ఓ వర్గంపై అనుచిత వ్యాఖ్యలు చేసిన గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్‌పై బీజేపీ సస్పెన్షన్ వేటు వేసింది.
పార్టీనుంచి సస్పెండ్ చేస్తున్నట్లు ఆ పార్టీ మంగళవారం ప్రకటించింది. పార్టీ విధానాలకు వ్యతిరేకంగా మాట్లాడినందుకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపింది. శాసన సభాపక్ష పదవినుంచి కూడా తొలగించింది. సెప్టెంబర్ 2లోగా వివరణ ఇవ్వాలని ఎమ్మెల్యే రాజాసింగ్‌ను హైకమాండ్ ఆదేశించింది.
మహ్మద్ ప్రవక్తపై రాజాసింగ్ చేసిన వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా వివాదం రేపాయి. రాజాసింగ్ అనుచిత వ్యాఖ్యలపై ఆగ్రహంతో బీజేపీ సస్పెన్షన్ వేటు వేసింది. ఎందుకు బహిష్కరించకూడదో వివరణ ఇవ్వాలని రాజాసింగ్‌ను బీజేపీ ప్రశ్నించింది. నగరంలో ప్రముఖ కమెడియన్ మునావర్ ఫారూకి షో సందర్భంగా ఎమ్మెల్యే రాజాసింగ్ ఓ వీడియోను యూట్యూబ్‌లో విడుదల చేశారు. ఈ వీడియోలో మహమ్మద్ ప్రవక్తపై అనుచిత వ్యాఖ్యలు చేసినట్లు ఓ వర్గం ఆరోపిస్తున్నది. ఈ మేరకు పలువురు నగర పరిధిలోని పలు స్టేషన్లలో ఎమ్మెల్యే రాజాసింగ్‌పై ఫిర్యాదు చేశారు. సోమవారం రాత్రి నగరంలోనూ ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా నిరసన ప్రదర్శన నిర్వహించారు. తమ మనోభావాలను రాజాసింగ్ దెబ్బతీశారని ఆందోళనకారులు ఆరోపించారు. వారి ఫిర్యాదు మేరకు ఎమ్మెల్యే రాజాసింగ్‌ను పోలీసులు అరెస్టు చేశారు.