Homeహైదరాబాద్latest Newsటీపీసీసీ రేసులో ఆ ముగ్గురు లీడర్లు.. త్వరలో నియామకం..!

టీపీసీసీ రేసులో ఆ ముగ్గురు లీడర్లు.. త్వరలో నియామకం..!

ఇదే నిజం, తెలంగాణ బ్యూరో: కాంగ్రెస్ అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో సీఎం పదవికి ఎంత ప్రాధాన్యత ఉంటుందో.. పీసీసీ(ప్రదేశ్​ కాంగ్రెస్ కమిటీ) చీఫ్​ పదవిని సైతం అంతే ముఖ్యమైనదిగా పార్టీ హైకమాండ్ భావిస్తుంది. ప్రభుత్వ నిర్ణయాలు, పార్టీకి సంబంధించిన మంచిచెడులను రాష్ట్ర అధ్యక్షుడే.. అధిష్టానానం దృష్టికి తీసుకెళ్తారు. దీంతోపాటు రాష్ట్రంలో పార్టీని క్షేత్రస్థాయిలో బలోపేతం చేసే బాధ్యతలు సైతం ఆయన మీదే ఉంటాయి. కాంగ్రెస్ అధికారంలో లేనప్పుడు ముఖ్యమంత్రి అభ్యర్థే పీసీసీ చీఫ్​గా ఉన్నప్పటికీ.. పవర్​లోకి వచ్చాక మాత్రం ఆ పరిస్థితి ఉండదు. అధిష్టానం మరొకరికి పీసీసీ బాధ్యతలను అప్పగిస్తుంది. రేవంత్ రెడ్డి.. 2021జూన్​లో పీసీసీ చీఫ్​ అయ్యారు. అప్పటివరకు తెలంగాణలో ఢీలాపడిపోయిన కాంగ్రెస్​ పార్టీని రేవంత్ రెడ్డి ఫుల్ యాక్టివ్​ మోడ్​లోకి తెచ్చారు. పార్టీకి కొత్త ఊపు తీసుకొచ్చి శ్రేణుల్లో ఉత్సాహం నింపారు. కేసీఆర్​ను గద్దె దించడమే లక్ష్యంగా పనిచేశారు. అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్​ ఓడిపోయి.. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. డిసెంబర్ 7న సీఎంగా రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేశారు. అయితే, ముఖ్యమంత్రే పీసీసీ చీఫ్​గా కొనసాడమనేది కాంగ్రెస్ పార్టీ చరిత్రలోనే అరుదు. ఆ పార్టీ అధికారంలో ఉన్న కర్ణాటకలోనూ సిద్ధరామయ్య ముఖ్యమంత్రి కాగా.. డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ పీసీసీ చీఫ్​గా ఉన్నారు. ఈ నేపథ్యంలో తెలంగాణలోనూ పీసీసీ పదవికి మంచి డిమాండ్ ఏర్పడింది. లోక్​సభ ఎన్నికలు ఉండటంతో ఏఐసీసీ.. తెలంగాణలో పీసీసీ చీఫ్​ను మార్చలేదు. రేవంత్ రెడ్డినే పార్టీ ప్రెసిడెంట్ పదవిలో కొనసాగుతున్నారు. లోక్​సభ ఎన్నికల రిజల్ట్స్ తర్వాత పీసీసీ చీఫ్​ మార్పు ఉండొచ్చని తెలుస్తోంది. రాష్ట్రంలో తొందరలోనే గ్రామపంచాయతీ, మున్సిపల్ ఎన్నికలు ఉన్నాయి. ఎమ్మెల్సీ ఉప ఎన్నిక కూడా జరగనుంది. దీంతో పార్టీని ముందుండి నడిపించే సమర్థుడైన లీడర్​ను కొత్త పీసీసీ చీఫ్​ను నియమించాల్సిన అవసరం ఉంది. అయితే, ఆ​ పదవిని ఆశిస్తున్న వారిలో మంత్రులతో పాటు పలువురు కాంగ్రెస్ సీనియర్ లీడర్లు ఉన్నారు.

భట్టికి దక్కేనా?
పీసీసీ చీఫ్​ రేసులో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పేరు ప్రధానంగా వినిపిస్తోంది. ఆయన రాష్ట్రంలో ఇమేజ్ ఉన్న లీడర్. కాంగ్రెస్ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అసెంబ్లీ సెషన్లలో పార్టీ తరఫున వాయిస్​ వినిపించిన నేత. అసెంబ్లీ ఎన్నికలకు ముందు రాష్ట్రవ్యాప్తంగా పాదయాత్ర చేపట్టిన భట్టి.. రేవంత్ రెడ్డితో సమానంగా ఇమేజ్ పొందారు. కాంగ్రెస్​ను అధికారంలోకి తేవడంలో ఆయన పాత్ర కూడా ఉంది. లోక్​సభ ఎన్నికలకు ముందు ఖమ్మం ఎంపీ టికెట్​ను తన భార్య నందినికి ఇప్పించాలని భట్టి ప్రయత్నించారు. కానీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి.. ఢిల్లీ లెవెల్​లో లాబీయింగ్ చేశారు. దీంతో ఖమ్మం ఎంపీ టికెట్ ఆయన వియ్యంకుడికి దక్కింది. తన భార్యకు ఎంపీ సీటు ఇవ్వలేదు కాబట్టి.. ఇప్పుడు తనను పీసీసీ చీఫ్​ చేయాలనే డిమాండ్​ను భట్టి వినిపించే చాన్స్ ఉంది. వాస్తవానికి కాంగ్రెస్ అధికారంలోకి రాగానే సీఎం పదవి కోసం భట్టి.. బాగా ప్రయత్నించారు. కానీ కాంగ్రెస్ హైకమాండ్ ఆయనను కన్విన్స్​ చేసి.. రేవంత్ రెడ్డిని ముఖ్యమంత్రిని చేసింది. భట్టికి డిప్యూటీ సీఎం పదవి దక్కింది. అప్పుడే ఆయన పీసీసీ పదవి కావాలనే డిమాండ్​ను అధిష్టానం దగ్గర వినిపించినట్లు తెలుస్తోంది. మరోవైపు రేవంత్ రెడ్డినే పీసీసీ చీఫ్​గా కొనసాగించే పరిస్థితి లేదు. ముఖ్యమంత్రి, పీసీసీ చీఫ్​ రెండు కీలక పదవులు రెడ్డి సామాజిక వర్గానికి దక్కితే విమర్శలు వచ్చే అవకాశం ఉంది. ఎస్సీ, ఎస్టీలకు పీసీసీ చీఫ్​ పదవి ఇవ్వాలనే డిమాండ్​ వస్తే.. భట్టి ఆ విధంగా ప్రయత్నించొచ్చు. అయితే, భట్టికి పీసీసీ చీఫ్ పదవి ఇస్తే రేవంత్ రెడ్డి అడ్డుపడే అవకాశాలున్నాయి. ఇందుకు కారణం భట్టి విక్రమార్క.. రేవంత్ కోటరీ వ్యక్తి కాదు. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడి పదవిలో తన వ్యక్తి ఉంటేనే అన్ని నిర్ణయాలకు అనుకూలంగా ఉంటుందని రేవంత్ భావించే అవకాశం ఉంది. మరోవైపు మాదిగ సామాజికవర్గం కాంగ్రెస్ పార్టీపై ఇప్పటికే గుర్రుగా ఉంది. లోక్​సభ ఎన్నికల్లో కాంగ్రెస్ మాదిగ సామాజికవర్గానికి చెందిన ఒక్కరికి కూడా ఎంపీ టికెట్ ఇవ్వలేదు. రాష్ట్రంలో ఎస్సీ రిజర్వ్​డ్ ఎంపీ నియోజకవర్గాలైన పెద్దపల్లి, వరంగల్ టికెట్లను మాల సామాజికవర్గానికి చెందిన నేతలకే కాంగ్రెస్ కేటాయించింది. దీంతో మాదిగ సామాజికవర్గం హస్తం పార్టీపై కోపంతో ఉంది. దీంతో పాటు మాదిగలను కాంగ్రెస్ పార్టీ పట్టించుకోవడం లేదంటూ ఆ వర్గం నేతలు ఇప్పటికే పలు ఆరోపణలు, విమర్శలు చేస్తున్నారు. మాల సామాజికవర్గానికి చెందిన భట్టికి ఇది కొంత మైనస్​ అయ్యే అవకాశముంది.

అధ్యక్షుడి పదవి రాజగోపాల్​ రెడ్డిని వరించేనా?
కోమటిరెడ్డి బ్రదర్స్ నల్లగొండ జిల్లాలో సీనియర్ లీడర్లు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి తనకు మంత్రి పదవి కావాలని రాజగోపాల్ రెడ్డి డిమాండ్ చేస్తున్నారు. ఇప్పటికే ఆయన సోదరుడు వెంకట్​రెడ్డి మంత్రిగా ఉన్నారు. దీంతో రాజగోపాల్​ రెడ్డికి పదవి దక్కలేదు. మునుగోడు నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన రాజగోపాల్ రెడ్డి తనకు మంత్రి పదవి కావాలని బహిరంగంగానే
తన వాయిస్ వినిపిస్తున్నారు. ఇటీవల లోక్​సభ ఎన్నికల్లో భువనగిరి ఎంపీ టికెట్​ను తన భార్యకు ఇప్పించాలని రాజగోపాల్ రెడ్డి ప్రయత్నించారు. కానీ హైకమాండ్.. చామకూర కిరణ్​కుమార్​ రెడ్డికి టికెట్ ఇచ్చింది. ఇందుకోసం సీఎం రేవంత్ రెడ్డి.. రాజగోపాల్ రెడ్డి ఇంటికి వెళ్లి మరీ ఆయనను కన్విన్స్ చేశారు. కిరణ్​కుమార్​ రెడ్డికి సపోర్టు చేయాలని కోరారు. దీన్ని దృష్టిలో ఉంచుకొని రాజగోపాల్ రెడ్డి.. పీసీసీ చీఫ్​ పదవి అడిగే అవకాశముంది. అయితే, కోమటిరెడ్డి బ్రదర్స్ ఎప్పుడు ఏం మాట్లాడుతారో తెలియదనే విమర్శలున్నాయి. వెంకట్ రెడ్డి, రాజగోపాల్ రెడ్డి ఇద్దరూ.. మొదట రేవంత్ రెడ్డిని వ్యతిరేకించిన నేతలే. రాజగోపాల్ రెడ్డి గతంలో పార్టీని వీడి బీజేపీ నుంచి మునుగోడు ఉప ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయారు. ఆయన రెడ్డి సామాజికవర్గానికి చెందిన నేత. ఈ కారణాలన్నీ ఆయనకు మైనస్ అయ్యే అవకాశాలున్నాయి.

ఆశావహుల్లో మరికొందరు సీనియర్ లీడర్లు..
పీసీసీ చీఫ్​ రేసులో అలంపూర్ మాజీ ఎమ్మెల్యే, ఏఐసీసీ కార్యదర్శి సంపత్​కుమార్ పేరు కూడా వినిపిస్తోంది. ఆయన డైనమిక్ లీడర్. లోక్​సభ ఎన్నికల్లో నాగర్​కర్నూల్ ఎంపీ టికెట్ ఆశించి భంగపడ్డారు. ఆ టికెట్​ను కాంగ్రెస్ సీనియర్ నేత మల్లు రవికి హైకమాండ్ కేటాయించింది. ఇందుకోసం సీఎం రేవంత్ రెడ్డి.. సంపత్​ను కన్విన్స్ చేశాడు. ఆ టైమ్​లోనే పీసీసీ చీఫ్​ పదవిపై రేవంత్ ఆయనకు హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది. మల్లురవి కోసం ఎంపీ సీటును వదులుకున్న సంపత్.. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడి​ పదవిని అడిగే అవకాశం ఉంది. మాదిగ సామాజిక వర్గానికి చెందిన సంపత్​కు పీసీసీ ఇస్తే.. ఇప్పటికే కాంగ్రెస్​కు దూరమైన ఆ వర్గం మళ్లీ దగ్గరయ్యే చాన్స్ ఉంది. బలహీనవర్గాలకు పీసీసీ పదవిని ఇచ్చిన క్రెడిట్ సైతం కాంగ్రెస్​కు దక్కుతుంది. అయితే, సీఎం రేవంత్ రెడ్డి.. ఉమ్మడి మహబూబ్​నగర్​కు చెందిన నేత. సంపత్​కుమార్​ సైతం ఉమ్మడి పాలమూరుకు చెందిన నాయకుడు కావడం ఆయనకు మైనస్​ అయ్యే అవకాశముంది. సీఎం, పీసీసీ చీఫ్​ రెండూ పదవులు ఒకే జిల్లాకు చెందిన నేతలకు ఎలా ఇస్తారన్న విమర్శలు రావొచ్చు. మరోవైపు అసెంబ్లీ ఎన్నికల్లో ఉమ్మడి పాలమూరులోని అలంపూర్, గద్వాల తప్ప కాంగ్రెస్ అన్ని అసెంబ్లీ స్థానాల్లో గెలుపొందింది. సంపత్​కుమార్ అలంపూర్ నుంచి పోటీ చేసి ఓడిపోయారు. ఓటమి చెందిన నేతలకు ఎలాంటి పదవులు ఇవ్వొద్దన్న కారణం కూడా సంపత్​కు మైనస్ కావొచ్చు. పీసీసీ చీఫ్​ రేసులో మైనార్టీ వర్గానికి చెందిన సీనియర్ లీడర్ షబ్బీర్ అలీ పేరు సైతం వినిపిస్తోంది. షబ్బీర్ అలీ వివాదరహితుడు. సీఎం రేవంత్ రెడ్డికి దగ్గరి వ్యక్తి. అయితే, నిజామాబాద్ రూరల్​లో షబ్బీర్ అలీ ఓటమి ఆయనకు మైనస్ అయ్యే చాన్స్ ఉంది. దీంతో పాటు షబ్బీర్ అలీ.. రేవంత్ రెడ్డి కోటరీకి చెందిన వ్యక్తి కావడంతో అభ్యంతరాలు వచ్చే అవకాశం ఉంది. మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు సైతం ఈ రేసులో ఉన్నట్లు తెలుస్తోంది. శ్రీధర్ బాబు అందరికీ కావాల్సిన నేత. కానీ ఆయన కూడా అగ్ర సామాజిక వర్గానికి చెందిన నేత కావడం మైనస్​గా మారింది. మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి సైతం పీసీసీ చీఫ్​ రేసులో ఉన్నారు. ఆయన డైనమిక్ లీడర్. రాహుల్ గాంధీకి సన్నిహితుడు. మొదటి నుంచి జగ్గారెడ్డికి రేవంత్ రెడ్డితో సయోధ్య లేదు. కానీ పీసీసీ చీఫ్​ పదవిని దృష్టిలో పెట్టుకొని ఇటీవల ఆయన వైఖరి మారినట్లు తెలుస్తోంది. కొంతకాలంగా ఆయన జనాల్లో తిరుగుతూ మళ్లీ ఫోకస్ అవుతున్నారు. లోక్​సభ ఎన్నికల్లో జగ్గారెడ్డి మెదక్ ఎంపీ సీటును ఆశించి భంగపడ్డారు. అధిష్టానం ఆ సీటును నీలం మధుకు కేటాయించింది. దీంతో జగ్గారెడ్డి.. పీసీసీ పదవి అడిగే అవకాశం ఉంది. అయితే, అసెంబ్లీ ఎన్నికల్లో సంగారెడ్డి నుంచి ఎమ్మెల్యేగా ఓడిపోవడం ఆయనకు మైనస్​గా మారింది. ఇక బీసీ సామాజిక వర్గం నుంచి మంత్రి పొన్నం ప్రభాకర్ పేరు బలంగా వినిపిస్తోంది. మొత్తానికి పీసీసీ చీఫ్​ పదవి ఎవరికి ఇవ్వాలనేది కాంగ్రెస్ అధిష్టానానికి చిక్కుముడిగా మారనుంది. రాష్ట్ర వ్యవహారాల ఇన్​చార్జి దీపాదాస్ మున్షీ ఇప్పటికే దీనిపై కసరత్తులు ప్రారంభించారు. ఏఐసీసీ అధ్యక్షుడు ఖర్గేకు రిపోర్టు కూడా పంపారు. అయితే, దీనిపై నిర్ణయం తీసుకోవడం ఏఐసీసీకి సవాల్​గా మారింది. పీసీసీ చీఫ్​ పదవి ఎవరిని వరించనుందో లోక్​సభ ఎన్నికల ఫలితాల తర్వాతే తెలియనుంది.

Recent

- Advertisment -spot_img