HomeజాతీయంSupreme Court: Do not discriminate against same-sex couples Supreme Court : స్వలింగ...

Supreme Court: Do not discriminate against same-sex couples Supreme Court : స్వలింగ జంటలపై వివక్ష చూపొద్దు

– సుప్రీంకోర్టు వెల్లడి

ఇదే నిజం, నేషనల్ బ్యూరో : స్వలింగ జంటల(గే, లెస్బియన్, ట్రాన్స్ జెండర్) వివాహాల చట్టబద్ధత విషయంలో దాఖలైన పిటిషన్లపై దేశ సర్వోన్నత న్యాయస్థానం మంగళవారం తీర్పు వెలువరించింది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ డి.వై.చంద్రచూడ్ నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల ధర్మాసనం.. ఈ పిటిషన్లపై నాలుగు వేర్వేరు తీర్పులు ఇచ్చింది. ఈ సందర్భంగా కోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. స్వలింగ సంపర్కం అనేది కేవలం పట్టణాలు లేదా సమాజంలో ఉన్నత వర్గాలకు మాత్రమే పరిమితమైనదనే అభిప్రాయాన్ని వీడాలని కోర్టు తెలిపింది. లైంగిక ధోరణి ఆధారంగా వ్యక్తుల పట్ల వివక్ష చూపకూడదని న్యాయస్థానం ఈ సందర్భంగా అభిప్రాయపడింది. ఈ కేసులో మొత్తం నాలుగు తీర్పులను ఇవ్వనున్నట్లు దేశ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ డి.వై. చంద్రచూడ్‌ తెలిపారు. కోర్టులు చట్టాలను రూపొందించవని.. కానీ, వాటిని అర్థం చేసుకుని అమలు చేస్తాయని సీజేఐ చెప్పారు. ఇక వివాహ వ్యవస్థ అనేది ‘స్థిరమైనదని, దాన్ని మార్చలేమని’ అనుకోవడం సరికాదన్నారు.

స్వలింగ సంపర్కుల కోసం ప్రత్యేక వివాహ చట్టాన్ని తీసుకురాకపోతే.. మనం మళ్లీ స్వాతంత్ర్యానికి పూర్వపు స్థితికి వెళ్లినట్లేనని అన్నారు. అయితే, ప్రత్యేక వివాహ చట్టం అవసరమా లేదా అనేది పార్లమెంట్‌ నిర్ణయిస్తుందని, దీని చట్టపరిధిలోకి కోర్టు వెళ్లాలనుకోవట్లేదని చెప్పారు.లైంగిక ధోరణి కారణంగా ఆ వ్యక్తులు బంధంలోకి వెళ్లే హక్కును నియంత్రించకూడదని కోర్టు ఈ సందర్భంగా అభిప్రాయపడింది. ఇలాంటి బంధాలపై వివక్ష చూపకుండా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలని సూచించింది. ఇక, వివాహేతర జంటలతో పాటు స్వలింగ జంటలు కూడా బిడ్డలను దత్తత తీసుకోవచ్చని సీజేఐ జస్టిస్‌ చంద్రచూడ్‌ తెలిపారు. భిన్న లింగాల జంటలే మంచి తల్లిదండ్రులుగా ఉంటారని చట్టం భావించట్లేదని పేర్కొన్నారు.
ఈ పిటిషన్లపై ఇంకా తుది తీర్పు వెలువడలేదు. ప్రస్తుతం రాజ్యాంగ ధర్మాసనంలోని మిగిలిన న్యాయమూర్తులు తమ తీర్పులను వెల్లడిస్తున్నారు. ఈ అంశంపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ డి.వై.చంద్రచూడ్‌ నేతృత్వంలోని అయిదుగురు సభ్యులతో కూడిన రాజ్యాంగ ధర్మాసనం 10 రోజులు పాటు సుదీర్ఘ విచారణ చేపట్టి.. మే 11న తన తీర్పును రిజర్వు చేసింది. తాజాగా నేడు తీర్పు వెలువరిస్తోంది.

Recent

- Advertisment -spot_img