Homeఫ్లాష్ ఫ్లాష్Power in NTR's name : ఎన్టీఆర్ పేరులోనే పవర్

Power in NTR’s name : ఎన్టీఆర్ పేరులోనే పవర్

– రాముడైనా, కృష్ణడైనా ఆయనే..
– తెలుగు వారికి ఆరాధ్యదైవం
– ఖమ్మం పర్యటనలో మంత్రి కేటీఆర్ ఆసక్తికర వ్యాఖ్యలు

ఇదే నిజం, తెలంగాణ బ్యూరో: ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగువారికి ఎన్టీఆర్ ఆరాధ్యదైవమని మంత్రి కేటీఆర్ కొనియాడారు. ఖమ్మంలోని లకారం ట్యాంక్‌ బండ్‌పై రూ.1.37 కోట్లతో కొత్తగా ఏర్పాటు చేసిన ఎన్టీఆర్‌ పార్క్‌ సహా విగ్రహాన్ని మంత్రి పువ్వాడ అజయ్‌ కుమార్‌తో కలిసి కేటీఆర్‌ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు.‘ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగు వారందరికీ ఎంతో ఆప్తుడు విశ్వ విఖ్యాత నందమూరి తారక రామారావు. ప్రజల మనసుల్లో చెరగని ముద్ర వేసిన మహా నాయకుడు ఎన్టీఆర్‌. రాముడు ఎలా ఉంటాడో తెలియదు.. కృష్ణుడు ఎలా ఉంటాడో తెలియదు.. మాకు రాముడైనా, కృష్ణుడైనా ఆయనే. భారత దేశంలో తెలుగు వారంటూ ఉన్నారని గుర్తించేలా చేసింది ఎన్టీఆరే. చరిత్రలో మహనీయుల స్థానం ఎప్పటికీ చిరస్మరణీయంగా ఉంటుంది. ఆయన విగ్రహాన్ని ఆవిష్కరించే అవకాశం రావడం నా అదృష్టం. నాకు తారక రామారావు పేరు ఉండటం చాలా సంతోషంగా ఉంది. తారక రామారావు పేరులోనే పవర్‌ ఉంది. ఎన్టీఆర్‌ శిష్యుడిగా కేసీఆర్‌ తెలంగాణ అస్తిత్వాన్ని దేశవ్యాప్తంగా చాటి చెప్పారు. దక్షిణ భారత దేశంలో అన్న ఎన్టీఆర్‌ సహా ఇప్పటివరకూ హ్యాట్రిక్ ఎవరూ కొట్టలేదు. అది సీఎం కేసీఆర్‌కు త్వరలో సాధ్యమవుతుంది’అని కేటీఆర్‌ ధీమా వ్యక్తం చేశారు.
కాంగ్రెస్​.. 420 పార్టీ
కాంగ్రెస్‌ పార్టీ అంటే గ్యారంటీ కాదని, అది 420 పార్టీ అని మంత్రి కేటీఆర్‌ అన్నారు. రైతును రాజుగా మార్చిన ముఖ్యమంత్రి కేసీఆర్‌ను కాపాడుకుందామని పిలుపునిచ్చారు. పనిచేసే ప్రభుత్వాన్ని ఆశీర్వదించాలన్నారు. ఉమ్మడి ఖమ్మం జిల్లా పర్యటనలో భాగంగా కొణిజర్ల మండలం అంజనాపురం వద్ద ఆయిల్‌పామ్‌ ఫ్యాక్టరీకి మంత్రి కేటీఆర్‌ శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. రాష్ట్రంలో 20 లక్షల ఎకరాల్లో ఆయిల్‌పామ్‌ను సాగు చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకున్నదన్నారు. ఆయిల్‌పామ్‌ సాగుతో లాభాలు ఉన్నాయని చెప్పారు. ఈ ప్రాంత రైతులు ఫ్యాక్టరీని సద్వినియోగం చేసుకుని ఆర్థికంగా పైకి ఎదగాలని సూచించారు. ఖమ్మం జిల్లా ప్రజలు చాలా చైతన్యవంతులని మంత్రి కేటీఆర్‌ అన్నారు. వారెంట్‌ లేని కాంగ్రెస్‌ను వచ్చే ఎన్నికల్లో అడ్రస్‌ లేకుండా చేయాలనని పిలుపునిచ్చారు. బీఆర్‌ఎస్‌ గెలుపు అభివృద్ధికి మలుపు కావాలన్నారు.

Recent

- Advertisment -spot_img