Homeతెలంగాణరాష్ట్రంలో యూరియా కొరత లేదు

రాష్ట్రంలో యూరియా కొరత లేదు

శాసనసభలో రైతుబంధు, రైతుభీమా, రైతు వేదికలపై సభ్యులు అంజయ్య యాదవ్, పెద్ది సుదర్శన్ రెడ్డి, చిరుమర్తి లింగయ్య, సండ్ర వెంకటవీరయ్య, యూరియా సరఫరాపై సభ్యులు దుద్దిళ్ల శ్రీధర్ బాబు అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇచ్చారు రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి. సభలో మంత్రి మాట్లాడుతూ ఫోన్ చేస్తే ఆరుగంటల వ్యవధిలో యూరియా అందుబాటులో ఉంచుతాం అన్నారు.

 శాసనసభ్యులు తమ నియోజకవర్గాలలో యూరియా కొరత ఉంటే కాల్ చేయాలని తెలిపారు. గత ఏడాదికన్నా 33.06 శాతం సాగువిస్తీర్ణం పెరిగినా ఎక్కడా యూరియా కొరత లేకుండా చేశామన్నారు. ఈ వానాకాలంలో ఇప్పటి వరకు 9.12 లక్షల మెట్రిక్ టన్నుల యూరియాను అందుబాటులో ఉంచామని, ఇంకా లక్ష టన్నుల  పై చిలుకు యూరియా కేంద్రం నుండి రావాల్సి ఉందన్నారు.

 యూరియా కోసం పలుమార్లు కేంద్రంతో ముఖ్యమంత్రి గారు మాట్లాడారు. నేను పలుమార్లు లేఖలు రాయడం, ఫోన్లు చేయడంతో పాటు, రెండు సార్లు కార్యదర్శితో కలిసి ఢిల్లీలో కేంద్రమంత్రిని కలిసినట్లు తెలిపారు. సరఫరాపై  ప్రతి రోజు ముఖ్యమంత్రి గారు, నేను, మా శాఖ కార్యదర్శి, మా సిబ్బంది నిరంతరం సమీక్షిస్తున్నాం, ఎనిమిది వేల పై చిలుకు కేంద్రాలలో ఒకటి, రెండు కేంద్రాల వద్ద ఆలస్యంగా స్టాక్ చేరే సమయంలో ప్రజలు నిలబడిన దాన్ని చూపి యూరియా కొరతగా ప్రతిపక్ష సభ్యులు ప్రభుత్వాన్ని అభాసుపాలు చేయాలనుకోవడం భావ్యం కాదు .. దీనివల్ల రైతులు ఆందోళన చెందుతారు అని మంత్రి అన్నారు.

 902 ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలు, 360 అగ్రో రైతుసేవా కేంద్రాలు, 86 హాకా సెంటర్లు, 6994 డీలర్లు మొత్తం 8312 కేంద్రాల ద్వారా యూరియా సరఫరా, విడతలవారీగా కేంద్రం యూరియా సరఫరా చేస్తుంది .. ప్రతి విడతలో కొంత తక్కువ ఇవ్వడం జరుగుతుంది .. దాని గురించి కేటాయించిన మొత్తం ఇవ్వాలని పలుమార్లు కేంద్రాన్ని కోరడం జరిగింది. ఒమెన్, రష్యా, చైనా తదితర దేశాల నుండి 70 శాతం యూరియా వస్తుంది .. ఇక్కడ ఇచ్చేది 30 శాతం మాత్రమే, రాష్ట్రంలో నేటి వరకు కోటీ 42 లక్షల ఎకరాలు సాగు చేశారన్నారు.

 రాష్ట్రంలో 50 వేల మెట్రిక్ టన్నుల యూరియా బఫర్ స్టాక్ ఉండగా, 12 వేల మెట్రిక్ టన్నులు రవాణాలో ఉంది,  రాష్ట్రంలోని గోదాములన్నీ పంటలు, పత్తి బేళ్లతో నిండిపోయాయి, కరోనా కారణంగా కూలీల కొరత ఉండడంతో రవాణా ఆగిపోయింది, పోర్ట్ లు, రైల్వే, స్టాక్ పాయింట్ల వద్ద కూలీల కొరత ఉంది .. అనేక ఇబ్బందులు ఉన్నా యూరియా కొరత లేకుండా చూస్తున్నామని అన్నారు.

 వ్యవసాయ క్లస్టర్లు పునర్విభజన చేస్తామని, సాగునీటి రాకతో సాగు విస్తీర్ణం పెరిగిందని, ఐదువేల ఎకరాలకు మించిన క్లస్టర్లను గుర్తించి పునర్విభజన, దానికి అనుగుణంగా అవసరాన్ని బట్టి కొత్త వ్యవసాయ విస్తరణ అధికారులను నియమిస్తామని, ప్రతి ఐదువేల ఎకరాలకు ఒక వ్యవసాయ విస్తరణ అధికారిని నియమించామన్నారు. దసరాకు రైతువేదికలు ప్రారంభం చేస్తామన్నారు. ఐదువేల ఎకరాలకు ఒకటి చొప్పున 2601 రైతువేదికల నిర్మాణం చేయనున్నట్లు తెలిపిరు. రైతుబంధు కింద గత ఐదు విడతలలో రూ.28,799.16 కోట్లు, ఈ వానాకాలానికి 57.90 లక్షల మంది రైతుల ఖాతాలలో రూ.7279.02 కోట్లు, రైతుభీమా పథకం కోసం గత మూడేళ్లలో రూ.2917.39 కోట్లు చెల్లించడం జరిగిందన్నారు. 2018 – 2020 వరకు 34,252 మంది రైతు కుటుంబాలకు రూ.5 లక్షల చొప్పున రూ.1712.60 కోట్ల రూపాయలు ఎల్ఐసీ చెల్లించిందన్నారు.

Recent

- Advertisment -spot_img