Homeఆంధ్రప్రదేశ్Sea erosion : ముప్పును తప్పేదెలా.. ఏపీ తీరాన్ని మింగేస్తున్న‌ సముద్రం..

Sea erosion : ముప్పును తప్పేదెలా.. ఏపీ తీరాన్ని మింగేస్తున్న‌ సముద్రం..

Sea erosion swallowing East Coast area : ఆంధ్రప్రదేశ్ తీరాన్ని మింగేస్తున్న‌ సముద్రం.. ముప్పును తప్పించే దారేది..

ఇటీవల తూర్పు గోదావరి జిల్లా అంతర్వేదిలో సముద్రం సుమారు కిలోమీటరు దూరం ముందుకు రావడంతో అక్కడి ప్రజల్లో ఆందోళన పెరిగింది.

ప్రపంచవ్యాప్తంగా అనేక ప్రాంతాలతో పాటు ఆంధ్రప్రదేశ్‌లోని చాలా తీర ప్రాంతాల్లోనూ ఇలా సముద్రం ముందుకొచ్చిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి.

అయితే, సముద్రం ఇలా ముందుకొస్తే ఆ ప్రాంతం భవిష్యత్తులో జల సమాధి అయిపోతుందని అర్థమా? అంతర్జాతీయ నివేదికలు ఏమంటున్నాయి? ఆంధ్రప్రదేశ్‌లోని శాస్త్రవేత్తలు, నిపుణులు ఏమంటున్నారు?

ఐపీసీసీ నివేదికలో ఏముంది?

“80 ఏళ్లలో భారతదేశంలోని 12 తీర ప్రాంత నగరాలు నీట మునిగిపోతాయి.

ప్రపంచంలో సముద్ర మట్టం పెరిగే రేటు ఆసియాలోనే ఎక్కువగా ఉంది.” అని ఐపీసీపీ (ఇంటర్ గవర్నమెంటల్ ప్యానల్ ఆన్ క్లైమేట్ చేంజ్) తన తాజా నివేదికలో పేర్కొంది.

ప్రస్తుతం ఈ నివేదికపై దేశవ్యాప్తంగా సముద్ర, భూ వాతావరణ నిపుణుల్లో చర్చ జరుగుతోంది.

వాతావరణంలో వచ్చిన మార్పులను శాస్త్రీయంగా అధ్యయనం చేసేందుకు ఏర్పాటైన సంస్థ ఐపీసీసీ.

దీనిని 1988లో యునైటెడ్ నేషన్స్ ఎన్విరానమెంటల్ ప్రోగ్రాం, వరల్డ్ మెటీరియలాజికల్ ఆర్గనైజేషన్ సంయుక్తంగా స్థాపించాయి.

తీర ప్రాంత నగరాల అభివృద్దికి సముద్రాలే కారణం. పోర్టులు, పర్యటక ప్రదేశాలు, మత్స్యపరిశ్రమ అభివృద్ధితో ఆయా ప్రాంతాలు నగరాలుగా అభివృద్ధి చెందాయి.

అయితే, ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా సముద్రాలను కాపాడుకునేలా మనిషి జీవన విధానం ఉండటం లేదని నిపుణులు అంటున్నారు.

విశాఖతో పాటు తీరప్రాంత నగరాలైన ముంబయి, చెన్నై, కొచ్చి, కాండ్లా, ఓఖా, భావ్ నగర్, మంగళూర్, పారాదీప్, ఖిదిర్‌పుర్, తూత్తుకుడి, మోర్ముగావ్‌లు 2100 నాటికి మునిగిపోతాయని ఐపీసీసీ రిపోర్టులో వెల్లడించింది.

ఈ సంస్థ భారత్‌తో పాటు ప్రపంచవ్యాప్తంగా తీర ప్రాంతంలో ఉన్న నగరాలపై రిపోర్టును తయారు చేసింది.

ఈ రిపోర్టును స్టడీ చేసేందుకు నాసా (NASA) ప్రొజెక్షన్‌ టూల్‌ని రూపొందించింది.

ఎక్కడ ఎంత మేర పెరుగుతుంది

నాసా రూపొందించిన ప్రొజెక్షన్ టూల్ ద్వారా ఐపీసీసీ రిపోర్ట్‌ను పరిశీలిస్తే ఖిదిర్‌పుర్ 0.16 మీటర్లు, విశాఖ 0.54, కాండ్లా 0.57, మంగళూరు 0.57, చెన్నై 0.57, ముంబయి 0.58, తూత్తుకుడి 0.59, పారాదీప్ 0.59, ఓఖా 0.60, మోర్ముగావ్ 0.63, కొచ్చి 0.71, భావ్‌నగర్‌లో 0.82 మీటర్ల మేర 2100 నాటికి సముద్రమట్టాలు పెరుగుతాయని పేర్కొంది.

ఈ స్థాయిలో సముద్ర మట్టాలు పెరిగితే పైన పేర్కొన్న నగరాలపై ఏ స్థాయిలో ప్రభావం ఉంటుంది…?

ఐపీసీసీ ఈ నివేదిక రూపొందించడంతో పరిగణనలోకి తీసుకున్న అంశాలేవి?

అనే విషయాలపై సముద్రగర్భ, భూగర్భ, వాతావరణ, పర్యావరణ నిపుణులతో..

“ఐపీసీసీ రిపోర్టు ప్రకారం రానున్న 80 ఏళ్లలో మన దేశంలోని 12 తీర ప్రాంతాల్లో కనిష్ఠంగా 0.16 మీటర్ల నుంచి గరిష్ఠంగా 0.82 మీటర్ల వరకు సముద్రమట్టాలు పెరుగుతాయని నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఓషనోగ్రఫీ మాజీ రీజనల్ హెడ్ డాక్టర్ జీపీఎస్ మూర్తి చెప్పారు.

‘‘కర్బన ఉద్గారాలు, ఉష్ణోగ్రతల పెరుగుదలతో పాటు మంచు కొండలు కరిగిపోవడం వంటి అంశాలను పరిగణనలోకి తీసుకుని ఐపీసీసీ అంచనాలు వేసినట్లుంది. ఐపీసీసీ నివేదిక ఒక అంచనా మాత్రమే.

మనం ప్రకృతితో వ్యవహారించే తీరును బట్టి అవి మానవాళికి అనుకూలమా, ప్రతికూలమా అనేది ఉంటుంది.

దీనిని బట్టే సముద్ర మట్టం పెరుగుదల ఉంటుంది” అని చెప్పారు.

50 ఏళ్లుగా పెరుగుతున్నాయి…

కర్బన ఉద్గారాలు, ఉష్ణోగ్రతలు ఏటా పెరుగుతూనే ఉన్నాయి. దీంతో ధ్రువాల దగ్గర మంచు కరుగుతోంది.

ఈ కారణంగా సముద్రమట్టాల్లో పెరుగుదల కనిపిస్తోంది. ఇది గత 50 ఏళ్లుగా కనిపిస్తున్న పరిణామం.

అయితే భారత తీర ప్రాంతాల్లో మాత్రం ఐపీసీసీ పేర్కొన్న స్థాయిలో సముద్ర మట్టాల పెరుగుదల లేదని, అలాగే భారత్ లోని చాలా తీర ప్రాంత నగరాలు భౌగోళికంగా సురక్షిత ప్రాంతాల్లో ఉన్నాయని ఆంధ్రా యూనివర్సిటీ సముద్రగర్భ అధ్యయన విభాగం మాజీ అధిపతిగా కేవీఎస్ఆర్ ప్రసాదరావు చెప్పారు.

“కాకినాడ, మచిలీపట్నం, ముంబయి, కొచ్చి, చెన్నై, బాలాసోర్, గోపాల్ పూర్ తీరాలు సముద్రమట్టం కంటే తక్కువ ఎత్తు, లేదా సమాంతరంగా ఉంటాయి.

దీంతో వీటిని లోతట్టు తీరప్రాంతాలుగా చెప్తాం. సముద్రమట్టం పెరగాలంటే అది ఉన్న బేసిన్ ఏరియా, అందులో ఉన్న, చేరుతున్న నీటి పరిమాణం ప్రధానం.

ఐపీసీసీ రిపోర్ట్ వందశాతం నిజమైతే, మాల్దీవులు, శ్రీలంక వంటి దేశాలకే ఎక్కువ ప్రమాదం.

మిడ్ లాటిట్యూడ్‌లో ఉన్న భారత్ తీర ప్రాంత నగరాలకు అంతగా భయం లేదు” అని ఆయన చెప్పారు.

“హిమలయాలు కరిగి…ఆ జలాలు నదుల్లో చేరి…అక్కడ నుంచి సముద్రంలోకి నీరు చేరితేనే భారత్ తీర ప్రాంతాలకు ముప్పు.

కానీ అటువంటి పరిస్థితులు రానున్న వందేళ్లలోపు లేవనే చెప్పవచ్చు” అని ప్రొఫెసర్ ప్రసాదరావు తెలిపారు.

పదేళ్ల క్రితం ‘భారత తీరాలలో సముద్ర మట్టాలు-మార్పులు’ అనే అంశంపై ప్రసాదరావు ఒక అధ్యయనం నిర్వహించారు.

30 ఏళ్లకు ఒక చక్రం

ఐపీసీసీ నివేదిక కాస్త ఎక్కువ భయపెట్టినట్లు ఉన్నా తేలికగా తీసుకోవద్దని, దీనిని దాదాపు 200 మంది శాస్త్రవేత్తలు రూపొందించగా, 190 దేశాలు ఆమోదించాయని ఏయూ వాతావరణ విభాగాధితి ప్రొఫెసర్ రామకృష్ణ తెలిపారు.

“శతాబ్ధ కాలాన్ని పరిశీలిస్తే ప్రపంచవ్యాప్తంగా గత అయిదేళ్లల్లోనే అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.

అలాగే ఇటీవల తీవ్రమైన వేడిగాలులు, సముద్ర మట్టం పెరుగుదల రేటు దాదాపు మూడు రెట్లు నమోదైంది.

1990 నుంచి హిమనీనదాలు కూడా కరగడం మొదలైంది.

కాలుష్యం, ఉష్ణోగ్రతల్లో పెరుగుదలను కంట్రోల్ చేయకపోతే 2040 నాటికి ఉష్ణోగ్రతలు గత శతాబ్ధం కంటే 1.5 డిగ్రీలు ఎక్కువగా నమోదవుతాయి.

వాతావరణ పరంగా ఇది తీవ్రపరిణామాలకు దారి తీస్తుంది” అని ఆయన వివరించారు.

వాతావరణపరంగా మార్పు ప్రతి 30 ఏళ్లకోసారి సంభవిస్తుంది. దీనినే అట్మాస్ఫియర్ సైకిల్(Atmosphere Cycle) అంటాం.

ఐపీసీసీ రిపోర్టు దాదాపు మూడు సైకిల్స్ తర్వాత ఏం జరగబోతుందని చెప్తోంది.

ఈ రిపోర్టు 2050 నాటి వరకైతే దీనిని పూర్తిగా ఏకీభవించవచ్చు.

కానీ, “2100నాటి పరిస్థితిని చెప్పడమంటే వందశాతం కరెక్ట్ అనలేం.

గతంలో కూడా మాల్దీవులు మునిగిపోతుందనే నివేదికలు చాలా ఉన్నాయి. కానీ అలా జరగలేదు.

ఐపీసీసీ అంచనాలుగా తీసుకుని లోతట్టు తీర ప్రాంతాలను పరిశీలన చేస్తే, రాబోయే ప్రమాదానికి ముందస్తు హెచ్చరికలుగా పనికొస్తాయి” అని రామకృష్ణ చెప్పారు.

ఏడాదికి 3.7 మిల్లీ మీటర్లు…

కర్బన ఉద్గారాలు, ఉష్ణోగ్రతల పెరుగుదల ఇదే విధంగా కొనసాగితే 2040 నాటికి సరాసరి 2 డిగ్రీల సెల్సియస్‌ ఉష్ణోగ్రతలు పెరుగుతుంది.

ఈ శతాబ్దం చివరి నాటికి గరిష్ఠంగా 2 మీటర్లు, 2150 నాటికి 5 మీటర్ల వరకు సముద్రమట్టాలు పెరిగే అవకాశముందుని ఐపీసీసీ రిపోర్టులో పేర్కొంది.

అవి అంత కచ్చితమైన గణాంకాలు కానప్పటికీ.. ఉష్ణోగ్రతలు, కాలుష్యం కంట్రోల్ చేయకపోతే, అది నిజమయ్యే అవకాశాన్ని కొట్టిపారేయలేమని రిటైర్డ్ ప్రొఫెసర్ ఉదయ్ భాస్కర్ అన్నారు.

“అంతర్జాతీయంగా సముద్ర మట్టాలు ఏడాదికి 3.7 మిల్లీ మీటర్ల చొప్పున పెరుగుతున్నాయని 2018లో జరిపిన సర్వేలో వెల్లడైంది.

ఇది ఒక హెచ్చరికే. ఊహించిన దానికంటే మరింత ఎక్కువగా కార్బన్ ఉద్గారాలు పెరుగుతున్నాయి.

ఇది వాతావరణాన్ని చాలా ఎక్కువగా ప్రభావితం చేస్తుంది.

కాలుష్య ఉద్గారాలను కట్టడి చేస్తే స్వల్పకాలంలో మంచి ఫలితాలు కనిపిస్తాయి.

తద్వారా ఉష్ణోగ్రతలు, సముద్ర మట్టాల పెరుగుదలను నియంత్రించవచ్చు.” అని ఏయూ ఎన్విరాన్మెంటల్ విభాగం మాజీఅధిపతి ప్రొఫెసర్ ఉదయ్ భాస్కర్ రెడ్డి చెప్పారు.

లోతట్టు తీరాలకు ప్రమాదమేనా?

విశాఖ మత్స్యకారులకి ఐపీసీసీ రిపోర్టు గురించి తెలియకపోయినా, వారు మాత్రం సముద్రంలో చాలా మార్పులొచ్చాయని చెప్తుబుతున్నారు.

ప్రస్తుతం ఉన్న తీరానికి చాలా దూరంలో 50 ఏళ్ల క్రితం తీరం ఉండేదని స్థానిక మత్స్యకారుడు అమ్మోరు చెప్పారు.

ఆ స్థలంలో తాము ఆటలాడుకునేవాళ్లమని, ప్రస్తుతం సముద్రం ముందుకు రావడంతో ఆటస్థలం పోయి, రోడ్డు మాత్రమే మిగిలిందని తెలిపారు.

విశాఖ హార్బర్ నుంచి భీమిలి వరకు 32 కిలోమీటర్ల పొడవైన తీర ప్రాంతముంది.

ఇందులో ఆర్కే బీచ్, సబ్ మెరైన్ ఏరియా, వుడా పార్కు, పెదజాలారిపేట, జోడుగుళ్లపాలెం, సాగరనగర్, భీమిలి తీరాల్లో సముద్రం ముందురావడం తరచూ ఎక్కువగా సంభవిస్తుంది.

ఇలా ముందుకు రావడం అనేది చాలా తీర ప్రాంతాల్లో కనిపిస్తుంది.

అయితే తీర ప్రాంతాల్లో సముద్రం ముందుకురావడం, ఐపీసీసీ రిపోర్ట్ లో పేర్కొన్నట్లు సముద్రం ముంచెత్తడం ఒకటి కాదని శాస్త్రవేత్తలు చెప్తున్నారు.

విశాఖ సురక్షితమేనా?

సముద్రం ముందుకు రావడం అనేది విశాఖ తీరంలో సాధారణంగా కనిపిస్తుంది.

దీనిపై తరచూ మీడియాలో బ్రేకింగ్ న్యూస్ కూడా వస్తుంటాయి.

ఇదేమి ప్రమాదకరమైనది కాదని..స్థానిక వాతావరణ పరిస్థితులు, సముద్రంలో జరిగే అలజడులు, తీరం ఉన్న భౌగోళిక పరిస్థితులు బట్టి సముద్రం ముందుకు, వెనక్కు వెళ్లడం జరగుతుందని బే ఆఫ్ బెంగాల్ స్టడీస్ విభాగాధిపతి ప్రొఫెసర్ పి. రామారావు తెలిపారు.

“విశాఖ నగరం సముద్ర మట్టం కంటే సగటున రెండు మీటర్లు వరకు ఎత్తులో ఉంది.

పైగా విశాఖ తూర్పుకనుమలలో ఉంటుంది. ఇదే నగరానికి రక్షణ కోట.

విశాఖలో ఏడాదికి సముద్రమట్టం 0.4 మి.మీ. మాత్రమే పెరుగుతున్నట్లు అధ్యయనంలో తేలింది.

ఈ నగరానికి సముద్రం నుంచి ముప్పు లేదు. ఐపీసీసీ నివేదిక స్థానిక పరిస్థితులతో బేరీజు వేసినట్లు అనిపించడం లేదు” అన్నారు ప్రొఫెసర్ పి. రామారావు.

తూర్పు గోదావరి జిల్లా అంతర్వేదిలో ఎప్పటికప్పుడు సముద్రంలో అలజడి కనిపిస్తోంది.

తాజాగా సముద్రం ముందుకు చొచ్చుకురావడంతో తీరానికి అనుకున్న ఉన్న భవనాలు కుప్పకూలాయి.

అంతర్వేదితో పాటు విశాఖ, కాకినాడ, మచిలీపట్నం, నెల్లూరు వంటి తీరప్రాంతాల్లో చాలా చోట్ల లోతట్టు ప్రాంతాలున్నాయి.

ఇవి సముద్రంలో ఏ చిన్న అలజడికైనా ప్రభావితమవుతాయి.

తుపాను, సముద్రంలో తరచూ సంభవించే అతి స్వల్ప భూకంపాల ప్రభావం కూడా వీటిపై కనిపిస్తుంది.

అంత మాత్రాన ఇవి త్వరలో మునిగిపోతాయని అర్థం కాదని ప్రొఫెసర్ రామారావు తెలిపారు.

Recent

- Advertisment -spot_img