ఇదేనిజం, కరీంనగర్: కరీంనగర్ లోని ఓ ప్రాంతానికి చెందిన దంపతులకు కొడుకు, కూతురు ఉన్నారు. ఇంటి పెద్ద ఆటో నడుపుతూ కుటుంబాన్ని పోషించేవాడు. ఎంతోకొంత కూడబెట్టి బిడ్డ పెళ్ళి చేశాడు. ఉన్న ఒక్కగానొక్క కొడుకును అప్పోసప్పో చేసి బీటెక్ పూర్తి చేయించాడు. తల్లిదండ్రుల కష్టానికి తగ్గట్టుగా ఆ కొడుకు కూడా పట్టుదలతో చదవి, ఢిల్లీలోని ఓ కంపెనీలో సాఫ్ట్వేర్ ఉద్యోగానికి ఎంపికయ్యాడు. కొడుకు ప్రయోజకుడయ్యాడు. ఇక తమ కష్టాలు తీరినట్టేనని తల్లిదండ్రులు భావించారు. ఇంతకాలం తాము పడిన కష్టానికి ఫలితం దక్కిందనే సంతోషం ఆ తల్లిదండ్రులకు ఎంతో కాలం నిలవలేదు. ఉద్యోగం సాధించిన యువకుడు కొద్దిరోజులకే ఆత్మహత్యకు పాల్పడి వారికి తీరని శోకాన్ని మిగిల్చాడు. కారణం… ఆన్లైన్ గేమ్స్… ఆన్లైన్ గేమ్స్కు అలవాటు పడిన సదరు యువకుడు మొదట కొంత డబ్బు పోవడంతో తెలిసిన వారి వద్ద, మిత్రుల వద్ద అప్పులు చేసి మరీ ఆడాడు. ఎలాగైనా పోయిన డబ్బును తిరిగి రాబట్టాలనే ఆశతో ఇలా దాదాపు రూ. 10 లక్షల వరకు అప్పులు చేశాడు. కానీ, డబ్బులు రాకపోగా, అప్పులు మిగిలాయి. అప్పు తీసుకున్న వారికి ఎలా చెల్లించాలో పాలు పోలేదు. కంపెనీలో ఉద్యోగం మానేసి, ఇంటికి వెళ్లామని నిర్ణయించుకున్నాడు. ఇదే విషయం కంపెనీలో చెప్పగా, ఉద్యోగం మానేయడం కుదరదని, మానేస్తే తమకు డిపాజిట్ చెల్లించాలన్నారు. ఓ వైపు అప్పులు, మరోవైపు కంపెనీ డబ్బులు చెల్లించాలనడంతో తీవ్ర మనోవేదనకు గురై చివరికి తను ఉండే గదిలో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు.
ఇది మచ్చుకు ఒక ఉదాహరణ మాత్రమే. ఆన్లైన్ రమ్మీ, అందర్ బాహర్, తీన్పత్తి, రూలెట్, సిక్బో ఇలా చెప్పుకుంటూ పోతే లెక్కలేనన్ని గేమ్స్ క్రికెట్, టెన్నిస్. ఫుట్బాల్… ఒకటేమిటి అసలు బెట్టింగే లేని ఆట లేదంటే నమ్మలేం. నిత్యం ఏదో ఒకచోట ఆన్లైన్ గేమ్స్, బెట్టింగులతో ఆర్థికంగా చితికిపోయి ఆత్మహత్యలు చేసుకుంటూనే ఉన్నారు. ఆన్లైన్ గేమ్స్, బెట్టింగ్స్ కు బానిసలుగా మారిన వారు ఉదయం లేవడం మొదలు రాత్రి పడుకునే దాకా, మరికొందరు రాత్రంతా నిద్రపోకుండా ఫోన్లలో గేమ్స్ ఆడుతున్నారంటే అతిశయోక్తి కాదు. గేమ్, బెట్టింగ్లో తమ వద్ద ఉన్న డబ్బు పోవడంతో, పోయిన డబ్బును రాబట్టుకోవాలని అప్పులు చేసి మరీ ఆడుతున్నారు. ఈ క్రమంలో ఉన్నదీ, ఉంచుకున్నదీ పోయిందన్న చందాన అప్పులపాలై అర్థంతరంగా తనువు చాలిస్తున్నారు.
ఆన్లైన్ గేమ్స్, బెట్టింగ్ బూతానికి ముక్కుపచ్చలారని పిల్లలతో సహా భార్యాభర్తలు ఆత్మహత్యలు చేసుకున్న సంఘటనలూ ఉన్నాయి. కాలక్షేపం కోసం మొదలుపెట్టిన ఆన్లైన్ గేమ్స్, బెట్టింగులు క్రమక్రమంగా వ్యసనంగా మారుతున్నాయి. ఎంతో ఉ జ్వల భవిష్యత్తు ఉన్న యువత కూడా వీటికి బానిసలుగా మారి, డబ్బులు పోగొట్టుకొని అర్థాంతరంగా తనువు చాలిస్తున్నారు. వీరినే ప్రాణంగా భావించి, సర్వస్వం త్యాగం చేసిన తల్లిదండ్రులకు కడుపుకోతను మిగిలిస్తున్నారు. ఇదిలా ఉంటే కుటుంబాన్ని పోషించాల్సిన ఇంటి యజమానులూ బెట్టింగ్స్. ఆన్లైన్ గేమ్స్ మత్తులో పడి ఇండ్లు, జాగలే కాదు, ఒంటిమీదున్న బంగారం మొత్తం అమ్ముతున్నారంటే నమ్మలేని పరిస్థితి. చివరికి పరిస్థితి చేయి దాటి ఆర్థిక ఇబ్బందులతో చనిపోతుండడంతో భార్యాపిల్లలు అనాథలుగా మారి రోడ్డున పడుతున్నారు.
ఇటీవల మెదక్ జిల్లాలో ఓ యువకుడు బెట్టింగ్లో రూ.2 కోట్ల వరకు పోగొట్టడంతో కోపోద్రిక్తుడైన తండ్రి ఇనుపరాడ్డుతో దాడిచేసి చంపాడు. మరి ఇంతలా ఆన్లైన్ గేమ్స్, బెట్టింగ్లు నడుస్తుంటే సంబంధిత అధికారులు ఏమీ చేయలేకపోతున్నారా? అనేది మిలియన్ డాలర్ల ప్రశ్న. అసలు ఆన్లైన్ గేమ్స్, బెట్టింగ్లకు సంబంధించి కొన్ని కంపెనీలు చట్టప్రకారమే నడుచుకుంటున్నా, చాలా మట్టుకు నిబంధనలకు విరుద్ధంగా తమ ట్రేడింగ్ను కొనసాగిస్తున్నాయనే ఆరోపణలున్నాయి. ఇప్పటికైనా ఆన్లైన్ గేమ్స్, బెట్టింగ్ లపై అవగాహన కల్పించడంతో పాటు, నిబంధనలకు విరుద్ధంగా, చట్టవ్యతిరేకంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్న వాటిపై చర్యలు తీసుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది.