బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం బలపడింది. దీని ప్రభావంతో రానున్న మూడు రోజుల పాటు ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ప్రస్తుతం ఈ అల్పపీడనం ఏపీ వైపు దూసుకొస్తోంది. బంగాళాఖాతంలో బలపడిన అల్పపీడనం ప్రస్తుతం వాయువ్య దిశగా ఉత్తర తమిళనాడు, దక్షిణ కోస్తా వైపు కదులుతోంది. ఆ తర్వాత 24 గంటల్లో ఉత్తరాంధ్ర వైపు వెళ్లనుంది. ఆంధ్రప్రదేశ్, తమిళనాడు రాష్ట్రాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. తీవ్ర అల్పపీడనం ప్రభావంతో ఇవాళ, రేపు ఏపీలోని కొన్ని జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తాయి. ఈరోజు డిసెంబర్ 19న శ్రీకాకుళం, విజయనగరం, అల్లూరి సీతారామరాజు, విశాఖపట్నం జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయి. అదే సమయంలో తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, ప్రకాశం, కృష్ణా, ఏలూరు, నెల్లూరు, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయి.