Homeజాతీయంవ్యవసాయ చట్టాలను వెనక్కి తీసుకునే వరకు నిరసన సాగుతుంది: రైతు సంఘాలు

వ్యవసాయ చట్టాలను వెనక్కి తీసుకునే వరకు నిరసన సాగుతుంది: రైతు సంఘాలు

న్యూఢిల్లీ: కేంద్ర వ్యవసాయ చట్టాలను వెనక్కి తీసుకోవడమే తాము చేపట్టిన ‘చలో దిల్లీ’ ర్యాలీ ప్రధాన అజెండా అని పంజాబ్‌ రైతు సంఘాలు తెలిపాయి.

రైతు సంఘాలతో చర్చించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని కేంద్ర హోంమంత్రి అమిత్‌షా చేసిన ప్రతిపాదనను ఆదివారం తిరస్కరించాయి.

అంతేకాకుండా తమ ఆందోళనలను దిల్లీలోని బురారీ మైదానానికి తరలించేందుకు సైతం రైతు సంఘాలు నిరాకరించాయి. దిల్లీ నడిబొడ్డున నిరసన తెలిపేందుకు అనుమతి ఇవ్వాలంటూ సంఘాల నాయకులు కోరుతున్నారు.

రైతు సంఘాల నాయకులు మీడియాతో మాట్లాడుతూ… శాంతియుతంగా తాము చేస్తున్న నిరసనలపై కేంద్రం ఆంక్షలు విధిస్తోందని మండిపడ్డారు.

తమ డిమాండ్లపై ప్రభుత్వం దిగి వచ్చేంత వరకు ఎటువంటి పరిస్థితులు ఎదురైనా నిరసనలు విరమించేది లేదన్నారు.

కేంద్ర వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా పంజాబ్‌ రైతులు చలో దిల్లీ ర్యాలీకి పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో దిల్లీలో నిరసనకు ప్రభుత్వం ముందు అనుమతి నిరాకరించడంతో సరిహద్దులోని సింఘు, టిక్రీ వద్ద ఐదు రోజులుగా రైతులు నిరసనలు కొనసాగిస్తున్నారు.

ఓ వైపు రైతుల నిరసనలు కొనసాగుతున్న క్రమంలో ప్రధాని నరేంద్రమోదీ ఆదివారం ‘మన్‌ కీ బాత్‌’ కార్యక్రమంలో మాట్లాడుతూ.. నూతన వ్యవసాయ చట్టాలు రైతుల కష్టాల్ని దూరం చేసి కొత్త అవకాశాలు కల్పిస్తాయన్నారు.

సుదీర్ఘ చర్చ తర్వాతే వాటికి పార్లమెంటులో ఆమోదం లభించిందన్నారు. పంట కొనుగోలు పూర్తైన మూడు రోజుల్లో రైతుల ఖాతాల్లో నగదు జమ కావాలని లేని పక్షంలో అన్నదాతలకు ఫిర్యాదు చేసే హక్కు ఉంటుందని తెలిపారు.

Recent

- Advertisment -spot_img