Homeఅంతర్జాతీయంఅత్యంత ప్రమాదకరమైన యుద్ధ క్షేత్రం సియాచిన్‌

అత్యంత ప్రమాదకరమైన యుద్ధ క్షేత్రం సియాచిన్‌

Many say that the most dangerous battlefield in the world is the tundra region of Russia.

However, none of these wars have stood the test of time in the last 36 years of ongoing Indo-Pakistani clashes in Siachen. Not only is fighting here, it is also difficult to breathe.

ప్రపంచంలో అత్యంత ప్రమాదకరమైన యుద్ధ భూమి ఏది అంటే రష్యాలోని టండ్రా ప్రాంతమని చాలామంది చెబుతారు.

1942లో స్టాలిన్‌గ్రాడ్‌లో రష్యా సైన్యం చేతిలో హిట్లర్‌ నాజీ సేనలు ఓడిపోవడం రెండో ప్రపంచ యుద్ధగతిని మార్చేసింది.

1948లో స్కర్దు, గిల్గిట్‌ ప్రాంతాలలో భారత్‌కు చెందిన మేజర్‌ జనరల్‌ తిమ్మయ్య తన సైన్యంతో పాకిస్తాన్‌ గిరిజనులతో చేసిన పోరాటం కూడా మంచుకొండల్లో సాహసోపేత యుద్ధానికి ఓ ఉదాహరణ.

అయితే, ఈ యుద్ధాలేవీ సియాచిన్‌లో గత 36 సంవత్సరాలుగా కొనసాగుతున్న భారత్-పాకిస్తాన్‌ ఘర్షణల ముందు నిలబడ లేవు. ఇక్కడ యుద్ధం చేయడమే కాదు, ఊపిరి తీసుకోవడం కూడా కష్టమే.

మనం ఇప్పుడు చెప్పుకోబోయేది 1984 ఏప్రిల్ 13నాటి కథ. అది ఉదయం 5.30గం.ల సమయం. కెప్టెన్‌ సంజయ్‌ కులకర్ణి, ఆయన సహచరుడు ప్రయాణిస్తున్న చీతా హెలికాప్టర్ బేస్‌ క్యాంప్‌ నుంచి బయలు దేరింది.

వారి వెనకే మరో రెండు హెలికాప్టర్లు బయలుదేరాయి. మధ్యాహ్నానికి స్క్వాడ్రన్‌ లీడర్ సురీందర్‌ సింగ్‌ బెయిన్స్, రోహిత్‌ రాయ్‌లు 17సార్లు అలా ప్రయాణించారు. ఒక జేసీఓ, 27మంది భారత సైనికులతోపాటు కెప్టెన్ సంజయ్‌ కులకర్ణి కూడా అక్కడికి చేరారు.

ఆనాటి ఈ ఘటనలపై నితిన్‌ గోఖలే తన పుస్తకం బియాండ్‌ ఎన్‌.జె.9842: ద సియాచిన్‌ సాగా (Beyond NJ 9842: The Siachen Saga) లో వివరంగా రాశారు.

“ఉదయం 6 గంటల సమయంలో మా జట్టులో నలుగురు సభ్యులు హెలికాప్టర్ల ద్వారా ఉపరితలానికి కొద్ది ఎత్తు నుంచి కిందికి దూకినట్లు సంజయ్‌ కులకర్ణి నాకు చెప్పారు’’ అని గోఖలే తన పుస్తకంలో రాశారు.

“మంచు లోతు తెలుసుకునేందుకు ముందు 25కిలోల బరువున్న పిండి సంచిని కిందికి వదిలినట్లు నాకు గుర్తు. అక్కడ మంచు గట్టిగానే ఉన్నట్లు మాకు అర్ధమైంది. తర్వాత అక్కడే మేం ఒక హెలీపాడ్‌ను తయారు చేశాం.

మా తర్వాత వచ్చే హెలికాప్టర్లు అక్కడ అరగంటసేపు ఆగి అక్కడి నుంచి మళ్లీ సరుకుల కోసం వెళతాయి. ఆ రోజు నేను మరిచిపోలేని విషయం ఏంటంటే ఆ రోజు అక్కడ విజిబిలిటి (దృశ్యమానత) చాలా తక్కువగా ఉంది. ఉష్ణోగ్రత మైనస్‌ 30డిగ్రీలు ఉంది’’ అని కులకర్ణి తనకు చెప్పినట్లు నితిన్‌ గోఖలే తన పుస్తకంలో పేర్కొన్నారు.

ల్యాండింగ్‌లో ఒక సైనికుడి మృతి

‘బిలాఫాండ్‌ లా’ (భారత్‌, పాకిస్తాన్‌ల సరిహద్దులోని చివరి ప్రాంతం) లోని హెలికాప్టర్‌ల నుంచి దిగిన మూడు గంటల్లోనే, రేడియో ఆపరేటర్‌కు ఎత్తైన ప్రాంతాలకు వెళ్లిన వారికి వచ్చే ‘హేప్‌’ (High Altitude Pulmonary Edema ) అనే వ్యాధికి గురై మరణించారు. దీంతో రేడియో ఆపరేషన్‌ లేకుండానే గడపాల్సి వచ్చింది.

అయితే అది ఒక రకంగా మేలు చేసింది. రేడియో సిగ్నల్స్‌ పని చేయకపోవడంతో అక్కడ భారత సైనికులు ఉన్నారన్న విషయాన్ని పాకిస్తాన్‌ సైనికులు గుర్తించ లేకపోయారు.

‘బిలాఫాండ్‌ లా’లో దిగిన కొద్దిసేపటికే కులకర్ణి, ఆయన బృందాన్ని భయంకరమైన మంచు తుపాను చుట్టేసింది. దీంతో వారికి బయటి ప్రపంచంతో సంబంధాలు తెగిపోయాయి.

ఇటీవల విడుదలైన ఫుల్‌ స్పెక్ట్రమ్‌: ఇండియాస్‌ వార్స్‌ , 1972-2020 ( Full Spectrum: India’s Wars, 1972-2020) పుస్తకంలో ఎయిర్‌ వైస్‌ మార్షల్‌ అర్జున్‌ సుబ్రమణ్యం ఈ ఘటన గురించి రాశారు.

“ఏప్రిల్ 16న వాతావరణం క్లియర్‌ అయినప్పుడు, మరికొన్ని సైనిక, వైద్య సహాయ బృందాలను పంపించి ఉండవచ్చు. అప్పటికే ఒక సైనికుడు చనిపోయాడు. మిగిలిన 27మంది సైనికులలో 21మంది మంచు తుపానుకు దెబ్బతిని ఉన్నారు.” అని పేర్కొన్నారు.

మంచు తుపాను నుంచి రక్షించుకోవడానికి జర్మనీ నుంచి ప్రత్యేక దుస్తులను పాకిస్తాన్‌ కొనుగోలు చేసింది. సియాచిన్‌లో రెండు దేశాల యుద్ధంపై బ్రూకింగ్స్‌ ఇనిస్టిట్యూషన్‌కు చెందిన సీనియర్‌ ఫెలో స్టీఫెన్‌ కోహెన్‌ ఒక సరదా కామెంట్‌ చేశారు.

“భారతదేశం, పాకిస్తాన్ మధ్య ఈ సంఘర్షణ దువ్వెన కోసం ఇద్దరు బట్టతల వ్యక్తుల పోరాటంలా ఉంది” అని ఆయన అన్నారు.

సుమారు 23వేల అడుగుల ఎత్తులో 75 కి.మీ.ల పొడవు, 10వేల చదరపు కి.మీ.ల విస్తీర్ణంలో ఉన్న సియాచిన్ గ్లేషియర్‌ ఎంత దుర్బేధ్యమైందో భారత, పాకిస్తాన్‌లకు 1972 వరకు అర్ధం కాలేదు.

భారత మాత నుదుటి కుంకుమగా చెప్పుకునే కారాకోరం శ్రేణిలోని NJ 9842 ప్రాంతం పాకిస్తాన్ భూభాగమంటూ 70లలో కొన్ని అమెరికన్‌ పత్రాలు వెల్లడించాయి.

దీంతో పాశ్చాత్య దేశాల పర్వతారోహకులను పాకిస్తాన్‌ ఆ ప్రాంతానిక పంపుతోందన్న విషయం భారతకు అర్ధమైంది. అప్పటి నుంచి ఈ ప్రాంతంపై పట్టు పెంచుకుకునేందుకు ప్రయత్నాలు మొదలు పెట్టింది.

ఇక్కడ సైన్యాన్ని మోహరించడానికి వీలుగా 1980లలో పాకిస్తాన్‌ భారీ ఎత్తున ప్రత్యేక దుస్తులను జర్మనీ నుంచి కొనుగోలు చేసినట్లు భారత ఇంటెలిజెన్స్‌ ఏజెన్సీ రీసెర్చ్‌ అండ్‌ ఎనాలిసిస్‌ వింగ్‌ ‘రా’(RAW) గుర్తించింది

అప్పట్లో ‘రా’ చీఫ్‌గా వ్యవహరిస్తున్న విక్రమ్‌ సూద్‌ ఆ సమయంలో శ్రీనగర్‌లో ఉన్నారు. ఆయన 15-కార్ప్స్‌ హెడ్‌క్వార్టర్‌ బాదామీ బాగ్‌ కార్యాలయానికి వెళ్లి పాకిస్తాన్‌ కమాండర్‌ లెఫ్టినెంట్ జనరల్‌ పి.ఎన్‌.హూన్‌ కార్యకలాపాల గురించి రిపోర్ట్‌ చేశారు.

పాకిస్తానీలు ప్రత్యేక దుస్తులు కొంటున్నది పిక్నిక్‌ల కోసం కాదని ఆయన హెచ్చరించారు.

పాకిస్తాన్‌ సైన్యం కన్నా ముందే సియాచిన్‌ చేరిన భారత సైన్యం

ఎయిర్‌ వైస్‌ మార్షల్ అర్జున్ సుబ్రమణ్యం తన ‘ఫుల్ స్పెక్ట్రమ్‌: ఇండియాస్‌ వార్స్ 1972–2020’ అనే పుస్తకంలో “1983 శీతాకాలంలో బిలాఫాండ్‌‌లా ను అదుపులోకి తెచ్చుకోవడానికి పాకిస్తాన్‌ తన సైనికులకు మెషిన్‌గన్‌లు, మోర్టార్లు ఇచ్చి పంపింది. అయితే కఠినమైన శీతాకాలపు వాతావరణం కారణంగా అక్కడికి చేరుకోలేక పాక్‌ సైన్యం తిరిగి వచ్చిందని చెబుతారు’’ అని రాశారు.

“భారత సైనికులు సియాచిన్‌లో అడుగుపెడుతున్న సమయంలో, పాకిస్తాన్ సైనిక నియంత జనరల్‌ జియా ఉల్‌ హక్‌ తన సైనికులలోని బుర్జిల్‌ ఫోర్స్‌ విభాగానికి స్కర్దు ప్రాంతంలో ఎలా మనుగడ సాగించాలో ట్రైనింగ్‌ ఇస్తున్నారు.

ఏప్రిల్‌ లేదా మే నెలల్లో వారిని అక్కడికి పంపాలనేది వారి ప్రణాళిక. కానీ భారత సైనికులు వారికన్నా ముందే అక్కడికి చేరుకున్నారు. బుర్జిల్‌ ఫోర్స్‌ మొదటిసారి 1984 ఏప్రిల్ 25న భారత సైనికులపై దాడి చేసింది. భారత సైన్యం దాన్ని తిప్పికొట్టింది’’ అని అర్జున్‌ సుబ్రహ్మణ్యం రాశారు.

పాకిస్తాన్‌ మాజీ అధ్యక్షుడు జనరల్‌ పర్వేజ్‌ ముషారఫ్‌ కూడా ఆ సమయంలో అక్కడే ఉన్నారు. ఆయన ఆత్మకథ ‘ఇన్‌ ది లైన్‌ ఆఫ్‌ ఫైర్‌’లో ఈ విషయం పేర్కొన్నారు.

“మార్చిలో అక్కడికి వెళ్లాలని మేం సలహా ఇచ్చాం. కాని నార్తర్న్‌ టెరిటరీ జనరల్ ఆఫీసర్ ఈ సలహాను వ్యతిరేకించారు. కఠినమైన భూభాగం, తీవ్ర మైన వాతావరణం కారణంగా సైనికులు మార్చిలో అక్కడికి చేరుకోలేరని ఆయన తేల్చి చెప్పారు.

మే 1వ తేదీన మేం అక్కడికి వెళతామని అన్నారు. ఆయన కమాండర్‌ కాబట్టి ఏమీ చేయలేకపోయాం. మా సైన్యం అక్కడికి చేరుకునేటప్పటికీ భారత సైన్యం అక్కడి కొండలను ఆక్రమించి ఉంది” అని రాశారు.

సైనికుడి మృతదేహాన్ని తీసుకురావడానికి రెండు వారాలు

సియాచిన్‌లో ఉష్ణోగ్రత మైనస్‌ 30 నుంచి 40 డిగ్రీల వరకు ఉంటుంది. అక్కడి పోస్టులలో సైనికులు పని చేయడం చాలా కష్టం.

చనిపోయిన సైనికుల మృతదేహాలను తీసుకురావడమే పెద్ద సవాలు. 90లలో సోనమ్‌ అనే గూర్ఖా రైఫిల్స్‌కు చెందిన సైనికుడు ‘హేప్‌’ వ్యాధితో మరణించారు. ఆయన మృతదేహాన్ని బేస్‌ క్యాంప్‌కు పంపించేందుకు హెలిప్యాడ్‌కు తీసుకువచ్చారు.

కానీ, పైలట్లు కొన్ని ముఖ్యమైన వస్తువులను పంపిణీ చేయడంలో బిజీగా ఉండటంతో, సాయంత్రం మృతదేహాన్ని కిందకు తీసుకెళ్లగలమని చెప్పారు.

“సాయంత్రం అయ్యేసరికి పైలట్ తన ఇంధనం అయిపోయిందని, మరుసటి రోజు తీసుకెళతానని చెప్పాడు. మరుసటి రోజు వేరే ముఖ్యమైన పనులు వచ్చాయి. ఇలా డెడ్‌బాడీ తీసుకెళ్లడానికి రెండు వారాలు పట్టింది.

ప్రతి రోజూ గూర్ఖా రెజిమెంట్ సైనికులు తమ సహచరుల మృతదేహాన్ని హెలిప్యాడ్‌కు తీసుకు వచ్చేవారు. కానీ హెలికాప్టర్‌లో స్థలం లేకపోవడంతో తిరిగి తీసుకెళ్లేవారు” అని గోఖలే తన పుస్తకంలో రాశారు.

ఒక సైనికుడు చనిపోయిన తన సహచరుడి మృతదేహాన్ని తనతోపాటే ఇరవై రోజులు బంకర్‌లో పెట్టుకోవాల్సి వచ్చింది. చివరకు ఆ సైనికుడు మతిస్థిమితం కోల్పోయాడు.

తన మిత్రుడు బతికే ఉన్నాడని ఆయన భ్రమించడం మొదలు పెట్టారు. చనిపోయిన మిత్రుడి కోసం భోజనాన్ని పక్కనబెట్టడం ప్రారంభించారు. ఈ విషయం తెలుసుకున్న అధికారులు ఆ మృతదేహాన్ని వెంటనే తరలించారు.

బిగుసుకుపోయే మృతదేహాలు

చలికి కట్టెలా బిగుసుకుపోయిన మృతదేహాలను హెలికాప్టర్‌లో పెట్టడం కూడా కష్టమే. పైలట్లను కదిలిస్తే ఇలాంటి కథలెన్నో చెబుతారు.

చిన్నగా ఉండే చేతక్‌ హెలికాప్టర్లలో ఇలా బిగుసుకుపోయిన శరీరాలను అమర్చడం కూడా కష్టమయ్యేదట. ఒక్కోసారి శవాలు పట్టకపోతే వాటి ఎముకలు విరగ్గొట్టి బ్యాగుల్లో పెట్టి హెలికాప్టర్‌లో తరలించాల్సి వచ్చేదట.

ఒక బ్రిగేడియర్‌ శవం రాయిలా మారిపోయి హెలికాప్టర్‌లో పెట్టడానికి వీలుకాకపోవడంతో, తాడుతోకట్టి హెలికాప్టర్‌కు వేలాడదీసి కిందికి తరలించాల్సి వచ్చింది. అధికారులకు ఇంతకన్నా ప్రత్యామ్నాయం కూడా ఉండేది కాదు.

ఎన్నో హిమపాతాలు

లెఫ్టినెంట్‌ కల్నల్‌ సాగర్ పట్వర్ధన్ తన జాట్ రెజిమెంట్‌ యూనిట్‌-6 తో కలిసి 1993-94లో సియాచిన్ గ్లేషియర్‌లో ఉండాల్సి వచ్చింది. ఆయన ఓ సాయంత్రం తన గుడారం నుండి బయటకు రాగానే నడుముల లోతు మంచులో కూరుకు పోయారు.

“నేను ఆ మంచు నుంచి బైటపడదామని కాలు ముందుకేసేసరికి నా షూ ఊడిపోయింది. మళ్లీ షూలో కాలు పెడతామని ప్రయత్నించేలోగానే అందులో మంచు చేరింది.

నా గుడారం 10 మీటర్ల దూరంలోనే ఉన్నా, తీవ్రమైన గాలుల కారణంగా నా కేకలు మిగిలిన వారికి వినిపించ లేదు. ఎలాగోలా నేను కాలు బైటికి తీసి, గాలికి పడిపోయేలా ఉన్న నా గుడారానికి చేరుకున్నాను. సహచరులు నా పరిస్థితి చూసి వెంటనే స్లీపింగ్ బ్యాగ్‌లో ఉంచి వేడెక్కించే ప్రయత్నం చేశారు.

మంచుకు గడ్డకట్టినట్లయిన నా కాలును కాపాడటం మొదటి ప్రాధాన్యత. నా సహచరులు పొయ్యి వెలిగించి నా కాలికి పట్టుకున్న మంచును కరిగేలా చేశారు. నా తడి సాక్స్‌ను తొలగించి పాదాలను రుద్దుకోవడం ప్రారంభించాను. మామూలు మనిషిని కావడానికి 3గంటలు పట్టింది” అని సాగర్‌ పట్వర్ధన్‌ తనకు ఎదురైన అనుభవాన్ని వివరించారు.

వంట చేసుకోవడానికి ఇబ్బంది

సియాచిన్‌లో ఉన్న 2-బిహార్‌ ట్రూప్‌ సార్జెంట్‌ రాజీవ్‌ కుమార్‌ తన అనుభవాలను నితిన్‌ గోఖలేతో పంచుకున్నారు.

“అక్కడ వంట చేసుకోవడం చాలా ఇబ్బంది. బియ్యం ఉడికించాలంటే కుక్కర్‌ 21 విజిల్స్‌ వచ్చే వరకు వేచి చూడాలి’’ అని ఆయన వెల్లడించారు.

సైనికులకు ప్రొటీన్‌లతో కూడిన ఆహారాన్ని పంపిస్తారు. కానీ ఆకలి లేకపోవడంతో దానిని చాలామంది తినరు. చలి కారణంగా సైనికుల శరీరం నల్లగా మారుతుంది. అక్కడున్న అనేకమంది సైనికులు నిద్రలేమితో బాధ పడుతుంటారు. దీనికి కారణం అక్కడ ఆక్సిజన్‌ లేకపోవడమేనని వైద్యులు చెబుతున్నారు.

సియాచిన్‌లో పని చేసే సైనికులకు తొమ్మిది జతల ఇంపోర్టెడ్‌ సాక్స్‌లు ఇస్తారు. వాటిని వాడనివారు ఇబ్బంది పడతారు.

సియాచిన్‌లో కమాండర్‌గా పనిచేసిన లెఫ్టినెంట్‌ జనరల్ పీసీ కటోచ్‌ తన అనుభవాన్ని వివరించారు. “నేనోసారి సెంట్రల్‌ గ్లేషియర్‌లో ఒక పోస్ట్‌ దగ్గర ఆగాను. మరుసటి రోజు మరో పోస్టుకు వెళ్లాల్సి ఉంది. సూర్యోదయానికి గంట ముందే బయలుదేరాను.

నాకు తెలియక చలి నుంచి కాపాడుకోవడానికి ఒక ఉన్ని కాంటోప్ ధరించాను. కాసేపటికి నా చెవులు ఊడిపోయినట్లు అనిపించింది. సాయంత్రానికి హెలికాప్టర్‌ ద్వారా నన్ను బేస్‌ క్యాంప్‌కు తీసుకువచ్చారు. నా చెవ్వు మంచు కాటుకు గురైనట్లు నాకు అర్ధమైంది. నెల రోజులపాటు పడుకున్నప్పుడు తల కదిలించలేక పోయాను’’ అని వివరించారు.

పాకిస్తానీ అవుట్‌ పోస్టులో మంటలు

2-బిహార్‌ ప్లాటూన్‌ అధికారి కెప్టెన్‌ భరత్‌ తన అనుభవాన్ని నితిన్‌ గోఖలేకు వివరించారు. “మా అవుట్‌ పోస్ట్‌కు 350 మీటర్ల దూరంలో పాకిస్తాన్‌ అవుట్‌ పోస్ట్‌ ఉంది. ఒకరోజు వారి గుడారంలో అగ్నిప్రమాదం సంభవించి నిమిషాల్లోనే పోస్ట్‌ను బూడిదగా మార్చేసింది.

మా గుడారం దగ్గరే ఉండటంతో సాయం చేస్తామని అరిచాము. కానీ వాళ్లు మా సాయం తీసుకోవడానికి నిరాకరించారు. కొద్దిసేపట్లో వారికి సహాయకులు వచ్చారు. కానీ ఇక్కడ నేను చెప్పదలుచుకున్న ముఖ్య విషయం ఒకటుంది. మా పోస్ట్‌కు ప్రతి రోజూ హెలికాప్టర్‌లు వచ్చేవి. కానీ వారి పోస్టులకు నేను అక్కడున్న 110 రోజుల్లో రెండు హెలికాప్టర్లు మాత్రమే వచ్చాయి.

సౌకర్యాల విషయంలో మాకు, పాకిస్తానీలకు భూమికి ఆకాశానికి ఉన్నంత తేడా ఉండేది” అన్నారు.

ఊపిరితిత్తులు, మెదడులోకి నీరు

కశ్మీర్‌లో కమాండర్‌గా పని చేసిన జనరల్ అటా హస్నయిన్ ఒక ఉదంతం చెప్పారు. “బనా అవుట్‌ పోస్ట్‌ వద్ద త్రీటైర్‌ కంపార్ట్‌మెంట్‌ ఎత్తులో మంచు పేరుకునిపోయి ఉంది. అక్కడ పోస్టింగ్‌లో ఉన్న సైనికుడు, ఆఫీసరు ఒకరి మీద ఒకరు పడుకున్నారు.

బహుశా ఒక సైనికుడి మీద పడుకుని నిద్రపోయిన తొలి ఆఫీసర్‌ ఆయనే అయ్యుండవచ్చు. కాసేపటికి ఆ సైనికుడు సార్‌ ఇక నా వల్ల కాదు. మీరు చాలా బరువున్నారు. కాసేపు నా కాళ్లు పైన పెట్టుకుంటాను అన్నాడు’’ అని హస్నయిన్‌ వెల్లడించారు.

సియాచిన్‌ గ్లేసియర్‌ మీద మానవ శరీరం చాలా తక్కువ తేమ, అధిక చలి, అల్ట్రా వయోలెట్‌ రేడియేషన్‌ను అనుభవించాల్సి ఉంటుంది.

ఎక్కువసేపు ఒంటరిగా ఉండటం, టిన్‌లతో ఇచ్చే ఆహారం పైనే ఆధారపడటం, స్వచ్ఛమైన నీరు దొరికే పరిస్థితి లేకపోవడంతో సైనికులు ఇబ్బందులు ఎదుర్కొంటారు.

దీనికి తోడు కరెంటు కూడా లేని టెంట్లు, పొంచి ఉండే శత్రు భయంలాంటివి సైనికులకు అగ్నిపరీక్షలాంటివి.

సియాచిన్‌ అధిక ఎత్తులో ఉండటంతో అక్కడ పని చేసే ఒక ఆరోగ్యకరమైన సైనికుడు, ఊపిరితిత్తుల వ్యాధితో బాధపడుతూ సముద్ర ఉపరితలం మీద నివసించే రోగితో సమానం.

అనేకమంది సైనికులు ఊపిరితిత్తులు, మెదడులోకి తేమ చేరి అనారోగ్యం పాలవుతుంటారు.

ఒకప్పుడు సియాచిన్‌లో ఉన్న 100మంది సైనికులలో15మందికి ‘హేప్‌’ వ్యాధి వచ్చేది. అయితే ఇప్పుడు వైద్యుల కృషివల్ల ఆ సంఖ్య వందమందిలో ఒకటికి తగ్గింది.

కార్గిల్‌ యుద్ధంలోకన్నా సియాచిన్‌ పహారాలోనే ఎక్కువ మరణాలు

సియాచిన్‌లో ఇప్పటికే ఎంతోమంది సైనికులు మరణించారు. వీటిలో ఎక్కువ మరణాలు యుద్ధం వల్ల కాక, ప్రమాదాల కారణంగా జరిగినవే.

సియాచిన్‌ నుంచి తిరిగి వచ్చిన తరువాత సైనికులు బరువు తగ్గడం, అధిక నిద్ర, మతి మరుపు, లైంగిక శక్తిని కోల్పోవడంలాంటి ఇబ్బందులకు గురవుతారు.

ఒక అంచనా ప్రకారం, ప్రపంచంలోనే అత్యధిక ఎత్తులో ఉన్న ఈ యుద్ధ భూమి కోసం భారత ప్రభుత్వం ప్రతి రోజు రూ. 6 కోట్లు ఖర్చు చేస్తుంది. భారత, పాకిస్తాన్‌ల నుంచి దాదాపు 5వేలమంది చొప్పున సైనికులు అక్కడ మోహరించారు.

ఈ సైనికుల కోసం ప్రత్యేక దుస్తులు, పర్వతారోహణ పరికరాల కోసం భారతదేశం ఇప్పటి వరకు రూ.7500 కోట్లు ఖర్చు చేసింది. సియాచిన్‌లో మోహరించే ప్రతి సైనికుడికి ఇచ్చే కిట్‌ ధర సగటున రూ.1 లక్ష.

ఇందులో రూ.28వేలు కేవలం దుస్తుల కోసమే ఖర్చు చేస్తారు. స్లీపింగ్‌ బ్యాగ్‌ల కోసం రూ.13వేలు, గ్లవ్స్‌ కోసం రూ.14వేలు, బూట్ల కోసం రూ. 12,500 ఖర్చు చేస్తారు.

1984 నుండి ఇప్పటి వరకు సియాచిన్‌లో సుమారు 869మంది భారత సైనికులు ప్రాణాలను కోల్పోయారు. ఇది కార్గిల్‌ యుద్ధంలో మరణించిన సైనికుల సంఖ్య కంటే ఎక్కువ. ఇందులో 97% మరణాలు వాతావరణ ఇబ్బందుల కారణంగా సంభవించినవే.

Recent

- Advertisment -spot_img