Homeహైదరాబాద్latest Newsఇది రాష్ట్ర ప్రజలను అవమానపర్చడమే.. తెలంగాణ వ్యతిరేకికి ఎంపీ సీటు ఇస్తారా?

ఇది రాష్ట్ర ప్రజలను అవమానపర్చడమే.. తెలంగాణ వ్యతిరేకికి ఎంపీ సీటు ఇస్తారా?

ఇదేనిజం, తెలంగాణ బ్యూరో : కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో సీనియర్ నేతలే లేనట్లు తెలంగాణ వ్యతిరేకికి ఎంపీ సీటు ఇవ్వడంపై బీఆర్‌ఎస్ రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర అన్నారు. కాంగ్రెస్ తెలంగాణ ఆత్మగౌరవాన్ని ఢిల్లీలో తాకట్టు పెట్టిందని, రాష్ట్రంలోని కాంగ్రెస్‌ నేతలను పార్టీ అధిష్ఠానం ఓ ఆట ఆడిస్తుందన్నారు. రాజ్యసభ సీటుకు కాంగ్రెస్‌లో అర్హులే లేనట్లు ఆ సీటును ఢిల్లీ నేతలకు అప్పగించడంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. గురువారం వద్దిరాజు తెలంగాణ భవన్‌లో విలేకరులతో మాట్లాడారు. తెలంగాణకు చెందిన కేశవరావు రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేస్తే కాంగ్రెస్‌ పార్టీకి రాష్ట్రంలో బీసీ, మాదిగ, మైనార్టీల్లో ఎవరికైనా ఇస్తారనుకున్నామని, వీహెచ్ లాంటి సీనియర్‌లు కాంగ్రెస్‌ అధిష్ఠానానికి కనిపించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఢిల్లీలోని అభిషేక్‌ సింఘ్వి కనిపించారని విమర్శించారు. తెలంగాణ విషయంలో అభిషేక్‌ సింఘ్వీ ఏ రోజు సానుకూలంగా స్పందించలేదని, తెలంగాణ ప్రజలను రెచ్చగొట్టే విధంగానే గతంలో మాట్లాడారన్నారు. కాంగ్రెస్‌లో ఎంతో మంది సీనియర్లు ఉన్నా రాజ్యసభ అవకాశం ఇవ్వలేదన్నారు. ముస్లిం, ముదిరాజ్‌, మున్నూరు కాపు, యాదవ కులాలకు మంత్రి వర్గంలో అవకాశం దక్కలేదని, కనీసం రాజ్యసభలోనైనా అవకాశం దక్కుతుందని చూశామన్నారు. రాష్ట్రంలో అర్హులు లేనట్లు ఢిల్లీ వారికి రాజ్యసభ సీటు ఇవ్వడం రాష్ట్ర ప్రజలను అవమానపర్చడమే వద్దిరాజు విమర్శించారు. సామాజిక వర్గాల పరంగానూ బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌ సమన్యాయం చేశారన్నారు. డీఎస్‌‌, బండ ప్రకాశ్‌, లింగయ్య యాదవ్‌ లాంటి వెనకబడిన సామాజిక వర్గాలకు అవకాశం కల్పించారని గుర్తుచేశారు.

Recent

- Advertisment -spot_img