Homeహైదరాబాద్latest Newsనాలుగు నెలల కాంగ్రెస్​ పాలనలో తెలంగాణ ఆగమైంది: కేసీఆర్

నాలుగు నెలల కాంగ్రెస్​ పాలనలో తెలంగాణ ఆగమైంది: కేసీఆర్

ఇదే నిజం, తెలంగాణ: నాలుగు నెలల కాంగ్రెస్ పాలనలో తెలంగాణ ఆగమైందని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో కరెంటు సరఫరా సరిగా లేదని, సాగునీళ్లు లేక పంటలు ఎండిపోతున్నాయని, మంచి నీళ్లకు కూడా కరువొచ్చిందని మండిపడ్డారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా బస్సు యాత్ర చేపట్టిన కేసీఆర్.. ఐదోరోజైన ఆదివారం యాదాద్రి భువనగిరి జిల్లా తుర్కపల్లి నుంచి భువనగిరికి చేరుకున్నారు. భువనగిరి మీదుగా వరంగల్ జిల్లాకు వెళ్లారు. హనుమకొండ, వరంగల్​ జిల్లాల్లో నిర్వహించిన కార్నర్​ మీటింగ్​లో ఆయన మాట్లాడారు. ఉమ్మడి వరంగల్‌ జిల్లా గొప్పతనాన్ని కొనియాడారు. వరంగల్‌ మట్టితో, చరిత్రతో తనకు విడదీయరాని బంధం ఉందన్నారు. ‘వరంగల్‌ చైతన్యం ఉన్న జిల్లా. తెలంగాణ చరిత్రకు వైభవానికి ప్రతీక. ఆనాడు ఉద్యమం జరిగే రోజుల్లో ఓరుగల్లు పోరుగల్లుగా మారితేనే తెలంగాణ వచ్చింది. 1969 నుంచి విరామం ఎరగకుండా, రాజీపడకుండా పోరు చేసిన మన కాళోజీ, మన జయశంకర్‌ సార్‌ను తల్చుకుంటే ఉద్వేగభరితమైన ఆవేశం వస్తుంది’ అని కేసీఆర్‌ గుర్తుచేసుకున్నారు. బీఆర్‌ఎస్‌ పదేళ్ల పాలనలో ఉమ్మడి వరంగల్‌ జిల్లా బ్రహ్మాండంగా అభివృద్ధి చెందిందని.. ఇక్కడి నుంచి పోటీ చేస్తున్నపార్టీ అభ్యర్థి సుధీర్​ను భారీ మెజార్టీతో గెలిపించాలని ఆయన కోరారు.

సమైక్య పాలనలో వెనకబడింది..
సమైక్య వాదుల పాలనలో ఉమ్మడి వరంగల్ అన్ని విధాలుగా వెనుకబడిపోయిందని కేసీఆర్ తెలిపారు. అజాంజాహీ మిల్లు ఆగమైపోయిందన్నారు. బీఆర్‌ఎస్‌ అధికారంలోకి వచ్చిన తర్వాతనే జిల్లా అభివృద్ధిలో దూసుకుపోయిందన్నారు. ‘బీఆర్‌ఎస్‌ పాలనలో బ్రహ్మాండమైన కార్యక్రమాలు చేసుకున్నాం. నగరంలో హెల్త్‌ యూనివర్సిటీ పెట్టుకున్నాం. పరకాల మాజీ ఎమ్మెల్యే ధర్మారెడ్డి ఆధ్వర్యంలో మెగా టెక్స్‌టైల్‌ పార్క్ తెచ్చుకున్నాం. జిల్లాకు ఐదు మెడికల్‌ కాలేజీలు తెచ్చుకున్నాం. ములుగు, భూపాలపల్లి, నర్సంపేట, మహబూబాబాద్‌, జనగామల్లో కొత్తగా మెడికల్‌ కాలేజీలు పెట్టుకున్నాం’ అని కేసీఆర్ అన్నారు.

అభివృద్ధిని ఆపేశారు..
బీఆర్ఎస్ పాలనలో రాష్ట్రవ్యాప్తంగా బ్రహ్మాండంగా భూముల ధరలు పెరిగాయని కేసీఆర్ అన్నారు. రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం బాగా జరుగేదన్నారు. ‘ రియల్ ఎస్టేట్ రంగంపై ఆధారపడి బతికే వేల మంది ఇవాళ రోడ్లపై పడ్డారు. హైదరాబాద్‌, పెద్ద పెద్ద నగరాల్లో గత ఐదునెలలుగా పర్మిషన్లు ఇస్తలేరు. పర్మిషన్లు ఇవ్వకపోవడానికి కారణమేంటి? తెలంగాణ రాష్ట్రంలో మనం టీఎస్‌ బీపాస్‌ తీసుకువచ్చాం. అప్లికేషన్‌ పెడితే 21 రోజుల్లో ఆటోమేటిక్‌గా పర్మిషన్‌ ఇవ్వాలి. అది చట్టం. ఇవాళ ఉన్న ముఖ్యమంత్రి, మంత్రివర్గం ఆ చట్టాన్ని ఉల్లంఘించి పర్మిషన్‌ ఇవ్వడం లేదు. ఎందుకో తెలుసా? వేరే రాష్ట్రాల్లో ఉన్నట్లుగా స్వ్కేర్‌ ఫీట్‌ ఇంత అని కాంగ్రెస్‌ పార్టీకి లంచం ఇవ్వాలట. దాని కోసం మొత్తం ప్రగతిని ఆపేసి.. అభివృద్ధిని ఆపేసి పర్మిషన్లు ఇవ్వడం లేదు. పూర్తయిన బిల్డింగ్‌లకు ఆక్యుపెన్సీ సర్టిఫికెట్స్‌ ఇవ్వడం లేదు. ఈ బండారం బయటపెడతాం. రేపే.. ఎల్లుండో ముందుకుపోతాం’ అని కేసీఆర్ స్పష్టం చేశారు.

ఆ పార్టీకి విద్వేషం తప్ప మరొకటి తెలియదు..
బీజేపీ చాలా ప్రమాదకరమైన పార్టీ అని కేసీఆర్ మండిపడ్డారు. ‘విద్వేషం తప్ప.. బీజేపీ అజెండాలో ప్రజల కష్టసుఖాలు ఉండవు. అందుకే యువకులను కోరుతున్నా. ఆవేశం వద్దు. ఈ దేశం మీది. ఈ రాష్ట్రం మీది. రేపటి భవిష్యత్‌ మీది. ఈ విషయంపై ఊర్లు, బస్తీలు, గ్రామాల్లో చర్చ పెట్టాలి. బీజేపీ అజెండాలో ప్రజల కష్ట సుఖాలు ఉంటాయా? మన కాజీపేటకు కోచ్‌ ఫ్యాక్టరీ వస్తే.. దాన్ని ప్రధాని గుజరాత్‌కు ఎత్తుకెళ్లారు. గిరిజన వర్సిటీ కోసంపదేళ్ల నుంచి వందసార్లు అడిగితే ఎలక్షన్లకు ముందు కాగితం ఇచ్చారు. 18లక్షల ఉద్యోగాలు ఖాళీగా కేంద్రంలో ఒక్కదాన్ని నింపరు. ఇప్పుడు ఆయన రాజకీయ ప్రయోజనాల కోసం తెలంగాణ గొంతుకోసి గోదావరి నది ఎత్తుకుపోతా అని ప్రధాని అంటున్నారు. తమిళనాడుకు, కర్ణాటకకు నీళ్లిస్తా అని మాట్లాడుతున్నారు. దీనిపై దయచేసి ఆలోచించాలి’ అని కేసీఆర్ కోరారు.

ముఖ్యమంత్రికి ఏం తెలియదు..
సీఎం రేవంత్ రెడ్డికి భూగోళం, చరిత్ర తెలియదని కేసీఆర్ విమర్శించారు. గోదావరి నది నీళ్లను తీసుకెళ్తానని మోడీ రాష్ట్ర ప్రభుత్వానికి నోటిఫికేషన్‌ పంపితే ఈ కాంగ్రెస్ సర్కారు ఏం చేయట్లేదని మండిపడ్డారు. ‘ సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం కృష్ణా నదిని తీసుకుపోయి కేఆర్‌ఎంబీకి అప్పజెప్పింది. ఇప్పుడు గోదావరిని ఎత్తుకపోతా అంటుంటే మూతిముడుచుకొని కూర్చున్నార? మరి దాన్ని ఎవరు కాపాడాలి? ముఖ్యమంత్రి చిత్రవిచిత్ర మాటలు మాట్లాడుతున్నారు. వరంగల్‌కు కాళేశ్వరం నీళ్లే రాలేదు అని అంటారు. మరి నర్సంపేటలో, భూపాలపల్లిలో, మహబూబాబాద్‌లో, డోర్నకల్‌లో, పరకాలలో, వర్దన్నపేటలో, పాలకుర్తిలో ఎక్కడి నుంచి నీళ్లు వచ్చాయి? అంతకుముందు కాంగ్రెస్ రాజ్యంలో శ్రీరాంసాగర్‌ స్టేజ్‌-2 ద్వారా దశాబ్దాలు గడిచినా బొట్టు నీరు రాలేదు. మీ సహకారంతో తెలంగాణ సాధించుకున్న తర్వాత కష్టపడి అన్ని పూర్తిచేసి మధ్యలో కాళేశ్వరం నిర్మాణం చేస్తే వరంగల్‌ జిల్లాకు నీళ్లు వచ్చాయి. బ్రహ్మాండమైన పసిడి రాశుల లాంటి పంటలు పండాయి’ అని కేసీఆర్‌ చెప్పారు. కృష్ణా నదిని నేనే కట్టా అని రేవంత్ రెడ్డి చెబుతున్నారని.. ప్రపంచంలో ఎక్కడైనా నదిని కడతారా అంటూ కేసీఆర్ విమర్శించారు. ‘ అసెంబ్లీ ఎన్నికల్లో అడ్డగోలు హామీలకు మోసపోయి ఓట్లేస్తే కేవలం నాలుగైదు నెలలకే ఆగమాగం చేశారు. ఏం జబ్బొచ్చింది తెలంగాణకు? కరెంటు ఎక్కడ పోయింది? సాగునీళ్లు ఎక్కడ పోయాయి.? పంటలు ఎందుకు ఎండుతున్నయ్‌? మంచి నీళ్లకు కరువెందుకు వస్తున్నది? గత పదేళ్లలో ఇవన్నీ ఉండెనా?’ అని కేసీఆర్‌ ప్రశ్నించారు.

హంగ్​లో మనదే కీ రోల్..
లోక్​సభ ఎన్నికల్లో హంగ్​ రాబోతోందని కేసీఆర్ తెలిపారు. ‘నరేంద్ర మోడీ నేతృత్వంలోని బీజేపీకి 200 సీట్లు దాటే పరిస్థితి లేదు. తెలంగాణలో పార్లమెంట్‌ సీట్లన్నీ మనమే గెలిస్తే పేగులు తెగేదాకా కొట్లాడే ఒకే ఒక పార్టీ బీఆర్‌ఎస్‌ అవుతుంది. 14-15 ఎంపీలతో మనం పోతే.. కేంద్రంలోని హంగ్‌ పార్లమెంట్‌ వస్తే కీలకమైన పాత్ర పోషించే అవకాశం తెలంగాణకు ఈ రోజు ఉంది. మన గోదావరి, కృష్ణా నదులను కాపాడుకోవాలన్నా, తెలంగాణకు రావాల్సిన నిధులు రాబట్టుకోవాలన్నా, మన ప్రాజెక్టులకు జాతీయ హోదా రావాలన్నా, నిరుద్యోగ సమస్య తీరాలన్నా బీఆర్‌ఎస్ అభ్యర్థులు గెలవాలి’ అని కేసీఆర్ తెలిపారు.

కడియం రాజకీయ జీవితాన్ని సమాధి చేసుకున్నారు
స్టేషన్‌ ఘన్‌పూర్‌ ఎమ్మెల్యే కడియం శ్రీహరిపై కేసీఆర్ మండిపడ్డారు. ‘ఇక్కడ ఒక మనిషికి టికెట్‌ ఇచ్చాం. డిప్యూటీ సీఎం పదవి కూడా ఇచ్చాం. ఇప్పుడు ఎందుకు పార్టీ మారిపోయారు. ఎందుకోసం మారారు? కడియం శ్రీహరి చేసిన ఈ మోసంతో ఆయన రాజకీయ జీవితం శాశ్వతంగా సమాధి చేసుకున్నట్లే. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం.. ఇంకో మూడునెలల్లో స్టేషన్‌ ఘన్‌పూర్‌ నియోజకవర్గానికి ఉప ఎన్నిక రాక తప్పదు. మన రాజయ్య ఎమ్మెల్యే కాక తప్పదు. మీరు రాసిపెట్టండి. నేను చెబుతున్న జరుగబోయేది సత్యం. ద్రోహులకు చెప్పే గుణపాఠం ఇదే’ అని కేసీఆర్ అన్నారు.

ఉద్యమం ఇంకా అయిపోలేదు..
తెలంగాణ ఉద్యమం అయిపోలేదని.. ఇంకా పునర్నిర్మాణం మిగిలే ఉన్నదని కేసీఆర్ తెలిపారు. ‘ఇంకా చాలా అభివృద్ధి చేయాలి. అభివృద్ధి అంటే ఎట్ల ఉంటదో వరంగల్‌లో కట్టిన ఆసుపత్రే నిదర్శనం. ఆకాశమంత ఎత్తున ఇవాళ అందరికీ కనిపిస్తున్నది. అలాంటి ప్రతిభ ముందుకుపోవాలి. అలాంటి ప్రగతిలో తెలంగాణ రాష్ట్రం ముందుకు దూసుకుపోవాలంటే కచ్చితంగా బీఆర్‌ఎస్‌ పార్టీ గెలవాలి. మే 13 వరకు ఇదే ఉత్సాహం కొనసాగించాలి. చైతన్యం ఉన్న ఈ వరంగల్‌ గడ్డ మీద గులాబీ జెండా ఎగురవేయాలని ప్రతి ఒక్కరినీ కోరుతున్నా’ అని కేసీఆర్ పిలుపునిచ్చారు.

Recent

- Advertisment -spot_img