో చుట్టుముడుతున్నాయి. నిద్ర పట్టకుండా చేస్తున్నాయి. సరైన అవగాహన లేక కొందరి జీవితాలు ఆగం చేసుకుంటున్నారు. కుటుంబాలు ఛిన్నాభిన్నం అవుతున్నాయి. ఏ సమస్య వచ్చినా తట్టుకునే శక్తిసామర్థ్యాలు కొరవడుతున్నాయి. ఆరోగ్యంగా ఉంటేనే ఏ సమస్యనైనా ఛేదించగలమనేది నిత్యసత్యం.
గత పదేళ్లలో మానవ జీవనశైలిలో పెనుమార్పులు సంభవించాయి. ప్రత్యేకించి కరోనా తర్వాత ప్రజల్లో ఆరోగ్యంపై శ్రద్ధాసక్తులు పెరిగాయి. అయినా చాలావరకు జనాలకు ఆహారం విషయంలో పరిజ్ఞానం ఉండటం లేదు. తద్వారా శరీరంలో సమతుల్యత లోపించి అనేక రోగాల బారిన పడుతున్నారు. ఆస్పత్రి పాలవుతున్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ వంటి అంతర్జాతీయ సంస్థలు మొత్తుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో ప్రపంచ రక్తపోటు దినోత్సవం సందర్భంగా డబ్ల్యూహెచ్‌ఓ పలు విషయాలను వెల్లడించింది.
రోజూవారీగా తీసుకునే ఆహారంలో ఉప్పు క్వాంటిటీని తగ్గించుకోవాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ సూచించింది. పరిమితికి మించి వాడితే ప్రాణాలకే ప్రమాదమని హెచ్చరించింది. ప్రపంచవ్యాప్తంగా ఏటా 25 లక్షల మంది అధిక ఉప్పు తినడం వల్ల రోగాల బారిన పడి చనిపోతున్నారని పేర్కొంది. అధిక రక్తపోటు, గుండె జబ్బులు, గుండెపోటు సంభవించే అవకాశాలు మెండుగా ఉంటాయని తెలిపింది. పెద్దలు సగటున రోజుకు 2000 mg పరిమితిని మించి 4310 మిల్లీగ్రాముల సోడియం తీసుకొంటున్నారని వెల్లడించింది. దీనివల్ల హృదయ సంబంధ వ్యాధులు, గ్యాస్ట్రిక్ క్యాన్సర్, ఊబకాయం, బోలు ఎముకల వ్యాధి, మెనియర్స్ వ్యాధి, మూత్రపిండాల వ్యాధితో పాటు వివిధ అనారోగ్య సమస్యలు తలెత్తుతాయని వివరించింది.
ప్రాసెస్ చేసిన ఆహారాన్ని తగ్గిస్తూ తాజా ఆహారాన్ని మాత్రమే తీసుకోవాలని సూచించింది. డైనింగ్ టేబుల్ నుంచి ఉప్పును తీసేయాలని సలహా ఇచ్చింది.