HomeEnglishThose two who were sentenced to death are innocent! ఉరి శిక్ష పడిన...

Those two who were sentenced to death are innocent! ఉరి శిక్ష పడిన ఆ ఇద్దరూ నిర్దోషులే!

– నిఠారీ వరుస హత్యల కేసులో అలహబాద్ హైకోర్టు కీలక తీర్పు
– సరైన సాక్ష్యాలు లేని కారణంగా నిర్దోషులుగా ప్రకటించిన కోర్టు

ఇదే నిజం, నేషనల్ బ్యూరో: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన 2005-06 నిఠారీ వరుస హత్యల కేసులో ఉత్తరప్రదేశ్‌లోని అలహాబాద్‌ హైకోర్టు సోమవారం కీలక తీర్పు వెలువరించింది. ఈ ఘటనకు సంబంధించిన పలు కేసుల్లో దోషులుగా తేలి మరణశిక్ష ఎదుర్కొంటున్న సురేందర్‌ కోలీ, మానిందర్‌ సింగ్‌ పంధేర్‌ను నిర్దోషులుగా ప్రకటించింది. సరైన సాక్ష్యాలు లేని కారణంగానే వారిని నిర్దోషులుగా పరిగణిస్తున్నట్లు కోర్టు తెలిపింది. దీంతో ఈ కేసుల్లో వారి మరణశిక్ష రద్దయినట్లైంది.

ఇదీ కేసు..

నోయిడాలోని నిఠారీ గ్రామంలో 2005 నుంచి 2006 మధ్య వరుస హత్యలు చోటుచేసుకున్నాయి. 2006 డిసెంబర్​లో స్థానిక వ్యాపారవేత్త మానిందర్‌ సింగ్‌ పంధేర్‌ ఇంటి సమీపంలోని ఓ మురికి కాలువలో కొన్ని మానవ అవశేషాలు కన్పించాయి. ఆ శరీరభాగాలను గుర్తించిన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారమిచ్చారు. అనంతరం దర్యాప్తు చేపట్టగా ఈ వరుస హత్యలు వెలుగులోకి వచ్చాయి. దర్యాప్తులో పంధేర్‌ ఇంటి వెనుక పెరట్లో అనేక మంది చిన్నారులు, యువతుల అస్థిపంజరాలు బయటపడ్డాయి. ఇవన్నీ ఆ ప్రాంతంలో ఏడాదిగా కన్పించకుండా పోయిన పేద చిన్నారులు, యువతులవేనని పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. అనంతరం ఈ కేసులో సీబీఐ దర్యాప్తు చేపట్టగా.. ఒళ్లు గగుర్పొడిచే విషయాలు వెలుగులోకి వచ్చాయి. పంధేర్‌ ఇంట్లో పనిచేసే సురేందర్‌ కోలీ.. చిన్నారులకు స్వీట్లు, చాక్లెట్ల ఆశ చూపి ఇంటికి ఆహ్వానించేవాడని దర్యాప్తులో తేలింది.

అనంతరం వారిని హత్య చేసి, మృతదేహాలపై లైంగిక దాడి చేశారని ప్రాథమికంగా నిర్ధారణ అయ్యింది. ఆ తర్వాత శరీర భాగాలను ఇంటి వెనుక భాగంలో విసిరేశారని సీబీఐ ఆరోపించింది. వీరు నరమాంసభక్షకులనే ఆరోపణలు కూడా వచ్చాయి. దీంతో.. పంధేర్‌, సురేందర్‌ కోలీపై మొత్తం 19 కేసులు నమోదు చేశారు. సరైన సాక్ష్యాధారాలు లేని కారణంగా వీటిలో మూడింటిని మూసివేశారు.

దీనిపై విచారణ జరిపిన ట్రయల్‌ కోర్టు.. వీటిల్లోని కొన్ని కేసుల్లో సురేందర్‌ కోలీని దోషిగా తేల్చి మరణశిక్ష విధించింది. మరోవైపు, పంధేర్‌ కొన్ని కేసుల్లో నిర్దోషిగా బయటపడగా.. రెండు కేసుల్లో దోషిగా తేలడంతో అతడికి ఉరిశిక్ష విధించింది. అయితే, 12 కేసుల్లో తనకు పడిన మరణశిక్షను సవాల్‌ చేస్తూ కోలీ, రెండు కేసుల్లో తనకు విధించిన మరణశిక్షను సవాల్‌ చేస్తూ పంధేర్‌ అలహాబాద్‌ హైకోర్టును ఆశ్రయించారు. వీరి పిటిషన్లపై ఇటీవల విచారణ జరిపిన న్యాయస్థానం.. సోమవారం తీర్పు వెలువరించింది. ఈ 14 కేసుల్లో వీరిద్దరికీ వ్యతిరేకంగా ప్రత్యక్ష సాక్షులు, సరైన ఆధారాలు లేని కారణంగా వీరిని నిర్దోషులుగా ప్రకటించింది. దీంతో ఈ కేసుల్లో వారి మరణశిక్ష రద్దయినట్లైంది. కాగా.. ఈ నిఠారీ హత్యలకు సంబంధించి మరో కేసులో సురేందర్‌ కోలీ మరణశిక్షను గతంలో అలహాబాద్‌ హైకోర్టు సమర్థించింది. ఇంకో కేసులో అతడి ఉరిశిక్షను జీవిత ఖైదుకు తగ్గించారు.

RELATED ARTICLES

Recent

- Advertisment -spot_img