Homeహైదరాబాద్latest Newsఠాగూర్ సీన్ రిపీట్. బ్రెయిన్ డెడ్ పేషెంట్‌కు 18 రోజులు ట్రీట్మెంట్. లక్షల రూపాయల బిల్లులు...

ఠాగూర్ సీన్ రిపీట్. బ్రెయిన్ డెడ్ పేషెంట్‌కు 18 రోజులు ట్రీట్మెంట్. లక్షల రూపాయల బిల్లులు వసూలు..చివరికి

ఠాగూర్ సినిమాలో జరిగిన విధంగా హైదరాబాద్ కేపీహెచ్‌బీలో ఓ సంఘటన జరిగింది. ట్రీట్మెంట్ చేస్తున్నామంటూ పేషెంట్ కుటుంబసభ్యుల నుంచి లక్షల రూపాయల బిల్లులు కట్టించుకున్నారు. ఎంతకీ కోలుకోకపోవడంతో అనుమానం వచ్చింది. దాదాపు 18 రోజుల తర్వాత వేరే అస్పత్రికి తీసుకువెళితే అక్కడ నిజం తెలిసింది. ఆ యువకుడు బ్రెయిన్ డెడ్ అయ్యాడని తెలుసుకొని కుటుంబసభ్యులు ఆశ్చర్యపోయారు. ఇన్ని రోజులు వైద్యం చేస్తున్నామని చెప్పి మమ్మల్ని మోసం చేశారని వాపోయారు.

బాధిత కుటుంబసభ్యుల వివరాల ప్రకారం.. పరిగి పరిధి సుల్తాన్‌పూర్‌కు చెందిన మల్లయ్య పెద్ద కుమారుడు డి.విజయ్‌కుమార్‌(23) డిగ్రీ చదువుతున్నాడు. అతనికి తలలో సమస్య ఉందని స్థానిక వైద్యుడు చెప్పడంతో ఏప్రిల్‌ 2న కేపీహెచ్‌బీ నాలుగో రోడ్డులోని న్యూరో ఆసుపత్రిలో విజయ్‌కుమార్‌ను చేర్పించారు.

ఆసుపత్రి యాజమాన్యం మొదట రూ.2.5లక్షల ప్యాకేజీ అని చెప్పి ఆపరేషన్‌ చేశారు. తర్వాత మరో రెండు శస్త్రచికిత్సలు చేశారు. కుటుంబసభ్యులు అడిగినప్పుడల్లా మెల్లగా కోలుకుంటాడని వైద్యులు తెలిపారు. చాలారోజులు కావడంతో సందేహం వచ్చి మే 20న బంజారాహిల్స్‌లోని మరో ఆసుపత్రికి తీసుకెళ్లగా అప్పటికే బ్రెయిన్‌డెడ్‌ అయినట్లుగా వైద్యులు చెప్పడంతో బోరున విలపించారు. ఎలాగైనా కాపాడాలని, మీ ప్రయత్నం మీరు చేయండి అంటూ కుటుంబసభ్యులు వేడుకోవడంతో విజయ్‌కుమార్‌ను వెంటిలేటర్‌పై ఉంచారు.

మంగళవారం నాడు విజయ్‌కుమార్‌ బంధువులు, గ్రామస్థులు కేపీహెచ్‌బీలోని న్యూరో ఆసుపత్రి ముందు ధర్నాకు దిగారు. ఎస్సై శ్రీనివాసులు చేరుకుని సముదాయించడంతో ఆందోళనను విరమించారు. ఈ విషయమై ఆసుపత్రి యజమానిని వివరణ కోరగా విజయ్‌కుమార్‌ వచ్చిన సమయంలో స్పృహ లేదని, సమస్య తీవ్రంగా ఉందని పేర్కొన్నారు. తలకు మూడుసార్లు శస్త్రచికిత్స చేశామని, మిగతా అవయవాలకు ఇన్‌ఫెక్షన్‌ సోకడంతోనే ఇన్ని రోజులు ఉంచుకున్నామని ఆయన తెలిపారు.

మంచిగా ఉన్న తన కుమారుడు వైద్యుల నిర్లక్ష్యంతో వెంటిలేటర్‌పై ప్రాణాపాయ స్థితిలో ఉన్నాడని విజయ్‌కుమార్‌ తండ్రి మల్లయ్య ఆవేదన వ్యక్తం చేశారు. కుమారుడి ప్రాణం కోసం పాలిచ్చే 12 గేదెలు, ఇంటి స్థలం, అప్పు తీసుకొచ్చి రూ.25లక్షలు ఆసుపత్రికి చెల్లించానని కన్నీరుమున్నీరుగా విలపించారు. తన బిడ్డను చూసేందుకు వీల్లేకపోవడంతో రోజువారి పరిస్థితి చెప్పేందుకు రోజుకు రూ.1500 తీసుకున్నారని వాపోయారు. వయసొచ్చిన కొడుకు ప్రాణాలతో కొట్టుమిట్టాడుతుంటే ప్రాణం పోయినట్లు అనిపిస్తుందని మల్లయ్య రోదించారు.

Recent

- Advertisment -spot_img