Homeహైదరాబాద్latest Newsతెలుగు కుర్రాడు నితీష్ రెడ్డిని పొగడ్తలతో ముంచెత్తిన పాట్ కమిన్స్

తెలుగు కుర్రాడు నితీష్ రెడ్డిని పొగడ్తలతో ముంచెత్తిన పాట్ కమిన్స్

IPL : ముల్లాన్‌పూర్ వేదికగా పంజాబ్ కింగ్స్‌తో జరిగిన ఉత్కంఠ మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ రెండు పరుగుల తేడాతో విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన ఎస్‌ఆర్‌హెచ్ నిర్ణీత 20 ఓవర్లలో తొమ్మిది వికెట్లు కోల్పోయి 182 పరుగులు చేసింది. 64 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయి కష్టాల్లో నిలిచిన జట్టును తెలుగు కుర్రాడు నితీశ్ రెడ్డి (64; 37 బంతుల్లో, 4×4, 5×6) ఆదుకున్నాడు. అర్ధశతకంతో సత్తాచాటి పంజాబ్‌ ముందు మంచి లక్ష్యాన్ని ఉంచాడు. అర్షదీప్ సింగ్ (4/29) నాలుగు వికెట్లతో సత్తాచాటాడు. అనంతరం ఛేదనలో పంజాబ్ కింగ్స్ 20 ఓవర్లలో ఆరు వికెట్లకు 180 పరుగులకే పరిమితమైంది. పంజాబ్‌కు పేలవారంభం దక్కింది. 58 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయింది. కానీ ఆఖర్లో శశాంక్ సింగ్ (46; 25 బంతుల్లో, 6×4, 1×6), అశుతోష్ శర్మ (33; 15 బంతుల్లో, 3×4, 2×6) గట్టిగా పోరాడారు. భువనేశ్వర్ కుమార్ (2/32), కమిన్స్ (1/22) ఆకట్టుకున్నారు.

విజయానంతరం సన్‌రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్ ప్యాట్ కమిన్స్ తమ జట్టు ప్రదర్శన గురించి మాట్లాడాడు. ఆదిలోనే వికెట్లు కోల్పోయినప్పటికీ 182 పరుగులు సాధించడం సంతోషంగా ఉందని తెలిపాడు. నితీశ్ రెడ్డి ఓ అద్భుతమైన ఆటగాడు అని, బ్యాటింగ్‌తో పాటు బౌలింగ్, ఫీల్డింగ్‌తో గెలుపులో కీలక పాత్ర పోషించాడని కమిన్స్ అన్నాడు. అలాగే ఈ మ్యాచ్‌లో భువనేశ్వర్‌తో కలిసి తాను బౌలింగ్‌ ప్రారంభించడానికి గల కారణాలను కమిన్స్ వివరించాడు. మిడిల్ ఓవర్లలో బౌలింగ్ వేసే కమిన్స్ పంజాబ్ మ్యాచ్‌లో పవర్‌ప్లేలోనే బంతిని అందుకున్నాడు.

“మ్యాచ్ గొప్పగా సాగింది. పంజాబ్ బంతితో సత్తాచాటి శుభారంభం చేశారు. అయినా మేం 182 పరుగులు సాధించగలిగాం. పంజాబ్ కూడా లక్ష్యానికి చేరువగా వచ్చింది. ఇంపాక్ట్ ప్లేయర్ వల్ల కలిసొచ్చేది ఇదే. బ్యాటింగ్ ఆర్డర్ లోతుగా ఉంటుంది. అయితే కొత్త బంతితో వాళ్లు విజృంభించారు. 150-160 పరుగులు సాధిస్తే పది మ్యాచ్‌ల్లో తొమ్మిది మ్యాచ్‌లను కాపాడుకోవడం అసాధ్యమే. అందుకే దూకుడుగా ఆడాం. ఇక నా బౌలింగ్ విషయానికొస్తే.. పరిస్థితుల వల్ల కొత్తబంతిని అందుకున్నాను. పంజాబ్ న్యూ బాల్‌తో చేసిన ప్రదర్శనను చూశాం. అందుకే నేను, భువనేశ్వర్ బౌలింగ్ ప్రారంభించాం. కొన్ని వికెట్లు తీయడానికి ప్రయత్నించాం. మా జట్టులో మరో సానుకూలత అంశమేమిటంటే రైట్ అండ్ లెఫ్ట్ ఆర్మ్ బౌలర్లు చాలా మంది ఉన్నారు. వాళ్లకు అవకాశాలు ఇస్తూ ఉత్తమ ఫలితాన్ని రాబట్టుకోవాలి. ఇక నితీశ్ రెడ్డి ఓ అద్భుతం, ఫెంటాస్టిక్. గత వారంలో అతడు ఈ సీజన్‌లో అరంగేట్రం చేశాడు. ఈ వారంలో బ్యాటింగ్ ఆర్డర్‌లో ముందుకు వెళ్లాడు. బౌలింగ్, ఫీల్డింగ్‌తో కూడా ఆకట్టుకున్నాడు. అతడు విజృంభించి జట్టు స్కోరును 182కు చేర్చడం గొప్ప విషయం” అని కమిన్స్ పేర్కొన్నాడు.

Recent

- Advertisment -spot_img